Share News

Tilak Varma Interview: కోహ్లీని అనుసరిస్తా

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:59 AM

ఆసియా కప్‌ ఫైనల్లో కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ బరిలోకి దిగిన తిలక్‌ వర్మ అద్భుత విజయాన్నందించి భారత్‌ను సమున్నతంగా నిలిపాడు. జట్టును విజయతీరాలకు చేర్చాక అంతులేని ఉద్వేగంతో సింహనాదం...

Tilak Varma Interview: కోహ్లీని అనుసరిస్తా

  • విరాట్‌తో పోల్చడాన్ని గౌరవంగా భావిస్తున్నా

  • దేశానికి టీ20 వరల్డ్‌కప్‌ అందించాలనేది కల

  • ఫైనల్లో ప్రత్యర్థులు దారుణంగా స్లెడ్జింగ్‌ చేశారు

  • ఆరునూరైనా దేశాన్ని గెలిపించాలనుకున్నా

ఆంధ్రజ్యోతితో తిలక్‌ వర్మ

ఆసియా కప్‌ ఫైనల్లో కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ బరిలోకి దిగిన తిలక్‌ వర్మ అద్భుత విజయాన్నందించి భారత్‌ను సమున్నతంగా నిలిపాడు. జట్టును విజయతీరాలకు చేర్చాక అంతులేని ఉద్వేగంతో సింహనాదం చేశాడు. భారత క్రికెట్‌ నయా చేజ్‌ మాస్టర్‌గా అభిమానుల నుంచి నీరాజనాలందుకుంటున్న ఆసియా కప్‌ హీరో, తెలుగు తేజం ఠాకూర్‌ తిలక్‌ వర్మ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న విశేషాలు..


అతడి మాటల్లోనే..

2025 సెప్టెంబరు 28.. నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆసియా కప్‌.. అందులోనూ పాకిస్థాన్‌ను ఓడించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నా టీ20 కెరీర్‌లోని రెండు సెంచరీల కంటే ఈ ఫైనల్‌లో సాధించిన 69 పరుగులు చాలా ప్రత్యేకమైనవి. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఇది. ఊహకందని ఒత్తిడి, భారీ అంచనాల నడుమ జరిగిన ఫైనల్లో కడవరకు బ్యాటింగ్‌ చేసి జట్టును గెలిపించడం కంటే మధురానుభూతి ఇంకేముంటుంది. ఆసియా కప్‌ ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల్లో ఎదురయ్యే సవాళ్లకు మానసికంగా సిద్ధమై ఉన్నాం. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ తర్వాత జరుగుతున్న టోర్నీ కావడంతో పాక్‌తో మ్యాచ్‌ల్లో ఉండే పరిస్థితుల గురించి కోచ్‌ గౌతం గంభీర్‌ మమ్మల్ని సన్నద్ధం చేశారు. ఫైనల్లో బ్యాటింగ్‌కి రాగానే స్టేడియంలోని ఆ తీవ్రత చూసి కొంచెం ఒత్తిడికి లోనయ్యా. స్వల్ప స్కోరుకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఎడాపెడా షాట్లు కొట్టకుండా బాధ్యతగా ఆడాల్సిన పరిస్థితి. ఒక ఓవర్‌ పూర్తయిన తర్వాత క్రీజులో ఒకసారి కళ్లు మూసుకోగానే 140 కోట్ల మంది ప్రజలు జట్టుపై పెట్టుకున్న ఆశలు, నమ్మకం మదిలో మెదిలాయి. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని ఆఖరి పరుగు సాధించే వరకు క్రీజు వదలకూడదని అనుకుని పట్టుదలగా ఆడా.

కోహ్లీ అడుగుజాడల్లో నడుస్తా..

2011 వన్డే వరల్డ్‌క్‌పను టీమిండియా గెలిచిన తర్వాత ఆ స్ఫూర్తితో నేను క్రికెట్‌ ఆడడం ప్రారంభించా. అప్పటి నుంచి నేను కోహ్లీ ఆట చూస్తూ అతడిని చాలా విషయాల్లో అనుకరించేవాణ్ణి. బ్యాటింగ్‌లోనే కాకుండా మైదానంలోనూ కోహ్లీ చూపించే దూకుడు తాలుకూ ప్రభావం నాపై ఉంది. నా ఆరాధ్యుడైన కోహ్లీతో అభిమానులు నన్ను పోలుస్తుండడం గౌరవంగా భావిస్తున్నా. కానీ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం ఆషామాషీ కాదు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచక్‌పను దేశానికి అందించడమే నా లక్ష్యం. ప్రతి రోజు ఆ ఆలోచనలు నన్ను ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఆ ట్రోఫీ సాధించాకే ప్రశాంతంగా నిద్రపోగలను. అప్పటిదాకా నిద్రలో కూడా అవే ఆలోచనలు వస్తుంటాయి. ప్రస్తుతానికి కొద్దిరోజులు కుటుంబంతో గడిపి, తర్వాత ఆస్ట్రేలియా సిరీ్‌సకు సన్నద్ధమవుతా.


చెప్పలేని భాషలో పాక్‌ స్లెడ్జింగ్‌..

ఆటతోనే కాకుండా ప్రత్యర్థి జట్టు క్రికెటర్లు మమ్మల్ని చాలా కవ్వించారు. చెప్పలేని భాషలో స్లెడ్జింగ్‌కు దిగారు. నా ఏకాగ్రతను దెబ్బతీయడానికి తీవ్రంగా యత్నించారు. మాటలతో మానసికంగా దెబ్బకొట్టి పైచేయి సాధించాలని చూశారు. నేను మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా బంతిపైనే దృష్టి పెట్టి బ్యాటింగ్‌ చేశా. వారి చేష్టలకు, మాటలకు నేను ఆవేశపడి ఒక్క చెత్త షాట్‌ ఆడినా మ్యాచ్‌ ఫలితమే తారుమారయ్యే అవకాశం ఉండడంతో సంయమనంతో ఆడా. ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో కోచ్‌ సలాం బయాషీ సార్‌ వద్ద బాల్యం నుంచి నేర్చుకున్నదాన్ని ఫైనల్లో ఆచరణలో పెట్టా. మనం మూడో వికెట్‌ కోల్పోయాక పాక్‌ ఆటగాళ్లు మైదానంలో బాగా రెచ్చిపోయారు. గెలుపు తమదే అన్నట్టు ప్రవర్తించారు. అయినా నేను నా నోటితో కాకుండా బ్యాట్‌తోనే స్పందించా. కోట్లాది భారతీయుల ముఖాల్లో ఆనందం చూడాలని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఆడా.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి

హైదరాబాద్‌)

ఇవి కూడా చదవండి..

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం

Updated Date - Oct 01 , 2025 | 05:59 AM