Share News

ఫుడ్‌జోన్‌పై నీలినీడలు

ABN , Publish Date - May 06 , 2025 | 11:29 PM

: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల క్రితం బెల్లంపల్లికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ మంజూరు కావడం అది జిల్లాలోని బెల్లంపల్లికి కేటాయించడంతో స్ధానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఫుడ్‌జోన్‌పై నీలినీడలు
అసంపూర్తిగా ఉన్న ఫుడ్‌జోన్‌కు వెళ్లే రహదారి

- నాలుగేళ్లుగా కొనసాగుతున్న నిర్మాణపనులు

- పరిశ్రమల స్థాపనకు ముందుకురాని వ్యాపారస్తులు

- అందుబాటులోకి వస్తే పలువురికి ఉపాధి అవకాశాలు

- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

బెల్లంపల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల క్రితం బెల్లంపల్లికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ మంజూరు కావడం అది జిల్లాలోని బెల్లంపల్లికి కేటాయించడంతో స్ధానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. మంజూరైన నాలుగేళ్లయినా పనులు పూర్తిస్ధాయిలో కాకపోవడం, మరో వైపు పరిశ్రమల స్ధాపనకు వ్యాపారస్తులు ముందుకు రాకపోవడంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే స్దానికులకు ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- నత్తనడకన నిర్మాణ పనులు

గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ జోన్‌ను బెల్లంపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల వెనకాల సర్వే నంబరు 170లో 350 ఎకరాల స్థలాన్ని సంబంధిత అధికారులు కేటాయించారు. ఈస్థలంలో పరిశ్రమల కోసం రహదారులు, వంతెనలు నాణ్యతతో నిర్మించకపోవడంతో వర్షాకలంలో వరదలకు రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. అనంతరం దాదాపు రూ. 50 కోట్ల నిధులతో ఫుడ్‌ జోన్‌ల ఏర్పాటు చేసే పరిశ్రమల కోసం 100 ఫీట్ల రహదారులు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుతో పాటు వివిధ నిర్మాణ పనులను సైతం చేపట్టారు. పరిశ్రమల కోసం చేసిన పనులే మళ్లీమళ్లీ చేయడంతో నిధులు నీళ్ల పాలు కావడంతో పాటు మరో వైపు సమయం వృధా అయ్యింది. ఫుడ్‌జోన్‌ ప్రాంతంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రస్తుతం దాదాపు పూర్తి అయ్యింది. ఫుడ్‌ జోన్‌లో రహదారుల పక్కన డ్రైనేజీలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. పరిశ్రమల కోసం నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధ జలాల కోసం శుద్ధిచేసే ప్లాంటుతో పాటు ఘన వ్యర్ధాల నిర్వహణకు అనువైన షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇందులో ఒక్కపని కూడా పూర్తి కాలేదు. ప్రధాన రహదారికి... సైతం ఇటీవలనే అనుమతులు లభించడంతో ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇలా నాలుగేళ్లుగా ఫుడ్‌జోన్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

- వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా...

జిల్లాలో రైతులు పండించే పంటల ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను మొదటగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. జిల్లాలో ఎక్కువగా రైతులు వరి, పత్తి, పప్పు దినుసులు, మామిడి సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ పంటలకు అనుగుణంగా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రైతులు ఉత్పత్తి చేసిన పంటలతో స్ధానికంగానే ఆహార ఉత్పత్తి జరగనుంది. రైతులు పండించిన పంటలను ఫుడ్‌జోన్‌లో ఏర్పడే పరిశ్రమలకు తరలించి ఆహార ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఫుడ్‌ జోన్‌ అందుబాటులోకి రాకపోవడంతో స్ధానికంగా పండించిన పంటలను ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు రైతులు తరలిస్తున్నారు. ఫుడ్‌జోన్‌ను త్వరగా అందుబాటులోకి తెస్తే స్ధానిక రైతులతో పాటు పక్కనున్న జిల్లా రైతులకు మేలు జరుగుతుంది.

- ఆసక్తి చూపని వ్యాపారస్తులు

పట్టణంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌జోన్‌లో పరిశ్రమల ఏర్పాటుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదు. పరిశ్రమల ఏర్పాటు కోసం నాలుగేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ఎవరు ముందుకు రావడం లేదు. ఫుడ్‌ జోన్‌లో రైసుమిల్లులతో పాటు బియ్యం వినియోగించి తయారుచేసే ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు, పప్పు ధాన్యాల ఉత్పత్తులు, సోయాబీన్‌, జిన్నింగ్‌ మిల్లులతో పాటు దాదాపు 36 పరిశ్రమలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ద్వారా పరిశ్రమల కోసం వ్యాపారస్తులకు అవకాశం కల్పించినప్పటికీ ముగ్గురు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో.. మూడు రకాల కంపెనీల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. ఢిల్లీకి సంబంధించిన కంపెనీతో పాటు స్ధానికంగా ఉండే ఇద్దరు వ్యాపారులు పరిశ్రమల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఫుడ్‌జోన్‌లో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఎకరానికి రూ. 40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వ్యాపారస్తులు భూమి ధర రెట్టింపు ఉందనే కారణంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అలాగే సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఫుడ్‌ జోన్‌లో పరిశ్రమల ఏర్పాటు కోసం వ్యాపారస్తులకు ఇప్పటి వరకు అవగాహన కల్పించిన సందర్భం లేదు. పూర్తిస్ధాయిలో ఫుడ్‌ జోన్‌లో పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారికి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. దీంతో పాటు స్ధానిక ప్రాంతం సైతం అభివృద్ధి చెందుతుంది. కానీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పూర్తిస్ధాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఫుడ్‌ జోన్‌లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి ప్రారంభించే విధంగా చూడాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

- వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు

- మహేశ్వర్‌, ఫుడ్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌

పరిశ్రమల ఏర్పాటుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. ఫుడ్‌ జోన్‌కు సంబంధించిన పనులు 80 శాతం పూర్తయ్యాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం వ్యాపారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఇతర సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలి.

Updated Date - May 06 , 2025 | 11:29 PM