Share News

ఇక కంగారు పోయింది టైటిల్ మిగిలింది

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:38 AM

ఏడాదిన్నర కిందట వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ను దూరం చేసిన ఆస్ట్రేలియాపై భారత్‌ బదులు తీర్చుకుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (84) మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో...

ఇక కంగారు పోయింది టైటిల్ మిగిలింది

ఐదోసారి ఫైనల్‌ చేరిన భారత్‌

అదరగొట్టిన విరాట్‌ కోహ్లీ

సెమీ్‌సలో ఆస్ట్రేలియా చిత్తు

హమ్మయ్య.. ఈసారి మనదే పైచేయి. ఐసీసీ నాకౌట్‌ టోర్నీల్లో ఎదురుపడిన ప్రతీసారి కోట్లాది భారత హృదయాలను భగ్నం చేసే ఆస్ట్రేలియాకు రివర్స్‌ పంచ్‌ పడింది. తాజా టోర్నీలో నిలకడగా ఆడుతున్న టీమిండియా కీలక సెమీ్‌సలోనూ ఎలాంటి తడబాటుకు లోనుకాలేదు. ముందున్నది ప్రమాదకర ఆసీస్‌ అయినా.. తమ శక్తిసామర్థ్యాలను నమ్ముకుని బరిలోకి దిగింది. స్పిన్‌ పవర్‌ను చూపిస్తూ ఆ జట్టును ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేసింది. ఇక ఛేజింగ్‌లో రారాజు.. అందునా ఆసీ్‌సపై చెలరేగే విరాట్‌ కోహ్లీ మరోసారి కదం తొక్కాడు. శ్రేయాస్‌, రాహుల్‌ సైతం ఆసీస్‌ అనుభవలేమి బౌలింగ్‌పై ఆధిపత్యం చూపి జట్టును ఫైనల్‌కు చేర్చారు. ఇక 2011 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఐసీసీ నాకౌట్‌లో ఆసీ్‌సపై భారత్‌ గెలవడం ఇదే తొలిసారి.


దుబాయ్‌: ఏడాదిన్నర కిందట వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ను దూరం చేసిన ఆస్ట్రేలియాపై భారత్‌ బదులు తీర్చుకుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (84) మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో కంగారూలను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఫలితంగా టీమిండియా వరుసగా మూడోసారి చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈనెల 9న దుబాయ్‌లో ఫైనల్‌ జరుగుతుంది. నేడు న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌ విజేత భారత్‌ ప్రత్యర్థి కానుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (73), అలెక్స్‌ క్యారీ (61) అర్ధసెంచరీలతో రాణించారు. పేసర్‌ షమికి మూడు, స్పిన్నర్లు జడేజా, వరుణ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. శ్రేయాస్‌ (45), రాహుల్‌ (42 నాటౌట్‌), హార్దిక్‌ (28), రోహిత్‌ (28), అక్షర్‌ (27) విజయంలో భాగమయ్యారు. ఎల్లిస్‌, జంపాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు.

విరాట్‌ నిలకడ

ఓ మాదిరి ఛేదనను భారత్‌ ప్రశాంతంగా ముగించింది. గిల్‌ మినహా క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటరూ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ఆఖర్లో బంతికో పరుగు చొప్పున చేయాల్సి వచ్చినప్పుడు హార్దిక్‌ ధనాధన్‌ ఆటతీరుతో తేలికపరిచాడు. ఇక విరాట్‌-శ్రేయాస్‌ జోడీ మధ్య ఓవర్లలో ఆసీస్‌ బౌలర్లను ఆడేసుకుంది. దీనికి తోడు ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా భారత్‌కు కలిసివచ్చింది. ఆరంభంలో రోహిత్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కూపర్‌, లబుషేన్‌ వదిలేశారు. గిల్‌ (8) విఫలం కాగా ఉన్న కాసేపు రోహిత్‌ దూకుడుగా ఆడాడు. బంతికో పరుగు చొప్పున సాధించిన అతడిని 8వ ఓవర్‌లో కూపర్‌ అవుట్‌ చేశాడు. కానీ ఆ తర్వాత మరో వికెట్‌ తీసేందుకు ఆసీస్‌ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. భారీ షాట్లకు వెళ్లకుండా ఎక్కువగా సింగిల్స్‌పై దృష్టి సారించిన విరాట్‌-శ్రేయాస్‌ మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కోహ్లీ 53 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అదే ఫీట్‌కు సమీపంలో ఉన్న శ్రేయా్‌సను 27వ ఓవర్‌లో జంపా బౌల్డ్‌ చేసి ఆసీ్‌సకు ఊరటనిచ్చాడు. అనంతరం అక్షర్‌ (27)తో కలిసి నాలుగో వికెట్‌కు విరాట్‌ 44 రన్స్‌ జోడించాడు. 40వ ఓవర్‌లో జట్టు 200 రన్స్‌ సాధించింది. అయితే సమీకరణం బంతికో పరుగు చొప్పున మారిన వేళ విరాట్‌ అనవసరంగా భారీ షాట్‌కు వెళ్లి జంపా గూగ్లీకి వెనుదిరిగాడు. అప్పటికి రాహుల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 47 పరుగులు జత చేరాయి. ఇక హార్దిక్‌ (28) లాంగా్‌ఫలో రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఒత్తిడి పూర్తిగా తగ్గింది. మరో 13 బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన వేళ హార్దిక్‌ వెనుదిరిగినా ఇబ్బంది లేకపోయింది. రాహుల్‌ సిక్సర్‌తో 11 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


