Share News

Yashasvi Jaiswal Shines: శతక జైస్వాల్‌

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:55 AM

వెస్టిండీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (173 బ్యాటింగ్‌) తన అసాధారణ బ్యాటింగ్‌ నైపుణ్యంతో డబుల్‌ సెంచరీ వైపు సాగుతుండగా...

Yashasvi Jaiswal Shines: శతక జైస్వాల్‌

‘డబుల్‌’ దిశగా ఓపెనర్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 318/2

వెస్టిండీ్‌సతో రెండో టెస్టు

రాణించిన సాయి సుదర్శన్‌

న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (173 బ్యాటింగ్‌) తన అసాధారణ బ్యాటింగ్‌ నైపుణ్యంతో డబుల్‌ సెంచరీ వైపు సాగుతుండగా.. అటు సాయి సుదర్శన్‌ (87) అర్ధసెంచరీతో ఫామ్‌ను అందుకున్నాడు. దీం తో తొలి రోజు శుక్రవారమే భారత్‌ పూర్తి పట్టు సాధించింది. తద్వారా ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 318/2 భారీ స్కోరుతో నిలిచింది. క్రీజులో యశస్వీకి జతగా గిల్‌ (20 బ్యాటింగ్‌) ఉన్నాడు. స్పిన్నర్‌ జోమెల్‌ వారికన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరోవైపు విండీస్‌ బౌలర్లు తొలి రోజు ఆటలో ఒక్క ఎక్స్‌ట్రా రన్‌ ఇవ్వకపోవడం విశేషం.

ఆరంభంలో ఆచితూచి..: కెప్టెన్‌గా మొదటిసారి టాస్‌ గెలిచిన గిల్‌ వెంటనే బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే కొత్త బంతిని ఎదుర్కొన్న ఓపెనర్లు జైస్వాల్‌, రాహుల్‌ తొలి గంటపాటు నిదానంగా ఆడారు. వారెదుర్కొన్న మొదటి 72 బంతుల్లో 60 డాట్‌ బాల్స్‌ ఉండడం గమనార్హం. దీంతో డ్రింక్స్‌ విరామానికి జట్టు స్కోరు 29/0గానే ఉంది. పేసర్‌ ఫిలిప్‌ చక్కటి సీమ్‌తో ఓపెనర్లను ఇబ్బందిపెట్టాడు. కానీ బ్రేక్‌ తర్వాత స్ట్రయిక్‌ను రొటేట్‌ చేసుకుంటూ, చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ చకచకా పరుగులు రాబట్టారు. 17వ ఓవర్‌లో సిక్సర్‌తో జోరు మీదున్న రాహుల్‌ (38)ను.. స్పిన్నర్‌ వారికన్‌ తన తొలి ఓవర్‌లోనే స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో మొదటి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఎదుర్కొన్న మొదటి బంతినే ఫోర్‌గా మలిచిన సాయి సుదర్శన్‌తో కలిసి జైస్వాల్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను 94/1 స్కోరుతో ముగించాడు.


యశస్వీ-సాయి శతక భాగస్వామ్యం: రెండో సెషన్‌లో పూర్తిగా భారత్‌ ఆధిపత్యం సాగింది. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించడంతో ఇద్దరు లెఫ్ట్‌హ్యాండర్లు జైస్వాల్‌-సుదర్శన్‌ శతక భాగస్వామ్యాన్ని అందించారు. తొలి గంటపాటు వీరి దూకుడుకు ఓవర్‌కు ఆరు పరుగుల రన్‌రేట్‌తో స్కోరు దూసుకెళ్లింది. లంచ్‌ విరామం తర్వాత జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. విండీస్‌ బౌలర్లు ఈ జోడీని విడదీసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సాయి కెరీర్‌లో రెండో అర్ధసెంచరీకి చేరుకున్నాడు. అటు తొలి టెస్టులో భారీ స్కోరు అందుకోలేకపోయిన జైస్వాల్‌ ఈసారి పట్టుదలగా ఆడి కెరీర్‌లో ఏడో శతకం సాధించాడు. అయితే సాయి 58 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను మిడ్‌ వికెట్‌లో వారికన్‌ పట్టుకోలేకపోయాడు. రెండో వికెట్‌కు అజేయంగా 162 పరుగులు జోడించాక ఇద్దరూ టీ బ్రేక్‌కు వెళ్లారు.

