KGBV: కొత్తగా 120 కేజీబీవీల ఉన్నతీకరణ
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:51 AM
రాష్ట్రంలోని పలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా..
ఈ ఏడాది నుంచే ఇంటర్మీడియట్ తరగతులు
కృత్రిమమేధ సహా పలు కోర్సుల బోధనకు అనుమతి
జగిత్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. సానుకూల స్పందన వచ్చింది. పేదరికంతో తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక, మధ్యలో చదువు మానేసిన, బడి బయటి ఆడపిల్లలకు రెసిడెన్షియల్ విద్య అందించేందుకు 2005లో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 495 కేజీబీవీలు ఉండగా.. గతంలోనే విడతల వారీగా 283 విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు ఉన్నతీకరించారు. ఏటా ప్రతి కేజీబీవీలో 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రతి గ్రూపులో 40 సీట్లకు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 7, 8, 9, 10వ తరగతులు, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో సీట్లు ఖాళీగా ఉంటేనే ప్రవేశాలు కల్పిస్తున్నారు. భోజనం, వసతి, నాణ్యమైన విద్య అందిస్తుండడంతో ఈ విద్యాలయాల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది.
అదే సమయంలో కేజీబీవీల వాతావరణానికి అలవాటు పడిన బాలికలు పదో తరగతి తర్వాత సాధారణ జూనియర్ కళాశాలల్లో సర్దుబాటు కాలేక డ్రాపౌట్స్‌గా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో 120 కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కేజీబీవీల్లో ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసిన వారంతా ఉన్న చోటనే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసే వెసులుబాటు కలగనుంది. ఈ సారి కృత్రిమ మేధ(ఏఐ)తోపాటు అకౌంటింగ్, కంప్యూటర్‌సైన్స్, ఎంపీహెచ్‌డబ్ల్యూ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. భవిష్యత్తులో విద్యార్థినులు స్వయం ఉపాధి పొందేలా తర్ఫీదు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు కేజీబీవీ జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి అనుపమ తెలిపారు.