స్మిత్‌, క్యారీ

హాఫ్‌ సెంచరీలు

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా, భారత బౌలర్లు ఎప్పటిలాగే ప్రత్యర్థిని కట్టడి చేశారు. అయితే ఆరంభంలో హెడ్‌ వణికించగా.. మధ్య ఓవర్లలో స్మిత్‌, క్యారీ నిలకడ ప్రదర్శనతో 260+ స్కోరు వరకు రాగలిగింది. కెప్టెన్‌ రోహిత్‌ సరైన సమయంలో బౌలర్లను మారుస్తూ ఫలితం రాబట్టాడు. ఇక ఎప్పటిలాగే స్పిన్నర్లు ఆధిపత్యం చూపి 5 వికెట్లు పడగొట్టారు. ఆసీస్‌ ఆరంభం కాస్త నిదానంగానే సాగింది. ఓపెనర్‌ కూపర్‌ను షమి డకౌట్‌ చేయగా తొలి మూడు ఓవర్లలో చేసింది 4 పరుగులే. కానీ భారత్‌తో మ్యాచ్‌ అంటే ఊపు మీదుండే హెడ్‌ మరోసారి బెదరగొట్టాడు. తనదైన శైలిలో బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పరుగుల వేగం పెరిగింది. అతడి 39 పరుగుల్లో బౌండరీల రూపంలోనే 32 రన్స్‌ రావడం విశేషం. అయితే బంతి వరుణ్‌ చేతికివ్వడంతో హెడ్‌ ఆట ముగిసింది. దీంతో ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్‌ కూడా ఊపిరిపీల్చుకున్నారు. రెండో వికెట్‌కు స్మిత్‌తో కలిసి హెడ్‌ 32 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అనంతరం స్మిత్‌ ఓపిగ్గా క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 14వ ఓవర్‌ (అక్షర్‌)లో బంతి వికెట్లను తాకినా బెయిల్స్‌ కిందపడక స్మిత్‌ బతికిపోయాడు. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ తను లబుషేన్‌ (29)తో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు, నాలుగో వికెట్‌కు ఇన్‌గ్లిస్‌ (11)తో 34 పరుగులు, క్యారీతో కలిసి ఐదో వికెట్‌కు మరో 54 పరుగులు జత చేశాడు. అర్ధసెంచరీతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న స్మిత్‌ను చివరకు 37వ ఓవర్‌లో షమి బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత బాధ్యతను క్యారీ తీసుకోవడంతో చివర్లో పరుగులు వేగంగా వచ్చాయి. 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన క్యారీ రనౌట్‌గా వెనుదిరిగాడు. మ్యాక్స్‌వెల్‌ (7)ను అక్షర్‌ బౌల్డ్‌ చేయగా.. డ్వార్షిస్‌ (19), ఎల్లిస్‌ (10) వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఆఖరి ఓవర్‌లో జంపా (7)ను హార్దిక్‌ అవుట్‌ చేయడంతో ఆసీస్‌ ఆట ముగిసింది.


స్కోరుబోర్డు

ఆస్ర్టేలియా: హెడ్‌ (సి) గిల్‌ (బి) వరుణ్‌ 39; కూపర్‌ (సి) రాహుల్‌ (బి) షమి 0; స్మిత్‌ (బి) షమి 73; లబుషేన్‌ (ఎల్బీ) జడేజా 29; ఇన్‌గ్లి్‌స (సి) విరాట్‌ (బి) జడేజా 11; క్యారీ (రనౌట్‌) 61; మ్యాక్స్‌వెల్‌ (బి) అక్షర్‌ 7; డ్వార్షిస్‌ (సి) శ్రేయాస్‌ (బి) వరుణ్‌ 19; జంపా (బి) హార్దిక్‌ 7; ఎల్లిస్‌ (సి) విరాట్‌ (బి) 10; తన్వీర్‌ సంఘా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: 49.3 ఓవర్లలో 264 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-4, 2-54, 3-110, 4-144, 5-198, 6-205, 7-239, 8-249, 9-262, 10-264; బౌలింగ్‌: షమి 10-0-48-3; హార్దిక్‌ 5.3-0-40-1; కుల్దీప్‌ 8-0-44-0; వరుణ్‌ 10-0-49-2; అక్షర్‌ 8-1-43-1; జడేజా 8-1-40-2.