సాయి శతకం మిస్‌: ఆఖరి సెషన్‌లో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత్‌ ఆటలో కాస్త వేగం తగ్గింది. ఇక ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తున్న సాయి సుదర్శన్‌ కెరీర్‌లో తొలి సెంచరీ చేయడం ఖాయమనిపించింది. కానీ వారికన్‌ అతడిని దెబ్బతీశాడు. అటు అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై సాయి రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. రీప్లేలో బంతి లెగ్‌ స్టంప్‌ను తాకుతున్నట్టుగా తేలడంతో సెంచరీకి 13 రన్స్‌ దూరంలో సుదర్శన్‌ పెవిలియన్‌ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్లాస్‌ ఇన్నింగ్స్‌తో జైస్వాల్‌ ఐదోసారి టెస్టుల్లో 150 రన్స్‌ను పూర్తి చేశాడు. గిల్‌ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడడంతో.. తొలిరోజు ఆటను భారత్‌ మెరుగ్గా ముగించింది.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వీ జైస్వాల్‌ (బ్యాటింగ్‌) 173, రాహుల్‌ (స్టంప్‌) ఇమ్లాచ్‌ (బి) వారికన్‌ 38, సాయి సుదర్శన్‌ (ఎల్బీ) వారికన్‌ 87, గిల్‌ (బ్యాటింగ్‌) 20; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 90 ఓవర్లలో 318/2; వికెట్ల పతనం: 1-58, 2-251; బౌలింగ్‌: సీల్స్‌ 16-1-59-0; ఫిలిప్‌ 13-2-44-0; గ్రీవ్స్‌ 8-1-26-0; పియర్‌ 20-1-74-0; వారికన్‌ 20-3-60-2; చేజ్‌ 13-0-55-0.

అతి పిన్న వయస్సులోనే (23) టెస్టుల్లో 7 శతకాలు బాదిన నాలుగో ప్లేయర్‌గా జైస్వాల్‌. బ్రాడ్‌మన్‌ (12), సచిన్‌ (8), సోబర్స్‌ (9) ముందున్నారు. మియాందాద్‌, గ్రేమ్‌ స్మిత్‌, విలియమ్సన్‌, కుక్‌ కూడా ఏడు సెంచరీలతో ఉన్నారు. అలాగే జైస్వాల్‌ శతకాల్లో ఐదు 150+ స్కోర్లు ఉండడం విశేషం. బ్రాడ్‌మన్‌ మాత్రమే ఈ వయస్సులో ఎక్కువ సార్లు (8) ఈ ఫీట్‌ సాధించాడు.

00-Sports.jpg

డాక్టర్‌

యశస్వీ

తొలి రోజు ఆఖరి సెషన్‌లో కెప్టెన్‌ గిల్‌ రెండో పరుగు తీసే క్రమంలో విండీస్‌ కీపర్‌ టెవిన్‌ ఇమ్లాచ్‌ బలంగా ఢీకొన్నాడు. గిల్‌ హెల్మెట్‌ కీపర్‌ ఛాతీకి బలంగా తాకడంతో ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో మైదానంలో కాసేపు ఆందోళన నెలకొంది. వెంటనే ఇరు జట్ల ఫిజియోలు వచ్చి ఆటగాళ్లను పరీక్షించారు. గిల్‌ హెల్మెట్‌ తీసి కాసేపు తల పట్టుకుని కూర్చున్నాడు. అతడిని ఫిజియో చెక్‌ చేశాక జైస్వాల్‌.. తన రెండు వేళ్లను గిల్‌కు చూపుతూ ఇవెన్ని ఉన్నాయంటూ కంకషన్‌ టెస్టు చేసినట్టుగా ఆటపట్టించాడు. అటు గిల్‌ కూడా సరదాగా నవ్వుకోవడం కనిపించింది. మరోవైపు జైస్వాల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో అరుణ్‌ జైట్లీ స్టేడియంలోని ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అప్పటిదాకా ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ అరిచిన అభిమానులు.. ‘జైస్వాల్‌.. జైస్వాల్‌’ అనే నామస్మరణతో హోరెత్తించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 05:55 AM