ABHA App: ఆభా యాప్‌తో తగ్గిన ప్రయాస
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:52 AM
సర్కారు ఆస్పత్రికి వెళితే ఓపీ కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సిన పని లేదు. గతంలో మీకు ఏ సమస్య ఉంది, దానికి ఏ మందులు వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఓపీ మొదలు ల్యాబ్ రిపోర్టుల దాకా..
రోగులకు అందే సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరీక్షణకు స్వస్తి
రోగి ఆరోగ్య చరిత్ర యాప్‌లో నిక్షిప్తం
మంగళ్‌హాట్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సర్కారు ఆస్పత్రికి వెళితే ఓపీ కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సిన పని లేదు. గతంలో మీకు ఏ సమస్య ఉంది, దానికి ఏ మందులు వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక వేళ ల్యాబ్‌లో ఏవైనా పరీక్షలు చేయించుకుంటే.. ఆ రిపోర్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్‌లో ఆయుష్మాన్ భారత్ యాప్(ఆభా యాప్) ఇన్‌స్టాల్ చేసుకుని.. ఆస్పత్రిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. చాలా పనులు యాప్‌లోనే అయిపోతాయి. పైగా రోగి ఆరోగ్య చరిత్ర మొత్తం ఒక్క ఐడీలో పొందపరచబడి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారు సులభంగా వైద్య సేవలు పొందడానికి ఆభా యాప్ ఉపయోగపడుతోంది.
యాప్ ఇలా పనిచేస్తుంది..
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తెలంగాణ వ్యాప్తంగా 102 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆభా యాప్ ద్వారా రోగులకు సేవలందుతున్నాయి. రోగి ముందుగా తన సెల్ ఫోన్ నుంచి ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ వెంటనే క్షణాల్లో హెల్త్ కార్డు జారీ అవుతుంది. దీని ద్వారా ఆయుష్మాన్ భారత్ సేవలు అందులున్న ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రికి వెళినపుడు ఓపీ చీటీ కోసం క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. ఓపీ కౌంటర్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఆభా యాప్‌తో స్కాన్ చేస్తే.. వెంటనే ఓ నంబరు చూపిస్తుంది. ఆ నంబరును ఓపీ కౌంటర్‌లో చెప్పగానే రోగి పేరుతో ఓపీ చీటీ ఇస్తారు. అనంతరం డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఒక వేళ ఏదైనా వైద్య పరీక్షలు చేయించుకుంటే.. ఆ రిపోర్టులను ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అకౌంట్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో రిపోర్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. డాక్టర్‌ను కలిసి రోగి సెల్‌ఫోన్‌లోని రిపోర్టులను చూపించవచ్చు. లేదా వైద్యుల సెల్‌ఫోన్‌లో రోగి ఐడీ ఆధారంగా రిపోర్టులను పరిశీలించవచ్చు. దీని ద్వారా గంటల తరబడి వేచి ఉండే సమస్యకు స్వస్తి పలికినట్లైంది. అదే విధంగా డాక్టర్ రాసిన మందుల వివరాలు కూడా యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. తద్వారా రోగి ఏ మందులు వాడుతున్నాడన్న సమాచారం కూడా ఉంటుంది. అత్యవసర సమయంలో రోగి లేదా క్షతగాత్రులకు నిర్వహించిన పరీక్షలు, అందుకు సంబంధించిన రిపోర్టులు, చేసిన చికిత్స వివరాలను ఆభా యాప్‌లో తప్పనిసరిగా పొందుపరచాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది. దీంతో యాప్‌లో రోగి సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో రోగి ఆస్పత్రికి వచ్చినపుడు ఆభా ఐడీ ద్వారా రోగి ఆరోగ్య వివరాలను డాక్టర్లు తెలుసుకునే వీలుంది. వయసు పైబడిన వారి విషయంలో షుగర్, బీపీ ఇతర వ్యాధులకు సంబంధించిన వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. దీంతో రోగికి ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై వైద్యులు ఓ నిర్ణయానికి వస్తారు. డిజిటలైజేషన్ ద్వారా సమయం ఆదా కావడంతో పాటు రోగికి మెరుగైన వైద్యం అందించడంలో ఉపయుక్తంగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ఉస్మానియా ఆస్పత్రి టాప్..
రాష్ట్ర వ్యాప్తంగా 102 ఆస్పత్రుల్లో ఆభా యాప్ ద్వారా డిజిటల్ సేవలను అందిస్తుండగా ఉస్మానియా ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. ఆభా యాప్ ద్వారా ఇప్పటి వరకు 3.39 కోట్ల మంది కార్డులను పొందడంతో పాటు ఓపీ సేవల నిమిత్తం ఉపయోగించుకున్నారు. అదే విధంగా 2.77 కోట్ల ల్యాబ్ టెస్ట్‌లు నిర్వహించగా.. రిపోర్టులు ఆయా అకౌంట్లకు అనుసంధానమయ్యాయి. ఇందులో 17 లక్షల మంది వరకు ఉస్మానియా ఆస్పత్రిలో ఓపీ సేవలను పొందగా, 67 లక్షల వరకు ల్యాబ్ టెస్టులను నిర్వహించి రిపోర్టులను యాప్‌లో నిక్షిప్తం చేశారు.