Administrative Disputes: తహసీల్దార్‌కు సెలవిచ్చే అధికారం మీకెక్కడిది
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:18 AM
ఓ జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్ సెలవు కావాలని అడగ్గా.. అత్యవసరమైతే తీసుకోవాలని అదనపు కలెక్టర్ చెప్పారు.
అదనపు కలెక్టర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చిన కలెక్టర్
తహసీల్దార్‌పైనా సస్పెన్షన్ వేటు
ఆందోళనల నేపథ్యంలో తిరిగి వెనక్కి
అధికారాలన్నీ కలెక్టర్లకే ఉన్నాయని అదనపు కలెక్టర్ల ఆవేదన
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి): ఓ జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్ సెలవు కావాలని అడగ్గా.. అత్యవసరమైతే తీసుకోవాలని అదనపు కలెక్టర్ చెప్పారు. విషయం తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్.. ఏ అధికారంతో సెలవు ఇచ్చారంటూ మందలించడమే కాకుండా, వివరణ ఇవ్వాలని నోటీసు ఇవ్వడంతో సదరు అదనపు కలెక్టర్ బిత్తరపోయారు. అదే సమయంలో సెలవు తీసుకున్న తహసీల్దార్‌పైనా సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై రెవెన్యూ శాఖ వర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం కావడంతో తిరిగి ససెన్షన్‌ను ఎత్తివేశారు. ‘‘ఒక సెలవు ఇవ్వలేం.. పనిచేయకపోతే బదిలీ చేయలేం.. తప్పు చేస్తే షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం లేదు.. ఇవేమీ లేకుండా వంద రకాల పనులు అప్పగించి.. కింది స్థాయి వారితో చేయించాలంటే ఎవరూ మాట వినడం లేదు.. కనీసం అడిగిన సమాచారం కూడా సకాలంలో పంపడం లేదు’’ అని అదనపు కలెక్టర్లు వాపోతున్నారు. తహసీల్దార్ల పోస్టింగ్, బదిలీలు, సెలవుల మంజూరు వంటి అధికారాలన్నీ కలెక్టర్ల చేతిలోనే ఉన్నాయి. అదనపు కలెక్టర్లకు సంబంధిత సమాచారాన్ని సర్క్యులేట్ చేయడమే తప్ప.. ఎలాంటి అధికారాలు ఉండవు. రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేసి, అదనపు కలెక్టర్ల వ్యవస్థను ఆచరణలోకి తెచ్చినా.. అధికారాల విషయంలో ఎలాంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు. తమకు అధికారాలు కల్పించకపోతే కింది స్థాయి అధికారులు తమను ఎలా ఖాతరు చేస్తారు? అని అదనపు కలెక్టర్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
భూ సమస్యలకు సంబంధించి తహసీల్దార్ స్థాయిలోనే 54,456 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీవోల స్థాయిలో 18,239, అదనపు కలెక్టర్ల స్థాయిలో 11,323, కలెక్టర్ల స్థాయులో 11637 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించి.. పరిష్కరించాల్సిన బాధ్యతలు అదనపు కలెక్టర్లపై పెట్టిన ప్రభుత్వం.. వారికి అధికారాలు కల్పించకపోవడంతో నామమాత్రపు సమీక్షలతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో పెండింగ్ దరఖాస్తులకు నెలల తరబడి మోక్షం లభించక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూభారతికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై ప్రతి వారం నిర్వహించే సమీక్షల్లో అదనపు కలెక్టర్లను రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ తరచూ మందలిస్తూనే ఉన్నారు. అయితే, తమ పరిధిలో లేని విషయాలకు తమను బాధ్యులను చేస్తూ.. కలెక్టర్లను వదిలేస్తున్నారని.. అదనపు కలెక్టర్లు ఆవేదన చెందుతున్నారు.