అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లతో ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:20 PM
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
మందమర్రిటౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన సందర్శించి పరికరాలను పరిశీలించారు. బోధన తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. సెంటర్‌లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వృత్తి విద్య, సాంకేతిక కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఈ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఇందులో కోర్సులు ఉంటాయని, విద్యార్థులకు బోధన కోసం ఏర్పాటు చేసిన పరికరాలు చాలా బాగున్నాయని తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యా న్ని ఎంచుకుని కోర్సులు పూర్తి చేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ దేవానంద్, అధ్యాపకులు ఉన్నారు.
ఎంపీడీవో కార్యాలయం పరిశీలన
మందమర్రిరూరల్: మందమర్రి ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. రికార్డులను, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండల ప్రజాపరిషత్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. నామినేషన్‌ల స్వీకరణను వీడియోగ్రఫీ చేయించాలన్నారు. నామినేషన్‌ల స్వీకరణలో నిబంధనలు పాటించాలన్నారు.