భారత్‌: రోహిత్‌ (ఎల్బీ) కూపర్‌ 28; గిల్‌ (బి) డ్వార్షిస్‌ 8; విరాట్‌ (సి) డ్వార్షిస్‌ (బి) జంపా 84; శ్రేయాస్‌ (బి) జంపా 45; అక్షర్‌ (బి) ఎల్లిస్‌ 27; రాహుల్‌ (నాటౌట్‌) 42; హార్దిక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) ఎల్లిస్‌ 28; జడేజా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 48.1 ఓవర్లలో 267/6. వికెట్ల పతనం: 1-30, 2-43, 3-134, 4-178, 5-225, 6-259; బౌలింగ్‌: డ్వార్షిస్‌ 7-0-39-1; ఎల్లిస్‌ 10-0-49-2; కూపర్‌ 8-0-37-1; జంపా 10-0-60-2; తన్వీర్‌ 6-0-41-0; మ్యాక్స్‌వెల్‌ 6.1-0-35-0; హెడ్‌ 1-0-6-0.

కుల్దీ్‌పపై ఎడా..పెడా

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో స్పిన్నర్‌ కుల్దీ్‌పపై విరాట్‌, కెప్టెన్‌ రోహిత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 32వ ఓవర్‌లో స్మిత్‌ ఫ్లిక్‌ చేసిన బంతిని విరాట్‌ మిడ్‌ వికెట్‌ నుంచి నేరుగా కుల్దీప్‌ వైపు విసిరాడు. అయితే వికెట్ల దగ్గర ఉన్న కుల్దీప్‌ దాన్ని అందుకోకుండా వదిలేయడంతో కవర్స్‌లో ఉన్న రోహిత్‌ పట్టుకోవాల్సి వచ్చింది. కానీ అటు విరాట్‌.. ఇటు రోహిత్‌ ఇద్దరూ కుల్దీప్‌ చేసిన పనికి కోపంతో ఊగిపోతూ ‘బంతి పట్టుకోవడం చేతకాదా?’ అంటూ బూతులతో దుర్బాషలాడడం కనిపించింది.


ఒత్తిడికి లోను కాలేదు

ఈ పిచ్‌పై స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ భాగస్వామ్యాలను నెలకొల్పడం ముఖ్యం. సెమీస్‌ ఒత్తిడితో కూడిన మ్యాచ్‌. ఓపిగ్గా చివరి వరకు నిలబడితే ప్రత్యర్థి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అందుకే నేను భారీ షాట్లకు వెళ్లకుండా ఎక్కువగా సింగిల్స్‌పై దృష్టి సారించాను. ఓ దశలో రన్‌రేట్‌ ఆరు వరకు వెళ్లినా ఆందోళన పడలేదు. వన్డే ఫార్మాట్‌లో అత్యుత్తమ స్థాయిలో ఉన్నానా? అంటే నేను చెప్పలేను. అలాంటి విషయాలపై దృష్టి సారించను. సెంచరీ చేసుంటే బావుండేది కానీ జట్టు విజయం అన్నింటికన్నా ముఖ్యం. - విరాట్‌ కోహ్లీ

తొలి కెప్టెన్‌గా..

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్ని ఐసీసీ టోర్నీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చిన ఘనత సాధించాడు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (2023), వన్డే వరల్డ్‌ కప్‌ (2023), టీ20 వరల్డ్‌కప్‌ (2024), చాంపియన్స్‌ ట్రోఫీ (2025)ల్లో అతడి నాయకత్వంలో జట్టు తుది పోరుకు చేరగలిగింది.

నల్ల రిబ్బన్లతో బరిలోకి..

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత క్రికెటర్లు తమ భుజాలకు నల్ల రిబ్బన్లు ధరించి ఆడారు. ముంబై మాజీ స్పిన్నర్‌ పద్మాకర్‌ శివాల్కర్‌ సోమవారం మృతి చెందాడు. దీంతో ఆయనకు నివాళిగా ఆటగాళ్లంతా ఇలా నల్లటి రిబ్బన్లు ధరించారు.

1

ఐసీసీ వన్డే టోర్నీలో అత్యధిక సిక్సర్లు (65) బాదిన ప్లేయర్‌గా రోహిత్‌. క్రిస్‌ గేల్‌ (64)ను అధిగమించాడు.

1

ఐసీసీ వన్డే నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై అత్యధిక ఛేదన (265) చేసిన జట్టుగా భారత్‌ వన్డేల్లో వరుస టాస్‌లు (11) కోల్పోయిన రెండో కెప్టెన్‌గా రోహిత్‌. పీటర్‌ బోరెన్‌ సరసన నిలిచాడు. లారా (12) ముందున్నాడు.

వన్డేల్లో ఎక్కువ క్యాచ్‌లు (161) అందుకున్న రెండో ఫీల్డర్‌గా విరాట్‌ కోహ్లీ. జయవర్ధనె (218) ముందున్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 335 క్యాచ్‌లు పట్టిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచి ద్రవిడ్‌ (334)ను అధిగమించాడు.

2

వన్డే ఛేజింగ్‌ల్లో ఎక్కువ పరుగులు (8062) చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్‌. సచిన్‌ (8720) టాప్‌లో ఉన్నాడు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 06:00 AM