Divya Deshmukh Chess Champion: వచ్చేసింది యువరాణి
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:53 AM
అంచనాలకు మించి రాణించడం.. అద్భుత ఆటతీరుతో అబ్బురపరచడం.. ఆమె నైజం. కీలక దశలో ఒత్తిడిని అధిగమించడం.. పరాజయం తప్పదనుకున్న చోట గెలిచి చూపించడం.. ఆమెకు అలవాటు..
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
అంచనాలకు మించి రాణించడం.. అద్భుత ఆటతీరుతో అబ్బురపరచడం.. ఆమె నైజం. కీలక దశలో ఒత్తిడిని అధిగమించడం.. పరాజయం తప్పదనుకున్న చోట గెలిచి చూపించడం.. ఆమెకు అలవాటు. 18 ఏళ్లకే జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ నెగ్గడం.. 19 ఏళ్లకే సీనియర్ ప్రపంచ కప్‌ను ముద్దాడడం.. పిన్న వయసులోనే ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపికవడం.. ఇలా ఎన్నెన్నో ఘనతలు చిరుప్రాయంలోనే సొంతం చేసుకున్న దివ్యా దేశ్‌ముఖ్ పేరుకే టీనేజర్.. చెస్ బోర్డు ఎదురుగా ఉంటే తనదైన వ్యూహాలతో పావులు కదుపుతుంది.. ఎంత అనుభవమున్న ప్రత్యర్థినైనా గెలుపు ఎత్తులతో చిత్తు చేస్తుంది. అసాధారణ విజయాలతో ఇప్పుడు మహిళల చదరంగానికి యువరాణిగా పట్టాభిషేకం అందుకుంది.
అనుకోకుండా చెస్‌లోకి..: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దివ్య తల్లిదండ్రులు జితేంద్ర, నమ్రత ఇద్దరూ డాక్టర్లు. ఐదేళ్ల వయసులో 2010లో దగ్గరలోని అకాడమీలో అక్కతో కలసి బ్యాడ్మింటన్‌లో కోచింగ్ కోసమని వెళ్లింది. అయితే, ఎత్తు తక్కువగా ఉండడంతో ఆమెను చెస్‌లో జాయిన్ చేశారు. క్రమంగా ఆటపై మక్కువ పెంచుకొన్న దివ్య రెండేళ్లలోనే పుదుచ్చేరిలో జరిగిన అండర్-7 నేషనల్స్‌లో స్వర్ణం సాధించింది. 2013లో ఇరాన్‌లో జరిగిన పోటీల్లో అండర్-8 ఆసియా విజేతగా నిలిచిన దేశ్‌ముఖ్.. వరల్డ్ యూత్ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకొంది. 2014లో అండర్-10 వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 40 సార్లు దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆమె.. 35 సార్లు పోడియం ఫినిష్ చేసింది.
23 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టింది. 2020లో భారత జట్టు చెస్ ఒలింపియాడ్ గెలవడంలో తనదైన పాత్ర పోషించింది. 18 ఏళ్ల వయసులో ఆసియా చెస్ కిరీటాన్ని అందుకొంది. గతేడాది జూన్‌లో వరల్డ్ జూనియర్ చాంపియన్‌షి్‌ప టైటిల్ నెగ్గి పిన్నవయసులోనే ఈ ఘనత సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది. జూనియర్ విభాగంలో నెంబర్‌వన్ ర్యాంక్‌ను సైతం సొంతం చేసుకొంది. దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటూ రెండేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదాను సొంతం చేసుకొంది. ఇప్పుడు భారత మహిళల చదరంగంలో నెంబర్‌వన్‌గా విరాజిల్లుతున్న హంపినే ఓడించి ప్రపంచ కప్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..