బుమ్రా ఆడేనా
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:30 AM
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా ఐదు శతకాలు నమోదైనా.. టీమిండియాకు నిరాశ తప్పలేదు. ఈనేపథ్యంలో గిల్ సేన బుధవారం నుంచి...
ఎటూ తేల్చుకోలేని టీమిండియా
రెండో స్పిన్నర్‌గా కుల్దీప్?
నేటి నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా ఐదు శతకాలు నమోదైనా.. టీమిండియాకు నిరాశ తప్పలేదు. ఈనేపథ్యంలో గిల్ సేన బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టుకు సిద్ధమైంది. అంతకంటే ముందు జట్టు కూర్పుపై అత్యంత ఆసక్తి నెలకొంది. హెడింగ్లేలో పేసర్ బుమ్రా మాత్రమే ఆకట్టుకోగా..అతనికి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద ఈ టెస్టుకు విశ్రాంతినిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలే బలహీనంగా కనిపిస్తున్న బౌలింగ్ విభాగంలో బుమ్రా లేకపోతే పరిస్థితేమిటి? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే బుమ్రా జట్టు ఎంపికకు అందుబాటులోనే ఉంటాడని కెప్టెన్ గిల్ తేల్చాడు. కానీ మ్యాచ్ రోజు ఉదయం పిచ్ పరిస్థితిని చూశాకే అతడి ప్రాతినిథ్యంపై నిర్ణయానికి వస్తామని పేర్కొన్నాడు. ఈ సిరీ్‌సకు ముందే బుమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని కోచ్ గంభీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తొలి టెస్టు పరాజయం తర్వాత అతడు లేకుండా రెండో మ్యాచ్‌కు వెళ్లడం సరైన నిర్ణయం అనిపించుకోదని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండా ఇప్పటికే తుది జట్టును కూడా ప్రకటించింది. మరోవైపు ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్ ఇప్పటివరకు గెలిచిందిలేదు. ఆడిన 8 టెస్టుల్లో ఏడు ఓడి, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 2022లో ఇక్కడ ఆడిన చివరి టెస్టులో భారత్‌పై 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్ నెగ్గింది.
తుది కూర్పుపై మల్లగుల్లాలు
రెండో టెస్టులో ఎవరిని ఆడించాలనే విషయం కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్‌కు సవాల్‌గా మారింది. పేసర్ బుమ్రాపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. మూడో పేసర్‌గా ఆకాశ్, అర్ష్‌దీ్‌పలలో ఎవరి వైపు మొగ్గు చూపాలి? అలాగే జడేజాకు తోడు మరో స్పిన్నర్‌గా ఎవరిని ఆడించాలి? శార్దూల్‌ను పక్కనబెట్టి నితీశ్‌ను ఆడిస్తే ఎలా ఉంటుంది? విఫలమైన సాయి సుదర్శన్, కరు ణ్ నాయర్‌లను కొనసాగించాలా? ఇలా టీమ్ మేనేజ్‌మెంట్‌ను అనేక ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తొలి టెస్టులో మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడంతో ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీ్‌పను ఆడించి ఉంటే బావుండేదనే కామెంట్స్ వినిపించాయి. కుల్దీ్‌పను తీసుకుంటారా? లేక ఎనిమిదో నెంబర్‌లో బ్యాటింగ్ చేయగల సుందర్‌ను ఆడిస్తారా? అనేది వేచిచూడాల్సిందే. ఇక ఆల్‌రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్ అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో నితీశ్ కుమార్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బుమ్రా ఆడకపోతే పేస్ విభాగం సిరాజ్, ప్రసిద్ధ్, ఆకాశ్‌దీ్‌పలతో బరిలోకి దిగవచ్చు. ఇక బ్యాటింగ్‌లో జైస్వాల్, రాహుల్, గిల్, పంత్ శతకాలతో అదుర్స్ అనిపించారు. కానీ రెండు ఇన్నింగ్స్‌లోనూ చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడం ప్రభావం చూపింది. ఒక విధంగా మ్యాచ్ కోల్పోయేందుకు కూడా కారణమయ్యారు. అలాగే ఫీల్డింగ్‌లో జైస్వాల్ వదిలేసిన క్యాచ్‌లతో జట్టు గట్టి మూల్యమే చెల్లించుకుంది. అందుకే ఈసారి అన్ని లోపాలను సరిదిద్దుకుని పకడ్బందీగా బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది.
మార్పుల్లేకుండానే..
తొలి టెస్టు విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదు. నాలుగేళ్ల తర్వాత టెస్టులకు ఎంపికైన పేసర్ ఆర్చర్ కుటుంబ కారణాలరీత్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అయితే క్రిస్ వోక్స్ నేతృత్వంలోని పేస్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. భారత్ రెండు ఇన్నింగ్స్‌లోనూ టెయిలెండర్లను స్వల్ప స్కోర్లకే కట్టడి చేయడంలో విజయం సాధించారు. టంగ్, కార్స్, కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రాణించారు. అటు బ్యాటింగ్‌లోనూ ఎనిమిది మంది బ్యాటర్లతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. క్రాలే, డకెట్, పోప్, రూట్, స్టోక్స్, స్మిత్ మరోసారి భారత బౌలర్లపై ఆధిక్యం ప్రదర్శించాలనుకుంటున్నారు.
తుది జట్లు
భారత్ (అంచనా): జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్, పంత్, జడేజా, నితీశ్/శార్దూల్, కుల్దీప్/సుందర్, బుమ్రా/ఆకాశ్, సిరాజ్, ప్రసిద్ధ్.
ఇంగ్లండ్: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్ (కెప్టెన్), స్మిత్, వోక్స్, కార్స్, టంగ్, బషీర్.
పిచ్, వాతావరణం: ఎడ్జ్‌బాస్టన్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. చివరి 10 టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 334గా ఉంది. ఇక ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపిస్తారు. చివరి రోజు స్పిన్నర్లు కీలకమవుతారు. తొలి రోజు చిరుజల్లులకు ఆస్కారం ఉంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి