డీసీసీ అఽధ్యక్ష పదవికి పోటాపోటీ
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:21 PM
కాంగ్రెస్ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ, ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త వారిపేర్లు తెరపైకి వస్తున్నాయి.
- రోజు రోజుకూ పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
- షార్ట్ లిస్టులో పేర్ల కోసం పైరవీలు
- తెరపైకి వస్తున్న కొత్త దరఖాస్తుదారుల పేర్లు
మంచిర్యాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ, ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త వారిపేర్లు తెరపైకి వస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న విషయం కూడా గోప్యంగా ఉంచగా, ఇప్పుడిప్పుడే ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో డీసీసీ పదవికి ఉన్న డిమాండ్‌పై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనగా, అది ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నాయకుల్లో నెలకొంది. ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించడం, మూడురోజుల పాటు స్థానికంగా ఉండి దరఖాస్తులు స్వీకరించడంతోపాటు పార్టీకి చెందిన ముఖ్యనేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండగా, ఎన్నడూ లేని విధంగా కొత్తగా దరఖాస్తు ప్రక్రియకు తెరతీయడంతో ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.
- తెరపైకి మరికొందరు..
డీసీసీ అధ్యక్షుల నియామకం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత ఉండే అవకాశం ఉంది. ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉండటంతో అటు తరువాతనే నియామకాలు జరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దరఖాస్తులను పూర్తిస్థాయిలో స్ర్కూటినీ చేసిన ఏఐసీసీ పరిశీలకులు వాటిని షార్ట్ లిస్ట్ చేసి, ఢిల్లీ పెద్దలకు అందజేశారు. దీంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల నియామకం జరుగనుండగా, రోజురోజుకు దరఖాస్తు చేసుకున్న కొత్తవారి పేర్లు బయటకు వస్తున్నాయి. గడువులోగా గుట్టుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, సమయం ఆసన్నమవుతుండటంతో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నవారు తాము కూడా రేసులో ఉన్నట్లు పలువురు ఆశావహులు సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.
- 29 మంది దరఖాస్తు....
డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లా నుంచి ఏకంగా 29 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో సీనియర్లు, గతంలో వివిధ పదవులను అలంకరించిన వారితోపాటు కొత్తవారు కూడా ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సెగ్మెంట్ల పరిధిలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనలతో వారంతా దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకూ సమాచారం లేకుండా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. డీసీసీ రేసులో ఉండి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియర్లు మంచిర్యాల నియోజకవర్గం నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కేవీ ప్రతాప్, డాక్టర్ నీలకంఠేశ్వర్‌గౌడ్, ముత్తినేని రవికుమార్, గడ్డం త్రిమూర్తి ఉన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది సిరిపురం రాజేశ్ పేరు తెరపైకి వచ్చింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకు సన్నిహితుడైన సిరిపురం రాజేశ్ ఓసీ కేటాగిరి కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రేంసాగర్‌రావుతో విబేధించి, దూరంగా ఉంటున్న ఓసీ కేటగిరికే చెందిన సీనియ ర్ నాయకుడు కేవీ ప్రతాప్ డీసీసీ పదవికి దరఖాస్తు చేసుకోవడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన సిరిపురం ఆయనపై పోటీగా రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోం ది. అలాగే చెన్నూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, పిన్నింటి రఽఘునాథరెడ్డి, నూకల రమేష్, బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కారుకూరి రాంచందర్ తదితరులు ఉన్నారు.
- షార్ట్ లిస్టులో పలువురి పేర్లు...
ఏఐసీసీ పరిశీలకులు గత నెల 16 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వివిధ సెగ్మెంట్ల పరిధిలోని ముఖ్య నాయకులు ఒక్కొక్కరితోనూ ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. పరిశీలకులు స్వీకరించిన మొత్తం దరఖాస్తుల్లో ఆరుగురిని షార్ట్ లిస్టు కింద ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే షార్ట్‌లిస్టులో పేర్లున్నట్లు భావిస్తున్న నాయకులు తమ పైరవీలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం తోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు ఢిల్లీస్థాయిలో తమ పలుకుబడి ని ఉపయోగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. షార్ట్ లిస్టులో మంచిర్యాల నియోజకవర్గం నుంచి ముగ్గురు, చెన్నూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు, బెల్లంపల్లి నుంచి ఒక్కరి పేర్లు ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం ఏఐసీసీ పెద్దల దృష్టి అంతా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ఉండగా, ఆ ప్రక్రియ ముగిసిన తరువాతనే షార్ట్‌లిస్టును పరిశీలించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.