Share News

డీసీసీ పదవికి పోటాపోటీ

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:42 PM

కాంగ్రెస్‌ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ త్వరలో డీసీసీ పదవులు భర్తీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

డీసీసీ పదవికి పోటాపోటీ

- దరఖాస్తులు ఆహ్వానిస్తుండటంతో పెరుగుతున్న సంఖ్య

- జిల్లాలో తెరపైకి వస్తున్న పలువురు సీనియర్ల పేర్లు

- అధిష్ఠానం మద్దతు కోసం ఆశావహుల ఆరాటం

- మంత్రులు, ఎమ్మెల్యేలతో టచ్‌లోకి ముఖ్య నేతలు

- 16న జిల్లాలో పర్యటించనున్న అబ్జర్వర్ల బృందం

మంచిర్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ త్వరలో డీసీసీ పదవులు భర్తీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డీసీసీ పదవి కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో పదవులు ఆశించి భంగపడ్డ నేతలు, జిల్లా స్థాయిలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ ముఖ్య నాయకులకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామని, త్వరలో నామినేటెడ్‌తో పాటు పార్టీ పదవుల కేటాయింపు ఉంటుందని అధిష్ఠానం ప్రకటించడంతో ఆ పార్టీ క్యాడర్‌లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. దీంతో పదవులు ఆశిస్తున్న నాయకులు ఎమ్మెల్యేల ద్వారా పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. డీసీసీ పదవిని జిల్లాలోని శాసనసభ్యులకే ఇవ్వాలని గతంలో పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, ఇతర ముఖ్య నేతలకే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ పదవుల అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

సత్తా ఉన్న నాయకులకే....

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష నియామకం కోసం పీసీసీ ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో డీసీసీ పదవిని ఆశిస్తున్న పార్టీ సీనియర్‌ నాయకులు జిల్లాలో పర్యటిస్తున్న ఏఐసీసీ పరిశీలకులను కలిసి దరఖాస్తులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఇప్పటికే సూచించారు. దీంతో జిల్లాలోని పలువురు సీనియర్‌ నేతలు, క్రియాశీలకంగా ఉన్న వారు దరఖాస్తు సైతం చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖ ఉన్నారు. రెండు పర్యాయాలుగా ఆమె పదవిలో ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో పార్టీ కోసం కష్టపడ్డ పలువురు సీనియర్‌ నాయకులు ఉండగా, వారంతా ప్రస్తుతం ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల కనుసన్నల్లో పయనిస్తున్నారు. దీంతో స్వతహాగా డీసీసీ పదవిని అలంకరించే స్థాయి గల వ్యక్తుల కోసం అధిష్ఠానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ల జాబితాను ఇప్పటికే తెప్పించిన అధిష్ఠానం వారితో దరఖాస్తు కూడా చేయించినట్లు తెలుస్తోంది.

పదవి ఎవరిని వరించేనో?

డీసీసీ పదవి కోసం జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. మంచిర్యాల నియోజక వర్గం నుంచి ప్రస్తుత అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మరోమారు డీసీసీ పదవిని అలంకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు పదవిని అలంకరించిన ఆమెకు క్యాడర్‌ను ఏకతాటిపై ఉంచారన్న పేరు ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. ప్రస్తుతం పదవిని అలంకరిస్తున్న కొక్కిరాల సురేఖనే మరోమారు కొనసాగించవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సురేఖ ఇప్పటికే రెండుసార్లు డీసీసీ అధ్యక్షురాలిగా పనిచేసినందున మళ్లీ ఆమెకే ఇవ్వకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్‌ నాయకుడు కేవీ ప్రతాప్‌ కూడా ఉన్నారు. ఆయన మంత్రి గడ్డం వివేకానంద, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ వారికి మద్దతుగా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ప్రతాప్‌ తనదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అలాగే చెన్నూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండగా 12 సంవత్సరాలపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా, స్టేట్‌ సెక్రెటరీగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే పీసీసీ మెంబర్‌గా ఉన్న చెన్నూర్‌ నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్‌కు చెందిన మరో సీనియర్‌ నేత పిన్నింటి రఘునాథ్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్‌ యూత్‌ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, పీసీసీ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మరో సీనియర్‌ నేత, మాజీ జడ్పీటీసీ కారుకూరి రాంచందర్‌ కూడా డీసీసీ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

16 నుంచి పరిశీలకుల పర్యటన..

డీసీసీ పదవుల భర్తీ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఏఐసీసీ పరిశీలకుల బృందం జిల్లాలో పర్యటించనుంది. ఆశావహుల నుంచి బృంద సభ్యులు నేరుగా దరఖాస్తులు స్వీకరించనుండగా, ముఖ్య కార్యకర్తలతో సమావేశాల ఏర్పాటు, ప్రజలతోనూ మమేకం కానున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి డీసీసీ అభ్యర్థుల గురించి వాకబు చేయనున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షులు పార్టీలో ప్రత్యేక భూమిక పోషించనున్న నేపథ్యంలో పదవుల భర్తీని పీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ, ఇతర ముఖ్య సమావేశాలకు డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానుండటంతోపాటు రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి ప్రతిష్టాత్మకంగా మారింది.

Updated Date - Oct 14 , 2025 | 11:42 PM