Share News

WPL 2025 : ఆర్‌సీబీ అదిరే బోణీ

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:06 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మూడో సీజన్‌కు అదిరే ఆరంభం. కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌పై 202 పరుగుల రికార్డు ఛేదనను సైతం మరో 9 బంతులుండగానే

 WPL 2025 : ఆర్‌సీబీ  అదిరే బోణీ

రిచా, ఎలిస్‌, కనిక మెరుపులు

గుజరాత్‌పై ఘనవిజయం

గార్డ్‌నర్‌ ఆల్‌రౌండ్‌ షో వృధా

డబ్ల్యూపీఎల్‌లో నేడు

ఢిల్లీ X ముంబై రాత్రి 7.30 నుంచి

వడోదర: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మూడో సీజన్‌కు అదిరే ఆరంభం. కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌పై 202 పరుగుల రికార్డు ఛేదనను సైతం మరో 9 బంతులుండగానే ముగించింది. చివర్లో రిచా ఘోష్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్‌) బౌలర్లను చెడుగుడు ఆడేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. గార్డ్‌నర్‌ (37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 నాటౌట్‌), బెథ్‌ మూనీ (42 బంతుల్లో 8 ఫోర్లతో 56) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్‌ రేణుకా సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి గెలిచింది. ఎలిస్‌ పెర్రీ (34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), కనికా అహూజా (13 బంతుల్లో 4 ఫోర్లతో 30 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. గార్డ్‌నర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రిచా ఘోష్‌ నిలిచింది.

రిచా సూపర్‌: భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన బెంగళూరుకు రెండో ఓవర్‌లోనే డబుల్‌ ఝలక్‌ తగిలింది. అయితే ఎలిస్‌ పెర్రీతో పాటు ఆఖర్లో రిచా ఘోష్‌ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన ఓపెనర్‌ మంధాన (9)తో పాటు మరో ఓపెనర్‌ వ్యాట్‌ హాడ్జ్‌ (4)లను గార్డ్‌నర్‌ పెవిలియన్‌కు చేర్చింది. ఈ దశలో 14/2 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన జట్టును ఎలిస్‌ పెర్రీ, రాఘ్వి బిస్త్‌ (25) ఆదుకున్నారు. వీరి దూకుడుతో పవర్‌ప్లేలో జట్టు 51/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కూడా అడపాదడపా బౌండరీలతో ఎలిస్‌ 27 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. కానీ స్కోరు 100కి చేరాక బిస్త్‌ వికెట్‌ను డాటిన్‌ పడగొట్టింది. దీంతో మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక జోరు మీదున్న ఎలి్‌సను 13వ ఓవర్‌లో పేసర్‌ సయాలి అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీ తిరిగి కష్టాల్లో పడింది. అయితే 30 బంతుల్లో 60 రన్స్‌ కావాల్సిన వేళ 16వ ఓవర్‌లో రిచా విజృంభించింది. వరుసగా 4,6,4,4,4తో 23 రన్స్‌ రాబట్టడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. అటు సాధించాల్సిన రన్‌రేట్‌ కూడా భారీగా తగ్గింది. తర్వాతి ఓవర్‌లోనూ కనిక రెండు, రిచా ఓ ఫోర్‌తో 16 రన్స్‌ సమకూరాయి. ప్రియా మిశ్రా ఓవర్‌లోనూ చెలరేగిన రిచా 4,4,6తో 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా.. సమీకరణం 12 బంతుల్లో 7కి మారడంతో ఆర్‌సీబీ సంబరాల్లో మునిగింది. ఓ భారీ సిక్సర్‌తో రిచా 19వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించింది.


గార్డ్‌నర్‌, మూనీ హవా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్‌ బెథ్‌ మూనీ, డెత్‌ ఓవర్లలో కెప్టెన్‌ అష్లే గార్డ్‌నర్‌ బెంగళూరుపై విరుచుకుపడ్డారు. ఓ దశలో 150 కూడా కష్టమే అనుకున్నా.. వీరిద్దరి ఆటతో స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. పేసర్‌ రేణుకా సింగ్‌ మాత్రమే పరుగులను కట్టడి చేయగలిగింది. పవర్‌ప్లేలో కేవలం 39/1 స్కోరు సాధించిన జెయింట్స్‌ను మూనీ ఆదుకునే ప్రయత్నం చేసింది. పదో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో తను 37 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. అయితే కాసేపటికే తను పెవిలియన్‌కు చేరినా.. ఆ తర్వాత ఆర్‌సీబీ బౌలర్లకు గార్డ్‌నర్‌ చుక్కలు చూపించింది. 14వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లతో 21 పరుగులు రాబట్టింది. అదే జోరులో 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేసుకుంది. అటు డాటిన్‌ (25) కూడా వేగంగా ఆడడంతో ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 31 బంతుల్లోనే 67 పరుగులు సమకూరడం విశేషం. 18వ ఓవర్‌లో సైతం గార్డ్‌నర్‌ మరో మూడు సిక్సర్లతో 20 రన్స్‌ రాబట్టింది. ఆఖరి ఓవర్‌లో హర్లీన్‌ (9 నాటౌట్‌) రెండు ఫోర్ల సహాయంతో గుజరాత్‌ డబ్ల్యూపీఎల్‌లో రెండోసారి 200 స్కోరును అందుకుంది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌: 20 ఓవర్లలో 201/5 (గార్డ్‌నర్‌ 79 నాటౌట్‌, మూనీ 56, డాటిన్‌ 25;

రేణుకా సింగ్‌ 2/25).

బెంగళూరు: 18.3 ఓవర్లలో 202/4 (రిచా ఘోష్‌ 64 నాటౌట్‌, ఎలిస్‌ పెర్రీ 57, కనిక 30 నాటౌట్‌, బిస్త్‌ 25;

గార్డ్‌నర్‌ 2/33).

1

లీగ్‌ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదన (202)ను పూర్తి చేసిన జట్టుగా ఆర్‌సీబీ.

డబ్ల్యూపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (8) బాదిన ప్లేయర్‌గా సోఫీ డివైన్‌తో సంయుక్తంగా నిలిచిన గార్డ్‌నర్‌.

2

ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (10) బాదిన రెండో జట్టుగా గుజరాత్‌. ఢిల్లీ (11) టాప్‌లో ఉంది.

డబ్ల్యూపీఎల్‌లో ఎక్కువ హాఫ్‌ సెంచరీలు (5) చేసిన రెండో బ్యాటర్‌గా హర్మన్‌, షఫాలీలతో సంయ్తుకంగా నిలిచిన ఎలిస్‌ పెర్రీ. మెగ్‌ లానింగ్‌ (6)

టాప్‌లో ఉంది.

Updated Date - Feb 15 , 2025 | 06:06 AM