జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:28 PM
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అటు ప్రభుత్వంతోపాటు ఇటు రాజకీయ పార్టీల్లోనూ కాక రేపుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొనడంతో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
- పార్టీ పరంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు
- మంత్రివర్గ నిర్ణయంతో చిగురిస్తున్న ఆశలు
- సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో వర్తింపు
- ప్రతిపక్ష పార్టీల నిర్ణయంపైనా గ్రామాల్లో ఆసక్తి
మంచిర్యాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అటు ప్రభుత్వంతోపాటు ఇటు రాజకీయ పార్టీల్లోనూ కాక రేపుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొనడంతో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించినట్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేయడం కష్టసాఽధ్యమైన నేపథ్యంలో....కనీసం పార్టీ పరంగానైనా అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశావహుల్లో సమీకరణాలు మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల్లో బరిలో నిలవాలనే ఆలోచనతో ఉన్న ఆశావహులు తమ ఆలోచన సరళిని మార్చుకుంటున్నారు.
రిజర్వేషన్ల నిబంధనలతో..
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా అన్ని కేటగరీల రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదన్న నిబంధన ఉంది. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన సర్వే ప్రకారం బీసీలు 50 శాతానికి పైగా ఉండటంతో, జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో బీసీలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. కనీసం పార్టీ పరంగానైనా బీసీలకు ముందుగా నిర్ణయించిన ప్రకారం రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు రెండు రోజుల క్రితం రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు జనరల్ కేటగిరి కింద కేటాయించిన మొత్తం నుంచి బీసీలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
- జనరల్‌కు 44.8 శాతం సీట్లు...
జిల్లాలోని 306 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. వాటిలో ఏజెన్సీ పంచాయతీలు 36 ఉండగా, నాన్ ఏజెన్సీ కింద మరో 268 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా షెడ్యూల్ ట్రైబ్ జీపీలు మూడు ఉన్నాయి. వాటిలో ఎస్టీలకు 21.2 శాతం మేరకు మొత్తం 65 సీట్లు కేటాయించారు. అలాగే ఎస్సీలకు 26.5 శాతంతో 81 స్థానాలు, బీసీలకు 7.5 శాతంతో 23 సీట్లు కేటాయించారు. వాటికి అదనంగా అన్ రిజర్వుడ్ కోటాలో 44.8 శాతంతో 137 సీట్లు కేటాయించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడ్డ కులస్థులకు ఇచ్చిన హామీ మేరకు అన్‌రిజర్వు కోటా నుంచి సీట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ స్థానాల్లో 137 సీట్లు అన్ రిజర్వ్‌డ్ విభాగాలకు కేటాయించడంతో వాటిలో సింహభాగం బీసీలకే ఇచ్చేలా నియోజకవర్గాల వారీగా ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన బీసీలకు రిజర్వు చేసిన 23 సీట్లతోపాటు అన్ రిజర్వ్‌డ్ కోటా నుంచి మరో 19 స్థానాలను పార్టీ పరంగా వెనుకబడ్డ కులాలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తద్వారా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు మొత్తం 42 శాతం భర్తీ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారికంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో అడ్డంకులు ఎదురైనందున కనీసం పార్టీపరంగానైనా బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
- వార్డు స్థానాల్లోనూ..
అదే మాదిరిగా వార్డు సభ్యుల స్థానాల్లోనూ అనధికారికంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 2,680 వార్డు స్థానాలకు గాను ఏజెన్సీ ఏరియాలో 204, నాన్ ఏజెన్సీ ఏరియాలో 2,452 స్థానాలు ఉండగా, వంద శాతం ఎస్టీ వార్డులు 24 ఉన్నాయి. మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీలకు 17 శాతం రిజర్వేషన్ కింద 457 స్థానాలు, 22 శాతం రిజర్వేషన్‌తో ఎస్సీలకు 599, 12.4 శాతం రిజర్వేషన్‌తో బీసీలకు 334 స్థానాలు కేటాయించగా, 48.13 శాతంతో జనరల్ కేటగిరీకి 1290 సీట్లు రిజర్వ్ చేశారు. బీసీలకు ప్రత్యేకంగా కేటాయించిన 12.4 శాతానికి అదనంగా మరో 29.6 శాతం జనరల్ కోటా నుంచి రిజర్వ్ చేయడం ద్వారా మొత్తం ఆ సామాజిక వర్గానికి 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బీసీలకు వాస్తవ రిజర్వేషన్లు పోను అదనంగా మరో 900 పైచిలుకు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అలా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనన్న ఉత్కంఠ ప్రస్తుతం ప్రజల్లో నెలకొంది. కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కూడా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాయా...? అన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఆ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు సీట్ల కేటాయింపులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకవేళ బీసీల పరంగా సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో ఆ సామాజిక వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదనే చర్చ సాగుతోంది.