ఆరంభం ‘శుభ’కరం
ABN , Publish Date - Jun 21 , 2025 | 05:05 AM
ఇంతకాలం జట్టుకు ప్రధాన ఆకర్షణగా ఉన్న స్టార్ బ్యాటర్లు లేరు.. పైగా కొత్త కెప్టెన్.. దీనికి తోడు అంతగా అనుభవం లేని జట్టు కావడంతో తేలిపోవడం ఖాయమే.. సిరీస్ ఆరంభానికి ముందు భారత టెస్టు జట్టుపై విశ్లేషకుల అంచనా ఇది.
రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ
భారత్ మొదటి ఇన్నింగ్స్ 359/3
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు
కెప్టెన్ గిల్ అజేయ శతకం
లీడ్స్: ఇంతకాలం జట్టుకు ప్రధాన ఆకర్షణగా ఉన్న స్టార్ బ్యాటర్లు లేరు.. పైగా కొత్త కెప్టెన్.. దీనికి తోడు అంతగా అనుభవం లేని జట్టు కావడంతో తేలిపోవడం ఖాయమే.. సిరీస్ ఆరంభానికి ముందు భారత టెస్టు జట్టుపై విశ్లేషకుల అంచనా ఇది. కానీ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు మొదటి రోజే పట్టు వదలని ఆటతీరుతో వహ్వా అనిపించింది. తద్వారా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీ్‌సను ఘనంగా ఆరంభించింది. బలహీనంగా భావించిన బ్యాటర్లే భారీ భాగస్వామ్యాలతో ప్రత్యర్థి బౌలర్లను చెండాడారు. కెప్టెన్‌గా గిల్ (175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 127 బ్యాటింగ్) తన ప్రస్థానాన్ని శతకంతో ఘనంగా మొదలెట్టాడు. అలాగే ఇక్కడ తొలి టెస్టు ఆడుతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సైతం (159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) మూడంకెల స్కోరుతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా శుక్రవారం ఆరంభమైన ఈ తొలి టెస్టులో భారత్ ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌కు జతగా పంత్ (65 బ్యాటింగ్) ఉన్నాడు. రాహుల్ (42) ఫర్వాలేదనిపించాడు. స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అరంగేట్రం చేయగా, 8ఏళ్ల తర్వాత కరుణ్ నాయర్ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఓపెనర్ల అండగా..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనింగ్ జోడీ జైస్వాల్, రాహుల్ నిలకడైన బ్యాటింగ్‌తో శుభారంభం అందించింది. విదేశీ గడ్డపై ఆరంభంలోనే వికెట్ కోల్పోయే అలవాటున్న భారత్ ఈసారి ఎదురొడ్డి నిలిచింది. ఏకంగా 25 ఓవర్లపాటు క్రీజులో నిలిచి తొలి వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. అటు బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ నిర్ణయాన్ని దెబ్బతీస్తూ ఈ ఇద్దరూ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ సాగించారు. బంతి అప్పుడప్పుడూ స్వింగ్ అయినప్పటికీ ఓపికను కనబర్చారు. అటు చక్కటి ఎండ కాయడంతో పిచ్ ఫ్లాట్‌గా మారింది. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా ఇద్దరూ కలిసి 16 ఫోర్లు రాబట్టారు. ఇలాంటి పిచ్‌లపై చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టడి చేసే పేసర్లు అండర్సన్, బ్రాడ్ లేని లోటు ఇంగ్లండ్ బౌలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ టెస్టుకు ముందు ఇండియా ‘ఎ’ తరఫున ఆడిన జైస్వాల్ పదేపదే ఆఫ్‌స్టం్‌పనకు ఆవల వెళ్లే బంతులకు అవుటై నిరాశపర్చాడు. కానీ ఈసారి లోపాన్ని అధిగమించి నిలబడ్డాడు. అటు రాహుల్ చక్కటి కవర్ డ్రైవ్స్‌తో క్లాస్ బ్యాటింగ్‌ను కనబర్చాడు. అయితే అంతా సజావుగా సాగుతున్న వేళ లంచ్ బ్రేక్‌కు ముందు ఝలక్ తగిలింది. చక్కగా కుదురుకున్న రాహుల్‌ను అవుట్ స్వింగర్‌తో కార్స్ అవుట్ చేశాడు. ఇక తర్వాతి ఓవర్‌లోనే అరంగేట్ర బ్యాటర్ సుదర్శన్‌ను స్టోక్స్ డకౌట్ చేయడంతో 92/2 స్కోరుతో జట్టు లంచ్‌కు వెళ్లింది.
