Share News

శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:15 PM

జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల, దాని అనుబంధ ఆస్పత్రి శాశ్వత భవనాల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మంచిర్యాల జిల్లాగా ఏర్పడ్డ తరువాత మెడికల్‌ కళాశాలతోపాటు దానికి అనుబంధంగా 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరయ్యాయి.

శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం
తుది దశకు చేరుకున్న వైద్య కళాశాల భవన నిర్మాణం

- 90 శాతం మేర పనులు పూర్తి

- రూ. 216 కోట్ల అంచనా వ్యయం

మంచిర్యాల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల, దాని అనుబంధ ఆస్పత్రి శాశ్వత భవనాల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మంచిర్యాల జిల్లాగా ఏర్పడ్డ తరువాత మెడికల్‌ కళాశాలతోపాటు దానికి అనుబంధంగా 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరయ్యాయి. వైద్య కళాశాల ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఓ తాత్కాలిక గోదాములో నిర్వహిస్తుండగా, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సుమారు 50 ఏళ్లనాటి పురాతన భవనంలో కొనసాగిస్తున్నారు. వైద్య కళాశాలతోపాటు అనుబంధ వైద్యశాలకు సొంత భవనాలు మంజూరు కాగా, వాటి నిర్మాణ పనుల్లో ఇటీవల వేగం పుంజుకుంది. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తరుచుగా రెండు భవనాలను సందర్శిస్తూ నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు దాదాపు 90 శాతం మేర పూర్తికాగా, ఆసుపత్రి నిర్మాణం కూడా ఇంచుమించు అంతే వేగంగా కొనసాగుతోంది.

- నాలుగు విభాగాలుగా పనులు..

జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. వైద్య కళాశాలకు శాశ్వత భవన నిర్మాణ కోసం అవసమైన స్థలాన్ని మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేట సమీపంలో కేటాయించారు. వైద్య కళాశాలతోపాటు ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు 2024 ఆగస్టులో అగ్రిమెంట్‌ పూర్తికాగా 2026 మార్చి 30 వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. వైద్య కళాశాల భవనానికి రూ. 216 కోట్ల అంచనా వ్యయంతో డాస్‌ ఇంజనీరింగ్‌ కంపెకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. కాగా నిర్మాణ పనులను నాలుగు విభాగాలుగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా బాయ్స్‌ హాస్టల్‌ను జి+6తో నిర్మిస్తుండగా, గర్ల్స్‌ హాస్టల్‌ను జి+7, కళాశాల భవనం జి+3, ప్రిన్సిపాల్‌ క్వార్టర్‌తోపాటు గెస్ట్‌ హౌజ్‌ను జి+2లో నిర్మిస్తున్నారు. ఈ పనులు ప్రస్తుతం 90 శాతం మేర పూర్తికాగా, గడువులోపు లక్ష్యం చేరేలా వేగవంతం చేశారు.

- 93 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణం....

వైద్య కళాశాలకు అనుబంధంగా మంజూరైన 350 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి శాశ్వత భవన నిర్మాణానికి కాలేజ్‌ రోడ్డులోని బీట్‌ మార్కెట్‌ ఆవరణలో స్థలం కేటాయించారు. రూ. 93 కోట్ల 93 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా, పనుల్లో వేగం పుంజుకుంది. మొత్తం మూడంతస్తులతో కూడిన ఆస్పత్రి భవన నిర్మాణంలో భాగంగా పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్థలం కేటాయింపు, అందులోని ఇతర కట్టడాలు తొలగించడంలో జాప్యం కారణంగా ఆస్పత్రి భవన నిర్మాణ పనులు కొంతమేర ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ప్రభుత్వపరంగా వైద్యసేవలు మెరుగుపడనున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందుతుండగా, అరకొర సౌకర్యాల నడుమ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నూతన భవన నిర్మాణం పూర్తయితే అధునాతన సౌకర్యాలతోపాటు వైద్య నిపుణులతో అత్యున్నత వైద్య చికిత్సలు అందే అవకాశాలు ఉన్నాయి.

- ఇరుకు రోడ్డుతోనే ఇబ్బందులు....

కాలేజి రోడ్డులో 350 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మితమవుతున్న ఆసుపత్రి భవనానికి వెళ్లాలంటే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద నుంచి కాలేజ్‌ రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరుకైన రోడ్డు కావడం, విపరీతమైన వాహనాల రద్దీ ఉండటంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ప్రారంభమైతే వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రోగులు, వారి బంధువుల రాకతో ట్రాఫిక్‌ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ కారణంగా ఓవర్‌ బ్రిడ్జి కింద నుంచి వాహనాల రాకపోకలకు తరుచుగా అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రి భవన నిర్మాణ స్థలం అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ విశాలమైన రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 11:15 PM