Share News

Fee Reimbursement: ఉన్నత విద్యా సంస్థలకు 600కోట్లు!

ABN , Publish Date - Sep 16 , 2025 | 06:13 AM

రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల సమ్మె కథ సుఖాంతమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య(ఫాతీ) సోమవారం నుంచి అన్ని కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే...

Fee Reimbursement: ఉన్నత విద్యా సంస్థలకు 600కోట్లు!

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు సీఎం రేవంత్‌ ఓకే

  • రీయింబర్స్‌మెంట్‌ను ఛిన్నాభిన్నం చేసిన గత సర్కార్‌

  • రూ.వేల కోట్ల భారాన్ని మాకు వారసత్వంగా ఇచ్చారు

  • మా ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హేతుబద్ధీకరణకు కమిటీ

  • మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి

  • మాపై దయ చూపారు.. సమ్మె విరమిస్తున్నాం

  • ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్‌ రమేశ్‌బాబ

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల సమ్మె కథ సుఖాంతమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య(ఫాతీ) సోమవారం నుంచి అన్ని కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సమస్య తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమాఖ్య ప్రతినిధులతో ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపింది. సోమవారానికి చర్చల్ని వాయిదా వేసింది. అయితే ముందు ప్రకటించినట్టుగానే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు బంద్‌ పాటించాయి. చర్చలు ఫలప్రదమైతే సమ్మె విరమిస్తామని, విఫలమైతే కొనసాగిస్తామని సమాఖ్య ప్రతినిధులు ఆదివారం రాత్రే స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్‌ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. యాజమాన్యాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి చెప్పారు. ఇప్పటికే హామీ ఇచ్చిన రూ.1200 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారని తెలిపారు. నెల మధ్యలో ఉన్నందున నిధుల సమస్య ఉందని అధికారులు సీఎంతో చెప్పినట్లు తెలిసింది. తక్షణమే రూ.300 కోట్ల వరకు విడుదల చేయొచ్చని అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే, కనీసం సగం నిధులైనా వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎస్‌ రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ఇతర ఉన్నతాధికారులు సమాఖ్య ప్రతినిధులతో మళ్లీ చర్చలు జరిపారు. సాయంత్రం భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ చర్చల్లో పాల్గొన్నారు. సీఎం పేర్కొన్నట్లుగా రూ.600 కోట్లు తక్షణమే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భట్టి ప్రకటించడంతో సమ్మె విరమిస్తామని యాజమాన్యాలు తెలిపాయి. అనంతరం మంత్రులు, సంఘాల ప్రతినిధులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం: భట్టి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. బీఆర్‌ఎస్‌ సర్కారు గత పదేళ్లలో ఈ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. రూ.వేల కోట్ల బకాయిల భారాన్ని తమకు వారసత్వంగా ఇచ్చిందని విమర్శించారు. వారు విచ్ఛిన్నం చేసిన వ్యవస్థలను బాగుచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కళాశాలల యాజమాన్యాలకు ఇప్పటికే అందించిన టోకెన్లకు సంబంధించి రూ.600 కోట్లు వెంటనే విడుదల చేయాలని, మిగతా బకాయిలు కూడా ప్రతినెలా చెల్లించేలా చూడాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హేతుబద్ధీకరణపై సలహాల కోసం ఓ కమిటీ వేయాలని సీఎ్‌సకు ఆదేశాలు ఇచ్చినట్లు భట్టి చెప్పారు. మూడు రోజుల్లో అధికారులతో కమిటీని ప్రకటిస్తామన్నారు. ఇందులో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతోపాటు యాజమాన్యాల నుంచి కూడా కొందరిని సభ్యులుగా తీసుకుంటామని చెప్పారు. రీయింబర్స్‌మెంట్‌ సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా, యాజమాన్యాలకు ఇబ్బంది లేకుండా కమిటీ సలహాలు ఇస్తుందని అన్నారు.

మా కష్టాలు అర్థం చేసుకున్నారు

మా కష్టాలు అర్థం చేసుకున్నారు. పాత ప్రభుత్వం పాపాలు నెత్తినపడ్డా కూడా.. ప్రభుత్వం మాపై దయ చూపింది. రూ.600 కోట్లు విడుదల చేస్తామన్నందుకు ధన్యవాదాలు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు, సిబ్బంది కూడా దసరా పండగను సంతోషంగా జరుపుకొంటారు. సమ్మె విరమిస్తున్నాం. ప్రభుత్వానికి సహకరిస్తాం.

- రమేశ్‌బాబు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సమాఖ్య చైర్మన్‌

Updated Date - Sep 16 , 2025 | 06:13 AM