ఊపందుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:26 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కాగజ్‌నగర్ పట్టణంలో ఊపందుకున్నాయి.
- నిబంధనల సడలింపుతో ఉత్సాహం
- జీ+1 నిర్మాణాలకు అనుమతి
- లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కాగజ్‌నగర్ పట్టణంలో ఊపందుకున్నాయి. సుమారు 80 శాతం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, జిల్లాలో 1,625 మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. కాగజ్‌నగర్ పట్టణంలో 500 ఇళ్లగానూ సుమారు 387 ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 310 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ పూర్తి కాగా, మరో 111 ఇళ్లు గోడలు పూర్తి కావస్తున్నాయి. వివిధ దశల్లో ఉన్న వాటికి బిల్లుల చెల్లింపుల్లో కూడా జాప్యం రాకుండా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల్లో ఆఖరి దశ పూర్తి చేసుకొని మరో రెండు నెలల్లో ఇళ్ల నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన 20 శాతం మంది లబ్ధిదారులకు కూడా రుణాలు అందించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో, మురికి వాడల్లో నివసిస్తున్న వారికి చిన్న పాటి స్థలం ఉండడంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ కట్టుకోలేని వారికి ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో ఆనందం వ్యక్తం అవుతోంది.
- నిబంధనల సడలింపుతో మరింత వేగం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిబంధనలు సడలించడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జిల్లా వ్యాప్తంగా వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. మొత్తం 1,625 ఇళ్ల మంజూరుకు గానూ 1,000కి పైగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పలు కారణాలతో నిర్మాణం చేపట్టకుంటే వారి వద్ద నుంచి నాన్ విల్లింగ్ పత్రాలు తీసుకొంటున్నారు. గతంలో మొదటి విడతలో స్థలంలేక ఇబ్బందులు పడి నిర్మాణం మొదలు పెట్టలేని వారికి 400 చదరపు అడుగుల్లోనే నిర్మాణానికి అనుమతినిస్తూ జీవో జారి చేసింది. 400 చదరపు అడుగుల కంటే తక్కువగా స్థలం ఉన్న చోట జీ+1 నిర్మాణం కూడా చేపట్టవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అఽధికారులు పేర్కొంటున్నారు. గతంలో 600 చదరపు అడుగులలోనే నిర్మాణాలు ఉండాలని నిబంధనలుండేవి. అయినా కూడా నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి లేకుంటే రాయించుకొని సంబంధిత శాఖకు పంపిస్తున్నారు. వీటి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో ఇంకా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఇళ్లు మొదలు పెట్టని లబ్ధిదారుల కోసం వెసులుబాటు కల్పించడంతో లబ్ధిదారులకు తెలియజేసేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
- రాజేందర్, మున్సిపల్ కమిషనర్ కాగజ్‌నగర్
ప్రభుత్వం సవరించిన నిబంధనలతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో చాలామందికి నిర్మాణం చేసుకునే వీలు దక్కింది. ప్రభుత్వం నూతన ఆదేశాలతో పేదలకు లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.