BC JAC: 42శాతం బీసీ రిజర్వేషన్ కాదంటే రాష్ట్రం అగ్నిగుండమే
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:45 AM
బీసీలకు చట్టబద్ధంగా 42ు రిజర్వేషన్ పెంచిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండమవుతుందని...
రన్ ఫర్ సోషల్ జస్టిస్, బీసీల న్యాయ సాధన దీక్షల్లో నేతల హెచ్చరిక.. కేంద్రానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి: జాజుల
రాజ్యాంగ సవరణతోనే పరిష్కారం: ఆర్. కృష్ణయ్య
కవాడిగూడ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): బీసీలకు చట్టబద్ధంగా 42ు రిజర్వేషన్ పెంచిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ జేఏసీ హెచ్చరించింది. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి లోయ ర్ ట్యాంకుబండ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకూ ఆదివారం ఉదయం ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్’ పేరు తో ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ర్యాలీనుద్దేశించి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు తూ.. రెండేళ్లుగా బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తున్న మాట వాస్తవమైనా.. దానికి చట్టరూపం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. తక్షణం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి, ప్రధాని మోదీతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద చేపట్టిన బీసీల న్యాయ సాధన దీక్షలో జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగ సవరణతోనే బీసీల రిజర్వేషన్లకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు జిల్లా, ని యోజకవర్గ స్థాయిలో బీసీ సంఘాలు, కుల సంఘా లు, ప్రజా సంఘాలు కార్యాచరణ రూపొందించాలన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీ రిజర్వేషన్ల సాధనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకు డిసెంబరు 10న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గొగికార్ సుధాకర్ చెప్పారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్సీ- టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ ఆవిష్కరించారు.