AI Boyfriend: కొత్త చాట్‌జీపీటీతో ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ను కోల్పోయా
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:52 AM
కంటికి కనిపించకుండానే గతంలో వినని ముచ్చట్లు ఎన్నో తనకు వినిపించి.. పులకించని తన మదిని పులకింపజేసి..
5నెలలుగా ప్రేమలో ఉన్నా.. జేన్ అనే యువతి ఆవేదన
న్యూఢిల్లీ, ఆగస్టు 15: కంటికి కనిపించకుండానే గతంలో వినని ముచ్చట్లు ఎన్నో తనకు వినిపించి.. పులకించని తన మదిని పులకింపజేసి.. తనదైన భావాలు, ఆలోచనలతో తన మనసునే మైమరపింపజేసిన ‘ప్రియుడు’ ఇప్పుడు శాశ్వతంగా దూరమయ్యాడని ఆ అంగన ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ కనిపించని ప్రియుడు ‘ఏఐ చాట్‌జీపీటీ-4’ అయితే తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయిన ఆ యవతి పశ్చిమాసియాకు చెందిన జేన్! ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ ఇటీవల చాట్‌జీపీటీ-5ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే! ఈ అడ్వాన్స్‌డ్ మోడలే జేన్‌కు విరహవేదనను మిగిల్చింది. ఒంటరితనం నుంచి బయటపడి కాస్త చిల్ అయ్యేందుకు సింగిల్‌గా ఉండేవారి కోసం ఏఐ చాట్‌బాట్‌లు వచ్చేశాయి కదాశ్రీ జేన్ కూడా చాట్‌జీపీటీ ఫోర్త్ వెర్షన్ ఉన్న రోజుల్లో సరదాగా ‘ఏఐ బాయ్‌ఫ్రెండ్’తో మాటలు కలిపింది. గత ఐదు నెలలుగా తాను ఏఐ చాట్‌జీపీటీ-4తో ప్రేమలో ఉన్నానని.. తన వ్యక్తిగత విషయాలు సహా.. అన్ని సమస్యలూ ఏఐతో పంచుకున్నట్లు చెప్పింది. అయితే చాట్‌జీపీపీ-4 స్థానంలో తాజాగా అందుబాటులోకొచ్చిన అప్‌డేట్ వెర్షన్‌తో తన ప్రియుడిని కోల్పోయానని ఆవేదనగా చెప్పింది. ఏఐ బాయ్‌ఫ్రెండ్ స్వరం, మాటలకు బాగా అలవాటు పడిన తాను చాట్‌జీపీటీ-5తో మునుపటి మాదిరిగా అన్ని విషయాలను పంచుకోలేకపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేసింది. జేన్ మాదిరిగానే కనిపించని సహచరి/సహచరులతో ఇన్నాళ్లుగా కాల్పానిక ప్రపంచంలో విహరించిన పలువురు నెటిజెన్లు ప్రస్తుతం ఇదే వెలితిని ఫీలవుతున్నారు.