Secunderabad railway station: 7న సికింద్రాబాద్ నుంచి ఏడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు పునరుద్ధరణ
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:31 AM
జంట నగరాల వాసులు దేశంలోని నలు మూలలకు రైలు ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్ రైల్వే
రైళ్ల వేళలు యథాతథం.. అదనపు స్టాపేజీగా చర్లపల్లి
సికింద్రాబాద్‌లో పూర్తయిన ప్లాట్ ఫామ్‌ల పునరుద్ధరణ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జంట నగరాల వాసులు దేశంలోని నలు మూలలకు రైలు ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిందే. సుమారు రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్).. అక్కడి నుంచి బయలుదేరే 25కి పైగా రెగ్యులర్ రైళ్లతోపాటు 50 వరకూ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ గత ఏప్రిల్ నుంచి చర్లపల్లి నుంచి/ మీదుగా నడుపుతుండటంతో జంట నగరాల ప్రజలు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న ఎక్స్‌ప్రెస్ రైళ్ల మళ్లింపుతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాసింజర్ రెవెన్యూ (ఆదాయం) ఎక్కువగా ఉండే రైళ్ల మళ్లింపుతో రాబడి తగ్గినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీనికి తోడు సికింద్రాబాద్ స్టేషన్‌లోని కొన్ని ప్లాట్ ఫామ్‌ల పునరుద్ధరణ పూర్తయింది. దీంతో ఇటీవల ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘పాత రూట్లలోనే మఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల’ను పునరుద్ధరించాలని నిర్ణయించారు. వచ్చేనెల ఏడో తేదీ నుంచి వివిధ రూట్లలో నడిచే 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి నడపాలని నిర్ణయించారు. గతంలో లింగంపల్లి వైపు వెళ్లే రైళ్లు ఏప్రిల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లకు బదులు చర్లపల్లి నుంచి అమ్ముగూడ, సనత్‌నగర్ మీదుగా నడుస్తున్నాయి. తాజా నిర్ణయంతో ఆయా రైళ్లు తిరిగి సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్ రూట్లకు మళ్లుతున్న రైళ్ల వేళల్లో మార్పులేవీ లేవని అధికారిక వర్గాల సమాచారం. అలాగే, చర్లపల్లిలో ఏర్పాటు చేసిన అదనపు స్టాపేజీని కొనసాగించనున్నట్లు తెలిసింది.