Share News

పత్తి రైతుకు ‘కపాస్‌’ కష్టాలు

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:21 PM

పత్తి అమ్మకాల కోసం కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా తయారైంది.

 పత్తి రైతుకు ‘కపాస్‌’ కష్టాలు

- ఏజెన్సీ ప్రాంతాల్లో వేధిస్తున్న సిగ్నల్స్‌ సమస్యలు

- స్లాట్‌ బుకింగ్‌ కోసం తప్పని ఇబ్బందులు

వాంకిడి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పత్తి అమ్మకాల కోసం కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా తయారైంది. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగువుతుంది. చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయించుకోవాలంటే ముందుగా రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఇందులో రైతు పేరు, ఊరు, సర్వే నంబరు, సాగుచేసిన పంటల విస్తీర్ణం తప్పనిసరి నమోదు చేయాల్సి ఉంటుంది. తేమ 12 శాతం దాటితే సీసీఐ అసలు కొనుగోలు చేయదు. తేమ శాతమే ప్రతిబంధకంగా మారుతుందనుకుంటే ఈ ఏడాది కొత్తగా కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలనే నిబంధన రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి నిబంధనలు విధించడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

- ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్‌ సమస్య

ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగా పనిచేయవు. పింఛన్లు, రేషన్‌ బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వ సిబ్బంది, డీలర్లు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పత్తిని ప్రధాన పంటగా రైతులు సాగు చేసుకుంటున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, తిర్యాణి, వాంకిడి, బెజ్జూరు, చింతలమానేపల్లి, కెరమెరి, జైనూర్‌ లాంటి మారుమూల ప్రాంతాల్లో కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌బుక్‌ చేసుకోవడమనేది రైతులకు పరీక్షలా మారనుంది. వ్యవసాయ అధికారులు కపాస్‌ కిసాన్‌ యాప్‌పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యాప్‌పై సరైన అవగాహన కలగడంలేదని రైతులు పేర్కొంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో అనేక మంది నిరక్షరాస్యులైన రైతుల వద్ద స్మార్ట్‌ ఫోన్‌లు కూడా లేకపోవడంతో స్లాట్‌ బుకింగ్‌ రైతులకు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు కపాస్‌ కిసాన్‌ యాప్‌పై సరైన అవగాహనలేక అనేక మంది రైతులు స్లాట్‌ బుకింగ్‌ చేయలేక పత్తి విక్రయించలేని పరిస్థితి నెలకొందని కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

- స్లాట్‌ బుకింగ్‌పై ఆందోళన

మార్కెట్‌కు వెళ్లే 24 గంటల ముందు రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు విక్రయించే రోజున స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే వీల్లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో స్లాట్‌ బుకింగ్‌పై అవగాహనలేని రైతులు పత్తి విక్రయాలపై ఆందోళనలకు గురవుతున్నారు. సరైన సిగ్నల్స్‌ లేకపోవడం, స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన లేకపోవడంతో స్లాట్‌ బుకింగ్‌పై అనిశ్చితి నెలకొంది. అనేక మంది రైతులకు సంబంధించిన సెల్‌ఫోన్‌ నంబర్లు మారిపోవడం, కొంతమంది రైతులకు ఫోన్‌ లేకపోవడంతో వ్యవసాయ కార్యాలయంలో రైతుల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ప్రస్తుతం పత్తి విక్రయించేందుకు స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరిగా చేయాల్సి ఉంది. సెల్‌ఫోన్‌ నంబరు వ్యవసాయ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో నమోదై ఉంటేనే స్లాట్‌బుక్‌ అయినట్లు ఓటీపీ వస్తుంది. వ్యవసాయ కార్యాలయంలో ఫోన్‌ నంబరు నమోదు కాని రైతులు స్లాట్‌ బుకింగ్‌ చేయలేక అయోమయ స్థితిలో ఉన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 11:21 PM