Share News

మహిళల ధనాధన్‌కు వేళాయె..

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:10 AM

ఐపీఎల్‌ తరహాలోనే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మార్చి 15 వరకు ఈ మూడో సీజన్‌ జరుగనుంది. 2023లో తొలిసారి...

మహిళల ధనాధన్‌కు వేళాయె..

నేటి నుంచే డబ్ల్యూపీఎల్‌

ఆరంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ X గుజరాత్‌

రాత్రి 7.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

వడోదర: ఐపీఎల్‌ తరహాలోనే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మార్చి 15 వరకు ఈ మూడో సీజన్‌ జరుగనుంది. 2023లో తొలిసారి ఆరంభమైన డబ్ల్యూపీఎల్‌ గత రెండు అంచెల్లో రెండు వేదికలకే పరిమితమైంది. కానీ ఈసారి బెంగళూరు, ముంబైలకు తోడుగా వడోదర, లఖ్‌నవూ కూడా చేరాయి. ఈ నాలుగు పట్టణాల్లో మొత్తంగా 22 మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ ముంబైలో ఉంటుంది. ఇక నేటి ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు గుజరాత్‌ జెయింట్స్‌తో తలపడనుంది. దేశవాళీ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఆరంభించిన ఈ లీగ్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు యువ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. విశేషంగా రాణించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మెరిసేందుకు ఈ వేదిక వారికి చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ లీగ్‌ ద్వారానే శ్రేయాంక పాటిల్‌, సైకా ఇషాక్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలిగారు. అలాగే విదేశీ క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోనుండడం కూడా వారికి కలిసివచ్చే అంశం. అయితే స్టార్‌ ప్లేయర్లు అలీసా హీలీ, సోఫీ మోలినెక్స్‌, కేట్‌ క్రాస్‌ గాయాలతో తాజా సీజన్‌కు దూరమయ్యారు. ఇదిలావుండగా చాలామంది వర్థమాన ప్లేయర్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారని, భారత కెప్టెన్‌ హోదాలో వారి ప్రదర్శన చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు హర్మన్‌ప్రీత్‌ తెలిపింది. ఇక ఫామ్‌ కోల్పోయి జట్టులో స్థానం గల్లంతయిన షఫాలీ వర్మకు ఈ లీగ్‌ కీలకం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌గా తను చెలరేగితే తిరిగి జాతీయ జట్టులో బెర్త్‌ దక్కించుకోవచ్చు. మరోవైపు మంధాన నేతృత్వంలోని ఆర్‌సీబీకి ఈసారి టైటిల్‌ నిలబెట్టుకోవడం అంత సులువేమీ కాదు.


సోఫీ డివైన్‌ అందుబాటులో లేకపోగా క్రాస్‌, మోలినెక్స్‌, ఆశా శోభన గాయాలతో దూరమయ్యారు. దీనికితోడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీ, శ్రేయాంక గాయాల నుంచి కోలుకుంటున్నారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ కష్వీ గౌతమ్‌ (గుజరాత్‌)పై కూడా అందరి దృష్టి నెలకొంది. అటు రెండుసార్లు రన్నర్‌పగా నిలిచిన ఢిలీ క్యాపిటల్స్‌ మాత్రం షఫాలీ, లానింగ్‌, జెమీమా, సదర్లాండ్‌, కాప్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. యూపీ వారియర్స్‌కు దీప్తి శర్మ, గుజరాత్‌ జెయింట్స్‌కు ఆష్లే గార్డ్‌నర్‌ ఈసారి నూతన కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

మ్యాచ్‌ మధ్యలో

ఆరంభ వేడుకలు

వడోదర అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నేడు ఆరంభ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. అయితే ఇది ఆర్‌సీబీ-జీజీ మ్యాచ్‌కు ముందు కాకుండా ఇన్నింగ్స్‌ విరామంలో రాత్రి 9 గంటలకు ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, సింగర్‌ మధుబంతి బాగ్చి పాల్గొననున్నారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 02:10 AM