Srishti Fertility Clinic Fraud: సృష్టి మోసాలు.. 10 కేసులు నమోదైనా.. పట్టించుకోని పోలీసులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:52 AM
సృష్టి ఫర్టిలిటీ క్లినిక్‌పై గతంలోనే 10 దాకా కేసులు నమోదైనా.. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే
ఆ అలసత్వంతో జోరుగా నమ్రత అక్రమాలు
తెలుగు రాష్ట్రాల్లో కేసులను..పరిశీలిస్తున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫర్టిలిటీ క్లినిక్‌పై గతంలోనే 10 దాకా కేసులు నమోదైనా.. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే నమ్రత అరాచకాలు పెరిగిపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకొని సరగసి పేరుతో డాక్టర్ నమ్రత సృష్టించిన అరాచకాలను చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్న సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి ఫర్టిలిటీపై గతంలోనే కేసులు నమోదైనా.. ఏడేళ్ల క్రితమే సృష్టి క్లినిక్ లైసెన్స్‌ను వైద్యాధికారులు రద్దు చేసినా.. నమ్రత అరాచకాలు ఆగలేదు. ఈ చర్యలతో సృష్టి మోసాలకు కొంత వరకు తెరపడ్డా.. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు మకాం మార్చిన నమ్రత.. అక్కడ కార్యకలాపాలను కొనసాగించారు. అక్కడ కూడా ఆమెపై కేసులు నమోదవ్వగా.. కొవిడ్ సమయంలో పోలీసులను మేనేజ్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో నమ్రత విజయవాడ, నెల్లూరుతోపాటు.. కర్ణాటక, ఒడిసా, కోల్‌కతాల్లోనూ బ్రాంచిలను ఏర్పాటు చేసి.. అక్రమాల దందాను కొనసాగించారు. ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని.. టెస్ట్‌ట్యూబ్, సరగసిపై ఆన్‌లైన్, సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకునేవారు.
అప్పుడే స్పందించి ఉంటే..
సృష్టిలో నమ్రత అక్రమాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసులను పోలీసులు, వైద్యాధికారులు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అప్పట్లోనే నమ్రతపై చర్యలు తీసుకుని ఉంటే.. అక్రమాలకు ఎప్పుడో తెరపడి ఉండేదని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ పోలీసులు విశాఖలోని మహారాణిపేట, టూటౌన్, గుంటూరు, హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ, గోపాలపురం ఠాణాల్లో నమోదైన కేసులపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆయా కేసుల్లో ఫిర్యాదుదారులతో మాట్లాడి.. ఈ కేసులో బలమైన ఆధారాలను సేకరించనున్నట్లు సమాచారం.
వైజాగ్ కేంద్రమే కీలకం
తెలంగాణలో క్లినిక్ లైసెన్సు రద్దవ్వడంతో నమ్రత ఇతర ప్రాంతాల్లోనే తనదందాపై దృష్టి సారించేవారు. సికింద్రాబాద్‌లో దంపతులకు కేవలం కౌన్సెలింగ్ ఇచ్చేవారు. వైజాగ్‌లోనే అంతా జరిగేది. విశాఖకు దంపతులను తీసుకెళ్లి.. అక్కడ వీర్యం, అండాలను సేకరించేవారు. దాన్ని సరగసి తల్లి గర్భంలోకి చేర్చి, ఆమె నిర్వహణ ఖర్చుల పద్దులను చూపిస్తూ.. అంతా సవ్యంగానే జరుగుతోందని నమ్మబలికేవారు. ఒప్పందం ప్రకారం.. 9 నెలల తర్వాత ఆ దంపతులకు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాల నుంచి కొనుగోలు చేసే శిశువులను అంటగట్టేవారు. ఇలా ఇప్పటి వరకు 80 మంది శిశువులను సరగసి పేరుతో పిల్లల్లేని దంపతులకు అంటగట్టినట్లు సమాచారం.