ధాన్యం కొనుగోళ్లపై బోనస్ ఎఫెక్ట్
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:44 PM
జిల్లాలో ఖరీఫ్ వరి పంట దాదాపు పూర్తి కావొచ్చింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సైతం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రబీ సీజన్‌లో సన్న ధాన్యం బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో ఈసారి ధాన్యం కొనుగోళ్లపై బోనస్ బకాయిల ప్రభావం పడే అవకాశం ఉంది.
- రైతులకు నేటికీ అందని రబీ బోనస్
- జిల్లాలో ప్రారంభం కానున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు
- ప్రైవేటు వ్యాపారుల వైపు అన్నదాతల చూపు
బెజ్జూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ వరి పంట దాదాపు పూర్తి కావొచ్చింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సైతం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రబీ సీజన్‌లో సన్న ధాన్యం బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో ఈసారి ధాన్యం కొనుగోళ్లపై బోనస్ బకాయిల ప్రభావం పడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి క్వింటాళ్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో గత రబీతో పాటు ఖరీఫ్ సీజన్‌లోనూ జిల్లాలో రైతులు భారీగా సన్నధాన్యాన్ని సాగు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పెద్ద మొత్తంలో సన్నధాన్యం వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత రబీ సీజన్‌లో రైతాంగం అత్యధికంగా సన్నధాన్యాన్ని సాగు చేసినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ మాత్రం ఇంకా ఇవ్వకపోవడంతో ఖరీఫ్ సీజన్‌లో సన్న ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటే తొందరగా డబ్బులు వస్తాయనే ఆలోచనలో రైతాంగం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ద్వారా మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తుండటంతో ఎక్కువ శాతం రైతులు సొసైటీలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్న ధాన్యం డబ్బుల చెల్లింపులు, బోనస్ ఆలస్యం వల్ల కొంత మంది రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపుచూసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు బోనస్ ప్రకటించినప్పటికీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం కారణంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర సక్రమంగాలేక ఖర్చులు పెరిగిపోయి బోనస్ డబ్బులతోనైనా పెట్టుబడి సహాయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్న రైతులు ప్రభుత్వం బోనస్ ఆలస్యంగా వేయడంతో కొంత నిరాశతో ఉన్నారు.
గత రబీలో 12,730.280మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ...:
జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరగడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో కూడా రికార్డు స్థాయిలో ధాన్యం వస్తుందని అధికారులు అంచనాకు వస్తున్నారు. గత రబీ సీజన్‌లో జిల్లాలో 2,506మంది రైతుల నుంచి 12,730.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకోసం జిల్లాలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 40కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ ద్వారా 22, సొసైటీల ద్వారా 18 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2506మంది రైతుల నుంచి ధాన్యం సేకరించగా ఇందులో 1,218మంది రైతులకు బోనస్ రావాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో రైతులు సైతం సన్నరకం ధాన్యం వేయడం ద్వారా లాభం ఉంటుందని భావిస్తున్నారు. రబీ సీజన్ ముగిసి మూడు నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ బోనస్ రాక అయోమయంలో ఉన్నారు.
56వేల ఎకరాల్లో వరి సాగు...
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 56వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించడంతో వరి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం అందించే బోనస్‌తో ఖరీఫ్ సాగుకోసం పెట్టుబడికి ఆసరాగా ఉంటుందని భావిస్తున్న రైతులకు బోనస్ చెల్లించడంలో ఆలస్యం కారణంగా రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సన్నాలు సాగుచేస్తే దిగుబడులు రావని చీడపీడల బెడదతో నష్టం ఉంటున్నప్పటికీ రైతులు మాత్రం బోనస్‌తో సన్నాలనే సాగు చేస్తున్నారు. రైతులు సన్నధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కాక రోజుల తరబడి పడిగాపులు కాసిన ఘటనలు ఉన్నాయి. ఈసారి ధాన్యం కొనుగోళ్లపై బోనస్ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సకాలంలో బోనస్ ఇవ్వని కారణంగా ఏ మేరకు ధాన్యం సేకరణ జరుగుతుందో చూడాలి. అదీగాక స్థానిక ఎన్నికల కోడ్ ప్రభావం కూడా బోనస్‌పై పడిందని భావిస్తున్నారు.