Share News

అమలుకాని ‘ఫసల్‌బీమా’

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:41 AM

జగిత్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్‌బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సాగు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నేటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో పంటలకు బీమా ఉందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు ప్రభుత్వమే వందశాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

అమలుకాని ‘ఫసల్‌బీమా’

-రాష్ట్రంలో ఏడేళ్లుగా నిలిచిన పథకం

- ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న రైతులు

- జిల్లాలో ఇటీవల వర్షాలకు 2,168 ఎకరాల్లో పంట నష్టం

జగిత్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్‌బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సాగు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నేటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో పంటలకు బీమా ఉందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు ప్రభుత్వమే వందశాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కానీ అమలులో మాత్రం జాప్యం నెలకొంది. ప్రతి యేటా వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికారులు సర్వే చేసి నివేదికలు పంపుతున్నారు. గత యేడాది దెబ్బతిన్న పంటలకు ఇంతవరకు పరిహారం అందలేదు. భారీ వర్షాలకు ఇసుక మేటలు, రాళ్లు, బురద దర్శనమిస్తున్న పంట పొలాలను చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సర్వం కోల్పోయిన రైతులు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాగా ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు 1,709 మంది రైతులకు చెందిన 2,168 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో అధికంగా సారంగపూర్‌, బీర్‌పూర్‌, రాయికల్‌ మండలాల్లో నష్టం జరిగినట్లు అంచనాలున్నాయి.

ఫజిల్లాలో 4.24 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా పంటలు సాగు చేశారు. జిల్లాలో 1.60 లక్షల మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3,35,978 ఎకరాలు కాగా ఈ సీజన్‌లో 4,24,425 ఎకరాలు సాగైంది. మండలాల్లోని క్లస్టర్ల వారీగా సాగు విస్తీర్ణం అంచనాలను వ్యవసాయ అధికారులు రూపొందించారు. ఇందులో ప్రధానంగా వరి 3,05,000 ఎకరాలు, మొక్కజొన్న 41,000 ఎకరాలు, కందులు 2,500, పెసర్లు 150, ఇతర పప్పులు 675, సోయా చిక్కుడు 600, పత్తి 20,200, చెరుకు 1,200 ఎకరాలు, పసుపు 11,000, ఇతర పంటలు 42,100 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

ఫఅందని ద్రాక్షలా పరిహారం

రాష్ట్రంలో నాలుగేళ్లుగా భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందని ద్రాక్షగానే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమలవుతున్న ఈ పథకానికి గత ప్రభుత్వం వివిధ కారణాలతో దూరమవడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, రైతులు 20 శాతం ప్రీమియం చెల్లించేవారు. గతంలో ప్రభుత్వం అమలు చేసిన ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన కింద మండలాన్ని యూనిట్‌గా తీసుకుని నష్టాన్ని అంచనా వేసేవారు. అయితే వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా యూనిట్‌ను అంచనా వేయలేకపోతున్నారు. దీనితో గ్రామాలను యూనిట్‌గా తీసుకుని పంటల నష్టాన్ని అంచనా వేసినా రైతులకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సాగు చేసిన పంటలకు నేరుగా బీమా సంస్థలు ఇన్సూరెన్స్‌ అవకాశం కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఫయేటా వరదలతో పంట నష్టం..

జిల్లాలో వరి ప్రధాన పంటగా తరువాత మొక్కజొన్న, పత్తి సోయా, కందులు, పెసర్లు, చెరుకు సాగు చేస్తారు. ఇతర పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతాయి. యేటా ఏదో రకంగా రైతులు పంటలను నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వం పంట బీమా పథకం అమలు చేస్తోంది. గతంలో బ్యాంకు నుంచి రుణం పొందే రైతులకు పంట బీమా తప్పనిసరి చేశారు. రుణంతో సంబంధం లేకుండా పంటలను సాగు చేసే రైతులు మాత్రం బీమా చేయడమనేది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రీమియం చెల్లింపు అనేది రైతుల ఇష్టానికి వదిలేశారు. పత్తికి వాతావరణ ఆధారిత, సోయాకు గ్రామం యూనిట్‌, ఇతర పంటలకు మండల యూనిట్‌గా బీమా పథకాన్ని అమలు చేశారు. తాజాగా ఏయే పంటలకు బీమా వర్తింపజేస్తారు, ప్రీమియం ఎంత, పరిహారం ఎలా అమలు అనేది తేల్చాల్సి ఉంది. వీటికి సంబంధించి వ్యవసాయశాఖకు ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు.

ఫఆశలు చిగురించేనా..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బీమా ఆవశ్యకతను గుర్తించి పథకాన్ని పునరుద్ధరించేందుకు నిర్ణయించింది. ప్రస్తుత వానాకాలం అన్ని పంటల సాగు జోరుగా జరుగుతున్నాయి. ఈ సమయంలో బీమా ఎలా వర్తింపజేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే యాసంగిలో అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం మరో నెల రోజులు ఉంటుంది. భారీ వర్షాలతో పంట చేతికందే సమయంలో నష్టపోవాల్సి రావచ్చన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

బీమా సౌకర్యం కల్పించాలి

-మల్లారెడ్డి, రైతు, వెల్దుర్తి, జగిత్యాల రూరల్‌ మండలం

ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు సాగు చేసిన అన్ని రకాల పంటలకు ప్రభుత్వం బీమా చెల్లించి ఆదుకోవాలి.

ప్రభుత్వ నిర్ణయం మేరకే...

-భాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారి

పంటల బీమా అమలు విషయంలో వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన గతంలో నిర్ణయించింది. గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వం నుంచి ఫసల్‌ బీమా పథకంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.

Updated Date - Sep 04 , 2025 | 01:41 AM