Share News

High Court: రేవంత్‌రెడ్డి కేసులో హైకోర్టుకు ఫిర్యాదుదారు క్షమాపణ

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:44 AM

సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తీర్పు ఇచ్చినందుకు జస్టిస్‌ మౌషమీ భట్టాచార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిర్యాదుదారు ఎన్‌. పెద్దిరాజు, ఆయన న్యాయవాదులు ఇద్దరు హైకోర్టుకు క్షమాపణ తెలియజేశారు.

High Court: రేవంత్‌రెడ్డి కేసులో హైకోర్టుకు ఫిర్యాదుదారు క్షమాపణ

  • అంగీకరించిన జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తీర్పు ఇచ్చినందుకు జస్టిస్‌ మౌషమీ భట్టాచార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిర్యాదుదారు ఎన్‌. పెద్దిరాజు, ఆయన న్యాయవాదులు ఇద్దరు హైకోర్టుకు క్షమాపణ తెలియజేశారు. సదరు క్షమాపణలను జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య శుక్రవారం అంగీకరించారు. ముగ్గురు ధిక్కరణదారులు చెప్పిన క్షమాపణలను తాను అంగీకరిస్తున్నానని.. తనవైపు నుంచి విచారణను ముగిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కులం పేరుతో దూషించారని ఎన్‌. పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సదరు కేసు కొట్టేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


దీనిపై జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం విచారణ చేపట్టి రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఇవ్వడానికి ముందు ఫిర్యాదుదారు పెద్దిరాజు సుప్రీంకోర్టులో బదిలీ పిటిషన్‌ దాఖలు చేసి.. కేసును వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. సదరు పిటిషన్‌లో హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి.. ఫిర్యాదుదారు పెద్దరాజును, ఆయన న్యాయవాదులను కోర్టు ధిక్కరణదారులుగా పేర్కొంది. హైకోర్టు జడ్జికి క్షమాపణలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Aug 23 , 2025 | 04:44 AM