Share News

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:47 PM

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్‌ అన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
తండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏఎస్పీ రామేశ్వర్‌

- జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్‌

- ఎంజీకాలనీ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్‌

వెల్దండ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎంజీ కాలనీ తండాలో ఉదయం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ నిర్వహించారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, డివిజన్‌ పరిధిలోని ఎస్‌ఐలు కురుమూర్తి, మాధవరెడ్డి, వీరబాబు, మహేందర్‌, శంషుద్దీన్‌తో పాటు 70 మంది పోలీసు సిబ్బందితో తండాలోని 150ఇళ్లలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 35 వాహనాలు, రూ.20,500 ల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండావాసులనుద్దేశించి ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సైబర్‌ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏవైనా అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత మద్యం, డ్రగ్స్‌, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతలు సాధ్యమన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:47 PM