ACB: ఏసీబీకి వలకు వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:38 AM
లంచం డిమాండ్ చేసి నగదు తీసుకుంటుండగా ఓ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌లను వేర్వేరుగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
70 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఆదిలాబాద్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కూడా..
వనస్థలిపురం/ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 22 (ఆంధ్ర జ్యోతి): లంచం డిమాండ్ చేసి నగదు తీసుకుంటుండగా ఓ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌లను వేర్వేరుగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని 200 గజాల ప్లాటు రిజిస్ట్రేషన్ నిమిత్తం సంబంధిత వ్యక్తులు వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదించగా, రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందిందని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. రూ.70 వేలను శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ రమేశ్‌కు అందజేస్తుండగా తాము అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్ సూచన మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు రమేశ్ తెలిపాడని పేర్కొన్నారు.
తగిన సాక్ష్యాధారాలతో ఇద్దరిపైనా కేసు నమో దు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. మరోవైపు.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన గౌసియా బేగం తన పేరున ఉన్న ఇంటిని భర్త మన్సూర్ ఖాన్ పఠాన్ పేరిట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం గిఫ్ట్ డీడ్ చేయించారు. అంతకుముందే జాయిట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ.5 వేలు ఇవ్వాలని దంపతులను డిమాండ్ చేశారు. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జాయిట్ సబ్ రిజిస్ట్రార్ 5వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.