శతక భాగస్వామ్యం: బ్రేక్‌కు ముందే టపటపా రెండు వికెట్లు తీసిన ఆనందంలో ఉన్న ఇంగ్లండ్‌ను జైస్వాల్, గిల్ విసిగించారు. రెండో సెషన్ ఆద్యంతం వికెట్ కోల్పోకుండా ఆడిన ఈ యువ ఆటగాళ్లు 123 పరుగులు అందించారు. ఈ క్రమంలో జైస్వాల్ ఇంగ్లండ్ గడ్డపై తొలి శతకం సాధించగా.. అటు గిల్ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అటు స్కోరు సైతం 200 దాటడం విశేషం. గిల్ ఆరంభంలో వేగం కనబరుస్తూ వోక్స్ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. కాసేపటికే జైస్వాల్ సైతం వోక్స్ ఓవర్‌లోనే మరో మూడు ఫోర్లు రాబట్టాడు. అలాగే చక్కటి ఫోర్‌తో గిల్ 56 బంతుల్లోనే టెస్టుల్లో తన వేగవంతమైన హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. విరామానికి కాస్త ముందు జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే టీ బ్రేక్‌కు ముందు ఓవర్‌లో స్టోక్స్ ఏడు బంతులు వేయడం గమనార్హం.
గిల్, పంత్ జాగ్రత్తగా..: ఆఖరి సెషన్ ఆరంభంలోనే జైస్వాల్‌ను స్టోక్స్ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 129 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ తర్వాత కూడా ఇంగ్లండ్‌కు ఏమీ కలిసి రాలేదు. గిల్‌కు పంత్ జత కలవడంతో భారత్‌కు మరో శతక భాగస్వామ్యం అందింది. ఇద్దరూ ఎలాంటి రిస్కీ షాట్లకు వెళ్లకుండా వికెట్ కాపాడుకున్నారు. ముఖ్యంగా పంత్ తన సహజశైలిని పక్కనబెట్టి డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు. అటు జోరు మీదున్న గిల్.. టంగ్ ఓవర్‌లో ఫోర్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. పంత్ సైతం స్లాగ్ స్వీప్‌తో ఫోర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 138 పరుగులు అందించి తొలి రోజు ఆటను ముగించారు.
లీడ్స్‌లో తొలి వికెట్ (91)కు అత్యధిక భాగస్వామ్యం అందించిన భారత జోడీగా యశస్వీ-రాహుల్. గవాస్కర్- శ్రీకాంత్ (1984లో 64) రికార్డును అధిగమించారు.
విదేశీ గడ్డపై తొలి టెస్టు తొలి రోజే ఇద్దరు భారత బ్యాటర్లు (గిల్-జైస్వాల్) శతకాలు సాధించడం ఇది మూడోసారి. గతంలో సచిన్-సెహ్వాగ్, ధవన్-పుజార ఉన్నారు.
భారత టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలోనే శతకం బాదిన నాలుగో బ్యాటర్‌గా గిల్. గతంలో విజయ్ హజారే (164 నాటౌట్), గవాస్కర్ (116), విరాట్ (115) ఉన్నారు.
కెరీర్ తొలి టెస్టులోనే డకౌట్ అయిన పదో భారత బ్యాటర్‌గా సాయి సుదర్శన్
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 127; పంత్ (బ్యాటింగ్) 65; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 85 ఓవర్లలో 359/3. వికెట్ల పతనం: 1-91, 2-92, 3-221. బౌలింగ్: వోక్స్ 19-2-89-0; కార్స్ 16-5-70-1; టంగ్ 16-0-75-0; స్టోక్స్ 13-1-43-2; బషీర్ 21-4-66-0.
2,763 రోజుల తర్వాత..
2017, మార్చిలో చివరి టెస్టు ఆడిన కరుణ్ నాయర్ తిరిగి ఎనిమిదేళ్ల తర్వాత (2,763 రోజులు) జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సమయంలో భారత్ 77 టెస్టులు ఆడింది. అయితే ఉనాద్కట్.. భారత్ తరఫున సుదీర్ఘ విరామం (118 టెస్టులు) తర్వాత ఆడిన ఆటగాళ్లలో టాప్‌లో ఉన్నాడు. మరోవైపు జట్టుతో కలిసి తన భర్త కరుణ్ జాతీయ గీతాలాపన చేస్తున్న వీడియోను అతడి భార్య సనయ ఇన్‌స్టాలో షేర్ చేసింది.
నల్లబ్యాడ్జీలతో..
ఇటీవలి అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం రెండు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆటలో పాల్గొన్నారు. ఈ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో 53 మంది బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నారు.