Short Circuit: షార్ట్ సర్క్యూట్.. దివ్యాంగ బాలిక సజీవదహనం
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:45 AM
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఆదివారం జరిగింది.
నారాయణపేట జిల్లా మక్తల్‌లో విషాదం
మక్తల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, మక్తల్ పట్టణంలోని నందినినగర్‌లో నివాసం ఉంటున్న కిష్టప్ప, సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె భానుప్రియ (13)కు కళ్లు కనిపించవు. దినసరి కూలీలైన కిష్టప్ప, సుజాత పనులకు వెళ్లగా, చిన్నకుమార్తె, కుమారుడు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు.
ఇంట్లో భానుప్రియ (13) ఒక్కతే ఉన్న సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని సామగ్రితో పాటు భానుప్రియ సజీవదహనమైంది. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోచ్చారు. అప్పటికే బాలిక పూర్తిగా అగ్నికి ఆహుతైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.