ఎస్సీ విద్యార్థుల కోసం ‘శ్రేష్ట’
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:34 PM
షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రతిభగల విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ‘శ్రేష్ట’ (స్కీం ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెట్ ఏరియాస్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
- సీబీఎస్‌ఈ బోర్డుతో అనుసంధానం
- 9 నుంచి 12 తరగతుల వారికి కేంద్రం చేయూత
- బ్రిడ్జి కోర్సుతో సామర్థ్యం పెంచేందుకు చర్యలు
- నెట్స్ ద్వారా ప్రతిభగల విద్యార్థుల ఎంపిక
- ఈ నెల 30 వరకు తుది దరఖాస్తు గడువు
మంచిర్యాల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రతిభగల విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ‘శ్రేష్ట’ (స్కీం ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెట్ ఏరియాస్) పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోస్) నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యాసంస్థలు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన అందించే రెసిడెన్షియల్ స్కూళ్లలో సులభంగా ప్రవేశం కల్పించి, విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు అవకాశాలను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. షెడ్యూల్డ్ కులాల ఆదిపత్యం ఉండి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు విస్తరించడం ద్వారా విద్యారంగంలో ఉన్న లోటును పూడ్చేందుకు ఉద్దేశించబడింది.
- ఎవరు అర్హులు...
పథకం ద్వారా ఎస్సీ సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోంది. పథకంలో చేరే విద్యార్థులకు సీబీఎస్‌ఈతోపాటు పథకం అమలులో ఉన్న రాష్ట్రాల బోర్డుకు అనుసంధానమై ఉన్న అత్యుత్తమ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశం కల్పించడం ద్వారా 12వ తరగతి వరకు విద్య పూర్తి చేసేందుకు ఆర్థిక సహాయం అందజేస్తారు. స్వచ్ఛంద సంస్థలు, వలంటరీ ఆర్గనైజేషన్స్ నిర్వహించే రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు సైతం తగిన సదుపాయలు, మంచి విద్యా ప్రమాణాలు కలిగి ఉన్న వాటికి ఆర్థిక సహాయం అందజేస్తారు. పథకంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ‘బ్రిడ్జి’ కోర్సుల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల వాతావరణానికి సులువుగా అలవాటు పడేందుకు, ఇతర విద్యార్థులతో సమానంగా పాఠ్యాంశాలు అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆయా పాఠశాలల్లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఇందు కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో 9వ తరగతికి రూ. 1,00,000, 10వ తరగతికి రూ. 1,10,000, 11వ తరగతికి రూ. 1,25,000, 12వ తరగతికి రూ. 1,35,000 వార్షిక ఫీజు ఉండగా, ప్రతీ విద్యార్థికి పాఠశాల ఫీజు (ట్యూషన్ ఫీజు)తో సహా హాస్టల్ ఫీజు (మెస్ చార్జీలు)ను కూడా ప్రభుత్వంలోని సామాజిక న్యాయశాఖ భరిస్తుంది.
- రెండు విధానాల్లో అమలు...
మొదటి విధానంలో... ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు నెట్స్ (నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ట) ద్వారా నేషనల్ టెస్టింగ్ ఎంపిక చేస్తుంది. ఎంపికైన విద్యార్థులకు సీబీఎస్‌ఈ/రాష్ట్ర బోర్డు అనుసంధానం కలిగిన ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశం కల్పిస్తారు. రెండో విధానంలో... ఎన్‌జీవోస్ నిర్వహించే విద్యా రంగంలోని పాఠశాలలు/హాస్టల్ ప్రాజెక్టులకు ఆర్థికం సహాయం అందజేస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రతీ సంవత్సరం ఎస్సీ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 13,500 సీట్లు కేటాయిస్తారు. ఇందులో ప్రతిభగల 9, 11వ తరగతుల విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఆయా విద్యార్థులకు 12వ తరగతి పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఆ తరువాత ఉన్నత విద్యను అభ్యసించేందుకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లేదా టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీం వంటి ఇతర పథకాల కింద ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అడ్మిషన్ కల్పించేందుకు సీబీఎస్‌ఈ ఆధారిత అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఎంపిక చేస్తారు. గడిచిన మూడు సంవత్సరాల్లో 10, 12 తరగతుల్లో కనీసం 75 శాతం పాస్ పర్సెంటేజ్ సాధించిన పాఠశాలలు మాత్రమే ‘శ్రేష్ట’ స్కీం కింద ఎంపికకు అర్హత కలిగి ఉంటాయి. ప్రత్యేకంగా నియమించిన కమిటీ ద్వారా పాఠశాలల ఎంపిక ప్రక్రయ జరుగుతుంది. ప్రతీ సంవత్సరం మూడు వేల మంది వరకు ఎస్సీ విద్యార్థులను పథకానికి ఎంపిక చేస్తారు. వారిలో 1500 మంది 9వ తరగతికి, 1500 మందికి 11వ తరగతికి అవకాశం కల్పిస్తారు.
- 30తో ముగియనున్న గడువు....
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ‘శ్రేష’్ట ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తుండగా, ఈ నెల 30తో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు గడువు ముగియనుంది. డేటా కరెక్షన్ కోసం వచ్చే నెల 1, 2 తేదీల్లో అవకావం కల్పించారు. ఎంట్రన్స్ పరీక్ష డిసెంబరులో నిర్వహించనుండగా, వ్యవధి మూడు గంటలు ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ముగిసిన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఫలితాలు విడుద ల చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశం కోసం ఎనిమిదో తరగతి చదువుతూ 2010-14 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు. అలాగే 11వ తరగతిలో ప్రవేశానికి 10వ తరగతి అభ్యసిస్తున్న 2008-2012 మధ్య జన్మించిన వారికి అర్హత ఉంటుంది. కాగా ఎంట్రన్స్ పరీక్షల ఎన్‌సీఈఆర్టీ సిలబస్ ప్రకారం నిర్వహించనుండగా, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకేకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఎలాంటి నెగటివ్ మార్కులు ఉండవు.