Kaleshwaram scam: నా భర్త హత్య ‘కాళేశ్వరం’ కేసు వల్లే..
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:51 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు వ్యవహారం వల్లే జరిగిందని ఆయన భార్య నాగవెల్లి సరళ అన్నారు. ఆదివారం భూపాలపల్లి పట్టణం ఫక్కీర్‌గడ్డలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ హత్యలో బీఆర్‌ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు.

రాజలింగమూర్తి భార్య సరళ
భూపాలపల్లి కృష్ణకాలనీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు వ్యవహారం వల్లే జరిగిందని ఆయన భార్య నాగవెల్లి సరళ అన్నారు. ఆదివారం భూపాలపల్లి పట్టణం ఫక్కీర్‌గడ్డలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ హత్యలో బీఆర్‌ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ హరిబాబుతో పాటు కేసీఆర్, కేటీఆర్‌ల ప్రమేయం ఉందని అనుమానంగా ఉన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని బీఆర్‌ఎస్ పెద్దలపై తన భర్త కేసు వేశారని, ఆ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనను హత్య చేశారని ఆమె ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూవివాదం కారణంగానే హత్య జరిగిందనడం అవాస్తవమన్నారు. తన భర్త హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించాలని సరళ డిమాండ్ చేశారు.
హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
రాజలింగమూర్తి హత్య కేసును హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలని మానవ హ క్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశారు. రాజలింగమూర్తి కుటుంబాన్ని మానవ హక్కుల వేదిక నాయకులు ఆదివారం పరామర్శించారు. హత్యలో బీఆర్‌ఎస్ రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మానవ హక్కుల వే దిక నిజనిర్ధారణ బృందం వివరాలను సేకరించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడు హరిబాబు ఈ హత్య కేసులో కుట్రదారుడిగా ఉన్నాడన్నారు. రాజలింగమూుర్తిని చంపాల్సిన అవసం హరిబాబుకు లేదని, బీఆర్‌ఎస్ అధినాయకులే అవినీతి విచారణ నుంచి తప్పించుకోవడానికి హరిబాబుతో హత్య చేయించారని రాజలింగమూర్తి భార్య కూడా ఆరోపిస్తున్నారని చెప్పారు.