Revanth Reddy: పోరుబాట ధర్నాకు 3 వేల మంది హాజరు!
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:58 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో బుధవారం జంతర్‌మంతర్‌లో జరిగిన బీసీల ధర్నాలో సుమారు మూడు వేల మందికిపైగా పాల్గొన్నారు.
ఉద్యమానికి అండగా ఉంటామన్న ఇతర పార్టీల నేతలు
ధర్నాకు అందుకోలేకపోయిన రాహుల్ గాంధీ
సాయంత్రం దాకా నిర్వహించినా రాని అగ్రనేత
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో బుధవారం జంతర్‌మంతర్‌లో జరిగిన బీసీల ధర్నాలో సుమారు మూడు వేల మందికిపైగా పాల్గొన్నారు. ఇండియా కూటమి నేతలు పెద్దసంఖ్యలో హాజరై ధర్నాకు మద్దతు తెలిపారు. సుమారు 50 మంది ఇతర పార్టీల ఎంపీలు బీసీ ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే, ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అంత్యక్రియలకు వెళ్లడంతో ఆయన ధర్నాకు రాలేదు. బీసీ ధర్నా ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకే సాగుతుందని ప్రకటించినప్పటికీ రాహుల్ ఆలస్యంగానైనా వస్తానని సందేశం ఇవ్వడంతో సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అయినా, రాహుల్ ధర్నాకు అందుకోలేకపోయారు. ధర్నాకు మద్దతుగా ఆయన ఎక్స్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇక ధర్నాలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జాలె ఆదినారాయణ స్వయంగా పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచారు.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కష్టమే?
బీసీల రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి రాష్ట్రపతిని కలిసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, ఎంపీలు అపాయింట్‌మెంట్ కోరారు. బుధవారం రాత్రి వరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం రాష్ట్రపతిని కలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ, అపాయింట్‌మెంట్ లభించే అవకాశాలు లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం.