Share News

Telangana Education: అడవి శ్రీరాంపూర్‌ హైస్కూలులో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:16 AM

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికార యంత్రం చర్యలు చేపట్టింది

Telangana Education: అడవి శ్రీరాంపూర్‌ హైస్కూలులో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ

  • సందర్శించిన పెద్దపల్లి జిల్లా అధికారులు

పెద్దపల్లి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికార యంత్రం చర్యలు చేపట్టింది. ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘పల్లె బడిలో ఏఐ పాఠాలు’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం టీ-ఫైబర్‌ సేవలను పట్టణ ప్రాంతాలతోపాటు పల్లెల్లో విస్తరించేందుకు ప్రయోగాత్మకంగా మూడు గ్రామాలను ఎంపిక చేసింది. అందులో అడవి శ్రీరాంపూర్‌ ఒకటి. ఆ గ్రామాల్లో టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవలను ఆరు మాసాలుగా అందిస్తున్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలకు సైతం టీ-ఫైబర్‌ కనెక్షన్‌ ఇవ్వడంతో అక్కడి ఉపాధ్యాయులు 8, 9, 10వ తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్నెట్‌ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు స్వయంగా గూగుల్‌ సెర్చ్‌తో పాటు ఫర్‌ ఫ్లెక్సీటీ ఏఐ యాప్‌ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో రావడంతో పాఠశాలలో మౌలిక వసతులపై కలెక్టర్‌ దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎం, ఉపాధ్యాయులను కలిసి వివరాలను తెలుసుకున్నారు. తగిన అంచనాలతో కలెక్టర్‌కు నివేదికను అందజేయనున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 06:16 AM