Share News

నామినేషన్ల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:17 PM

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు.

నామినేషన్ల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
కన్నెపల్లిలో రిజిష్టర్లను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కన్నెపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం సందర్శించి నామినేషన్ల స్వీకరణ, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 15న ఉపసంహరణ, 23న పోలింగ్‌, నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలన్నారు. కాగా 12 గంటలు దాటినా ఎంపీడీవో కార్యాలయానికి రాకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీకళ, తహసీల్దార్‌ రాంచందర్‌ తదితరులు ఉన్నారు.

ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగాలి

భీమిని, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ అదేశించారు. సర్పంచు, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎన్నికల అంశాలపై ఆరా తీసారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్‌ నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి జగన్మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ బికర్ణ దాస్‌ తదితరులు ఉన్నారు.

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం

మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌

హాజీపూర్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌తో కలిసి ఎన్నికల విషయమై చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. అనంతరం హాజీపూర్‌ పోలీసు స్టేషన్‌ను సందర్శించి స్థానిక సంస్థల ఎన్నికల నియామవళి అమలు, శాంతియుత పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు తీసుకునే చర్యల గురించి స్థానిక పోలీసులకు సూచించారు. ఆయన వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌, రూరల్‌ సీఐ ఆకుల అశోక్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ ఉన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:17 PM