ACB Raids: అక్రమాస్తుల కేసులో ఖిలా వరంగల్ తహసీల్దార్ అరెస్టు
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:39 AM
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై ఖిలా వరంగల్‌లోని తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.
రూ.5.02 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
హైదరాబాద్/వరంగల్ క్రైం/ వీణవంక, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై ఖిలా వరంగల్‌లోని తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. శుక్రవారం ఉదయం ఒకేసారి ఏకకాలంలో ఏడు చోట్ల (హనుమకొండ, ఖమ్మం జిల్లాలతోపాటు ఖిలా వరంగల్ కార్యాలయం) తనిఖీలు కొనసాగాయి. సోదాల తర్వాత నాగేశ్వర్ రావును అరెస్టు చేశామని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. తమ తనిఖీల్లో దొరికిన ఆస్తుల విలువ రూ.5,02,25,198 కోట్లు ఉంటుందని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య చెప్పారు. ఆయన ఆస్తుల చిట్టాతో తమ కళ్లు బైర్లు కమ్మాయన్నారు. ఆయనకు రూ.. 1,15,00,000 కోట్ల విలువ 17.10 ఎకరాల విస్తీర్ణంలోని ఇల్లు, రూ.1,42,98,500 విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.23,84,700), 1,791 గ్రాముల వెండి (రూ.92,000), ఐదు వాహనాలు (రూ.34.78 లక్షలు), 23 చేతి గడియారాలు (రూ.3,28,195), గృహోపకరణాలు (రూ.16,43,303) ఉన్నట్లు చెప్పారు.
నాగేశ్వర్‌రావు అదనపు ఆస్తుల ధ్రువీకరణ జరుగుతుందని, నిందితుడిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని సాంబయ్య తెలిపారు. బండి నాగేశ్వర్‌రావు ఇళ్లలో ఏసీబీ దాడులతో ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రెవెన్యూశాఖలో కలకలం రేపింది. గతంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి, కాజీపేటతోపాటు ఖిలా వరంగల్‌లోనూ తహసీల్దార్‌గా చేయి తడపందే ఏ పని చేయడన్న విమర్శలున్నాయి. ఆయన సొంత జిల్లా ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వెంచర్‌లు చేస్తాడని సమాచారం.