Share News

Abhishek Nayar: అభిషేక్ నాయర్.. బీసీసీఐ తొలగించింది.. కేకేఆర్ కొలువు ఇచ్చింది

ABN , Publish Date - Apr 19 , 2025 | 07:18 PM

గంభీర్ అభ్యర్థన మేరకు బీసీసీఐ వారిని టీమిండియా సహాయక సిబ్బందిగా తీసుకుంది. గంభీర్‌తో పాటు వచ్చిన అభిషేక్‌ నాయర్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా, టి. దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. అయితే గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Abhishek Nayar: అభిషేక్ నాయర్.. బీసీసీఐ తొలగించింది.. కేకేఆర్ కొలువు ఇచ్చింది
Abhishek Nayar

టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తనతో పాటు మరికొందరిని తన సహాయ సిబ్బందిగా తెచ్చుకున్నాడు. గంభీర్ అభ్యర్థన మేరకు బీసీసీఐ (BCCI) వారిని టీమిండియా సహాయక సిబ్బందిగా తీసుకుంది. గంభీర్‌తో పాటు వచ్చిన అభిషేక్‌ నాయర్‌ (Abhishek Nayar)ను అసిస్టెంట్‌ కోచ్‌గా, టి. దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. అయితే గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దాంతో గంభీర్‌తో పాటు వచ్చిన సహాయక సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి.


తాజాగా అభిషేక్ నాయర్‌కు, దిలీప్‌కు బీసీసీఐ ఉద్వాసన పలికినట్టు వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 17వ తేదీ నుంచి అభిషేక్ నాయర్, దిలీప్ తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. అయితే టీమిండియా బాధ్యతల నుంచి వైదొలిగిన అభిషేక్ నాయర్ వెంటనే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో చేరిపోయాడు. అంటే టీమిండియా బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే అతడికి కేకేఆర్ అవకాశం ఇచ్చింది. నిజానికి అభిషేక్ నాయర్ గతంలో కేకేఆర్ జట్టుతోనే పని చేశాడు. గంభీర్ హెడ్‌కోచ్‌గా ఉండగా అభిషేక్ సహాయక సిబ్బందిగా ఉండేవాడు. గత సీజన్‌లో కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సందర్భంగా గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్ పదవి వరించింది.


గంభీర్ తనతో పాటే అభిషేక్ నాయర్‌ను కూడా టీమిండియా సహాయక సిబ్బందిగా తీసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో గంభీర్ అధికారాలకు కత్తెర వేసిన బీసీసీఐ అతడు తీసుకొచ్చిన సహాయక సిబ్బందిని కూడా తొలగించింది. టీమిండియా పదవిని కోల్పోయిన రెండ్రోజుల్లోనే అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రత్యక్ష్యమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 09:09 PM