Share News

Tragedy in Rath Yatra: రథయాత్రలో విషాదం

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:05 AM

భక్తజనం భజనలు, నృత్యాలు, జయజయధ్వానాల మధ్య ఆనందపారవశ్యంతో సాగుతున్న ఆ రథయాత్ర చివరికి తీవ్ర విషాదంగా ముగిసింది. రథాన్ని లాగుతున్న భక్తులు విసిరివేసినట్లుగా ఎగిరి దూరంగా పడ్డారు...

Tragedy in Rath Yatra: రథయాత్రలో విషాదం

  • కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుప రథానికి తగిలిన కరెంటు వైరు

  • ఐదుగురి మృతి.. నలుగురికి గాయాలు

  • హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఘటన

  • క్షతగాత్రుల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గన్‌మన్‌

  • మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ.. 5 లక్షల చొప్పున పరిహారం

  • బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరిక

  • విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం

  • మృతుల కుటుంబసభ్యులు, స్థానికుల నిరసన

  • దుర్ఘటనపై పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిగ్ర్భాంతి

హైదరాబాద్‌ సిటీ/రామాంతపూర్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భక్తజనం భజనలు, నృత్యాలు, జయజయధ్వానాల మధ్య ఆనందపారవశ్యంతో సాగుతున్న ఆ రథయాత్ర చివరికి తీవ్ర విషాదంగా ముగిసింది. రథాన్ని లాగుతున్న భక్తులు విసిరివేసినట్లుగా ఎగిరి దూరంగా పడ్డారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఫలితంగా అప్పటిదాకా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కాస్తా ఆప్తులను కోల్పోయినవారి రోదనలతో తీవ్ర విషాదకరంగా మారిపోయింది. ఘోర విద్యుదాఘాతం మిగిల్చిన దారుణం ఇది!! రామాంతపూర్‌ గోకుల్‌నగర్‌లో ఆదివారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో సంభవించింది. యాదవ సంఘం తరఫున శ్రీకృష్ణుడి రథయాత్ర నిర్వహిస్తుండగా పైన 11కేవీ హైటెన్షన్‌ విద్యుత్తు వైరు నుంచి ఇనుప రథానికి విద్యుత్తు ప్రసరణ జరిగింది. ఫలితంగా రథాన్ని లాగుతున్న భక్తులు తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. హైటెన్షన్‌ వైర్ల మధ్య నిరుపయోగంగా ఉన్న ఓ కేబుల్‌ వైరు ముక్క ఘోర ప్రమాదానికి కారణమైంది! ఉప్పల్‌ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా గోకుల్‌నగర్‌ నుంచి రాత్రి 8:30 నుంచి 9 మధ్య భక్తులు ఉత్సాహంగా రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ఆర్టీసీ కాలనీ, పాత రామాంతపూర్‌, ఎండోమెంట్‌ కాలనీల మీదుగా సాగుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తిరిగి గోకుల్‌నగర్‌లోని యాదవసంఘం భవన సమీపంలోకి చేరుకుంది. మరో 100 మీటర్ల దూరం వెళితే యాత్ర ముగిసేదే! అయితే ఆ రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించింది. ఫలితంగా రథం ముందుకు కదలకపోవడంతో కొందరు యువకులు ఆ వాహనాన్ని పక్కకు తీసి.. చేతులతోనే రథాన్ని లాగేందుకు సిద్ధమయ్యారు. నిర్వాహకుడు రవీందర్‌ యాదవ్‌, సంఘం చైర్మన్‌ కుమారుడు కృష్ణ యాదవ్‌తో పాటు సురేశ్‌ యాదవ్‌, శ్రీకాంత్‌ రెడ్డి, రుద్ర వికాస్‌, రాజేంద్ర రెడ్డి, ఎంపీ కిషన్‌ రెడ్డి గన్‌మన్‌ శ్రీనివాస్‌, వాహనంతో వచ్చిన గణేశ్‌, డెకరేషన్‌ బాయ్‌ మహేశ్‌ రథాన్ని లాగారు.


GH.jpg

ఆ కేబుల్‌ వైర్‌ తునక లేకపోయివుంటే..

రథాన్ని లాగుతుండగా పైన విద్యుత్తు తీగలు రథానికి అడ్డుగా ఉన్నాయని గుర్తించారు. ఆ వైర్లను కర్రతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్తు తీగ నుంచి కిందకు వేలాడుతున్న ఒక కేబుల్‌ వైరు ముక్క ఇనుప రథానికి తగిలింది. ఆ ముక్కలోని కాపర్‌ వైరు.. అటు 11కేవీ హైటెన్షన్‌ వైరుకు, ఇటు రథానికి తగలడంతో విద్యుదాఘాతం సంభవించింది. రథాన్ని లాగుతున్న తొమ్మిది మంది దూరంగా ఎగిరిపడ్డారు. వారిలో కృష్ణ యాదవ్‌ (21), సురేశ్‌ యాదవ్‌ (34), శ్రీకాంత్‌ రెడ్డి (35), రుద్ర వికాస్‌ (39), రాజేంద్ర రెడ్డి (45) విద్యుదాఘాతంతో మృతిచెందారు. మహేశ్‌, రవీందర్‌ యాదవ్‌, గణేశ్‌, శ్రీనివా్‌సకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వేర్వేరు ఆస్పత్రలకు తరలించారు. వీరిలో మహేశ్‌కు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల్లో కృష్ణ అవివాహితుడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గాంధీకి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.


కేబుల్‌ వైర్‌ ద్వారా కరెంట్‌ సరఫరా జరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారని, కలెక్టర్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రేటర్‌ పరిధిలో విద్యుత్తు తీగలపై కేబుల్‌ వైర్లు లేకండా చూసేలా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే సౌత్‌ డిస్కం సీఎండీ ముషారఫ్‌ ఫరూఖ్‌ అలీ ప్రమాదస్థలికి రాగా ఆయన్ను మృతుల కుటుంబసభ్యులు, స్థానికులు చుట్టుముట్టారు. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా రామాంతపూర్‌, ఉప్పల్‌ రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారంతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని... నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఎండీ హామీ ఇచ్చారు. వినాయక చవితి, దసరా ఉత్సవాల వరకు వైర్లపై వేలాడుతున్న ఇంటర్నెట్‌, కేబుల్‌ తీగలను సరిచేస్తామని చెప్పారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని హబ్సిగూడ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజనీర్‌ ప్రతిమ షోమ్‌ను ఆదేశించారు. గోకుల్‌నగర్‌ ఘటనలో ఐదుగురి మృతిపట్ల టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా, శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా చేపట్టిన ఊరేగింపులో విద్యుత్తు షాక్‌తో ఐదుగురు ప్రాణాలుకోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌చేశారు. ఈ ఘటనంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కేటీఆర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడి ఆస్పత్రుల్లో చేరినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

Updated Date - Aug 19 , 2025 | 05:05 AM