Local Body Election: 3 రోజుల్లో 12 క్వింటాళ్ల చికెన్ హాంఫట్
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:47 AM
లింగ మోరిగూడెంలో ప్రతిపక్ష అభ్యర్ధి రెండుసార్లు చికెన్ ఇంటింటికీ పంపించారు. పోలింగ్‌కు ముందు రోజు ఓటుకు రూ.750ల నగదు, కిలో చికెన్ అందులో కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి, ఒక క్వార్టర్, లేదా బీరు చొప్పున ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఐనవోలు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోడానికి మాంసం ఎరవేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మటన్, చికెన్ నేరుగా ఓటర్లు ఇళ్లకే పంపించారు. పున్నేలు గ్రామంలోనైతే ఒకటి కాదు రెండు కాదు మూడు రోజుల్లో ఏకంగా 12 క్వింటాళ్ల చికెన్ ఓటర్లకు పంపిణీ చేశారు. 12 క్వింటాళ్లు రూ.122 లక్షల విలువు చేసే చికెన్‌ను ఒకే షాపు నుంచి సరఫరా చేశారు. పున్నేలులో 3,158 మంది ఓటర్లు ఉండగా సుమారు 4 వేల పై చిలుకు జనాభా ఉంది. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ స్థానం కోసం పోటీ చేశారు.
ఒకరు అధికార కాంగ్రెస్, మరొకరు కాంగ్రెస్ రెబల్, ఇంకొకరు బీఆర్ఎస్ నుంచి పోటీ పడ్డారు. తొలుత ఒక పార్టీకి చెందిన వార్డు సభ్యులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటికి రూ.100ల విలువచేసే ముప్పావు కిలో చికెన్ ఆర్డర్ పెట్టి కవర్లలో ప్యాక్ చేయించి వార్డుల్లోని ఓటర్లకు అందజేశారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులకు చెందిన వార్డుల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు సైతం ఉదయం, సాయంత్రం ఒక్కో ఇంటికి రూ.100ల చికెన్ చొప్పున పోలింగ్‌కు ముందు రాత్రి వరకు పంపిణీ చేశారట. దీంతో మూడు రోజుల పాటు ఊరంతా చికెన్ వంటలో వేసే మసాలాలతో ఘుమఘుమలాడినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడ పోటి చేసిన సర్పంచ్ అభ్యర్థులు ముగ్గురికి తలా రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి 148 ఓట్లతో విజయం సాధించారు. ఇదిలా ఉండగా లింగ మోరిగూడెంలో ప్రతిపక్ష అభ్యర్ధి రెండుసార్లు చికెన్ ఇంటింటికీ పంపించారు. పోలింగ్‌కు ముందు రోజు ఓటుకు రూ.750ల నగదు, కిలో చికెన్ అందులో కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి, ఒక క్వార్టర్, లేదా బీరు చొప్పున ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఓట్లు పొందడానికి అభ్యర్థులు చేసే గిమ్మిక్కులను చూసి ఓటర్లే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద వీఆర్‌ఏల మహాధర్నా
బుల్లెట్ రైల్వే లైన్ కోసం భూ పరీక్షలు