అంబరాన్నంటిన సంబురాలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:00 AM
సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
- ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలు
- బతుకమ్మ పాటలతో మారుమోగిన జిల్లా
ఆసిఫాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. హరిహరి ఓ దేవ ఉయ్యాలో.. హరి యో బ్రహ్మదేవ ఉయ్యాలో.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. ఆలయ ప్రాంగణాల్లో, వీధులు, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటల సం దడి కనువిందు చేసింది. చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణలతో లయబద్ధంగా ఆడుతూ.. పాడుతూ.. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పోటీపడి విభిన్న రూపాల్లో బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్త్రాలు, నగలు ధరించి ఒక్క చోట చేరి బతుకమ్మ చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ ఆడడంతో పాటు యువతులు, మహిళలు కోలాటం ఆడారు. పట్టణంలోని రావులవాడ, కన్య కాపరమేశ్వరి ఆలయం, పొట్టి శ్రీరాములు చౌక్, కంచుకోట, తారక రామానగర్, రాజంపేట, సాయినగర్, పైకాజీనగర్, బజార్‌వాడీ, హడ్కో కాలనీ, సందీప్‌నగర్, జన్కాపూర్, దస్నాపూర్‌లో కాలనీల్లో మహిళలు ఆడి పాడారు. కాగజ్‌నగర్ పట్టణంతో పాటు జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో మహిళలు ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు.
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండు గను మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసి గౌరమ్మను ఆరాధించారు. బతుక మ్మ చుట్టూ ఆటలు ఆడి, జానపద గీతాలతో సాంస్కృతిక సొగసును ప్రతిబింబిస్తూ కాగజ్‌నగర్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవం ఘనంగా సాగింది.
- బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక అని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. సోమవారం ఎస్పీఎం క్రీడా మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.