ACB: అస్తవ్యస్తంగా సంక్షేమ హాస్టళ్లు
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:49 AM
సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని కొన్ని హస్టళ్లు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించారు.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం.. వార్డెన్ల ఇష్టారాజ్యం
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
హైదరాబాద్/రామన్నపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని కొన్ని హస్టళ్లు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించారు. యాదాద్రి - భువనగిరి జిల్లా రామన్నపేటలోని ఎస్సీ విద్యార్థినుల హస్టల్, నారాయణ పేట జిల్లా దామరగిద్దలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ తనిఖీలు సాగాయి. విద్యార్థులకు నిర్ణీత ప్రమాణాల మేరకు నాణ్యతతో కూడిన ఆహారం సరఫరా, హాస్టళ్లు, కాలేజీల్లో శానిటేషన్, రిజిష్టర్ల ప్రకారం విద్యార్ధుల హజరు ఉందా..? తదితర విషయాల్లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక పంపుతామన్నారు. రామన్నపేట ఎస్సీ విద్యార్థినుల హాస్టల్ రికార్డుల్లో 40 మంది పేర్లు ఉండగా, వాస్తవంగా 20 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. స్థానిక హైస్కూల్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 20 మంది ఉదయం అల్ఫాహారం తిని పాఠశాలకు వెళతారు.
రాత్రి భోజనం తర్వాత ఇళ్లకు వెళ్లిపోతున్నారని విమర్శలున్నాయి. దీంతోపాటు వంటశాల సామగ్రి, నూనె, పప్పు తదితర వివరాలపై దేనికి సరైన సమాధానం చెప్పకపోవడంపై హాస్టల్ వార్డెన్ రాజోల్ బాయిపై నల్లగొండ ఏసీబీ డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో అవినీతి అక్రమాలు జరుగుతున్నా, ఎందుకు తనిఖీలు చేయడం లేదని ఇన్‌చార్జి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ భిక్షంను ప్రశ్నించినా సమాధానం రాలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే హాస్టల్ నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్త రికార్డులపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని జగదీశ్ చందర్ తెలిపారు.