చెరువులోకి చేప చేరేనా?
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:41 PM
మత్స్యకారుల ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో కొన్నేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
- వర్షాకాలం ప్రారంభమైనా మొదలు కాని టెండరు ప్రక్రియ
- ఉపాధిపై ప్రభావం పడుతుందని మత్స్యకారుల ఆందోళన
- జిల్లాలో 72 మత్స్యకార సంఘాలు
వాంకిడి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో కొన్నేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో మత్స్య కార్మిక సంఘాలు 72 ఉన్నాయి. ఇందులో 2,900 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో చేపపిల్లలను పంపిణీ చేసేందుకు అనుకూలంగా 280 చెరువులు, ప్రాజెక్టులు ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలోనే టెండర్లు పూర్తి చేసి వర్షాలు కురియగానే ఆగస్టు మొదటి వారంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
- కనిపించని హడావుడి...
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎలాంటి హడావుడి కనిపించడంలేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో అధికారులు ఆసక్తి చూపించడంలేదు. వేసవిలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి క్షేత్రస్థాయిలో చేపల సీడ్ చెరువులను పరిశీలించి ఆ తర్వాత అర్హులైన వారికి టెండర్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు ఇలాంటి చర్యలేవి చేపట్టకపోవడంతో ఈ సారి చేప పిల్లల పంపిణీ ఉంటుందో? లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- గతేడాది ఆలస్యంగా టెండర్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఈ పథకం కొనసాగింపు విషయంలో ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని చెరువుల్లో, ప్రాజెక్టుల్లో 72.93 లక్షల చేపపిల్లల విడుదల చేసేందుకు లక్ష్యం నిర్దేశించారు. కానీ టెండర్ ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో కేవలం 47.39 లక్షల చేప పిల్లలను మాత్రమే విడుదల చేశారు. గతేడాది సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించిన బిల్లులు కూడా మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. చేప పిల్లల పంపిణీకి నిధుల కొరతతో పాటు వర్షాభావ పరిస్థితులు కూడా కొంత ఇబ్బందికరంగా మారాయి. ఈసారి ఉచిత చేపపిల్లల పంపిణీని చేపట్టకుంటే మత్స్య కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం టెండర్లు పిలిచి లక్ష్యం మేరకు చేప పిల్లలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మత్స్య కార్మికులు కోరుతున్నారు.
- సమయం దాటితే....
చేప పిల్లలను సీజన్ ప్రారంభంలో చెరువుల్లో వదిలితే ఎనిమిది, తొమ్మిది నెలల్లో చేపలు పెరిగి ఆశించిన దిగుబడి లభిస్తుంది. కానీ అదును దాటాక చేప పిల్లలను పోసినా ఉపయోగం ఉండదు. ఆలస్యమైతే చేపలు ఎదగపోవడంతో పాటు దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా జూలైలో 50, 60 రోజుల చేప పిల్లలను చెరువుల్లో వదులుతారు. ఫిబ్రవరి మార్చి నాటికి చేప ఎదుగుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. జూలై తరువాత పిల్లలను కొనుగోలు చేసి వదిలినా చేప ఎదిగే అవకాశం ఉండదు. మార్చి నాటికి చెరువుల్లో నీటిమట్టం కూడా తగ్గిపోతుందని, ఈ ఏడాది ఉచిత చేప పిల్లలు లేనట్టేనని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.
నగదు బదిలీ చేయాలి
- మారుతి, మత్స్యకార్మికుడు
ఉచితంగా చేప పిల్లలు పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేయాలి. దీంతో తామే నాణ్యమైన చేప పిల్లల్ని కొనుగోలు చేసి తెచ్చుకొని సరైన సమయంలో చెరువుల్లో, కుంటల్లో వదులుకుంటాము. ఈ ఏడాది నుంచి అయినా నగదు బదిలీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు
- సాంబశివరావు
- జిల్లా మత్స్య శాఖ అధికారి
చేప పిల్లల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాము.