Share News

ఆ విరాటుడు సాక్షాత్కరించాడు!

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:14 AM

సమకాలీన క్రికెట్‌లో తిరుగులేని బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ. మొత్తం 547 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతడి సొంతం. మూడు ఫార్మాట్లలో కలిపి 27వేలకు పైగా పరుగులు. ఎన్నో రికార్డులతో...

ఆ విరాటుడు సాక్షాత్కరించాడు!

కోహ్లీ 51వ వన్డే శతకం

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

సమకాలీన క్రికెట్‌లో తిరుగులేని బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ. మొత్తం 547 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతడి సొంతం. మూడు ఫార్మాట్లలో కలిపి 27వేలకు పైగా పరుగులు. ఎన్నో రికార్డులతో 16 సంవత్సరాలుగా తనదైన ముద్ర. కానీ ఇటీవలి కాలంలో ఫామ్‌ కోల్పోయిన విరాట్‌ ఇంటా..బయటా..తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దశాబ్దంన్నరకుపైగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న ఆటగాడు ఇంత సుదీర్ఘకాలం ఫామ్‌ లేమితో సతమతం కావడమా? ఎప్పటికి బయటపడతాడు ఆ తడ‘బ్యాటు’ నుంచి? ఎంతకాలం అతడికి ఇంకా జట్టులో చోటు ? అని తీవ్రంగా ప్రశ్నించిన వారూ లేకపోలేదు. అయితే బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లో సెంచరీతో విరాట్‌ ఆట మళ్లీ గాడిలో పడినట్టేనని అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తర్వాత నాలుగు టెస్ట్‌లలో అతడు నిరాశ పరిచాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో ఆఖరి వన్డేలో హాఫ్‌ సెంచరీతో కోహ్లీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. ఇక..ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్‌ విఫలమయ్యాడు. దాంతో టోర్నీలో అతి కీలకమైన పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఎలా ఆడతాడోననే ఆందోళన వ్యక్తమైంది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మ్యాచ్‌ అంటే కోహ్లీ రెచ్చిపోతాడు. 2022 టీ20 వరల్డ్‌ కప్‌ మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో తన అద్భుత బ్యాటింగ్‌ను గుర్తు చేస్తూ..


చాంపియన్స్‌ ట్రోఫీ పోరులో విరాట్‌ చెలరేగాడు. క్రీజులో కుదురుకొనే వరకు బ్యాక్‌ఫుట్‌ గేమ్‌ ఆడిన కోహ్లీ ఆపై క్రీజు బయటకు వచ్చి సంధించిన షాట్లు అదరహో అనిపించాయి. హారిస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా అతడు కొట్టిన బౌండరీ చూసి తీరాల్సిందే. చాన్నాళ్ల తర్వాత తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. ఓర్పు, నేర్పు ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో మరోసారి కీలక భూమిక పోషించాడు. అజేయ సెంచరీతో తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. ఇక విరాట్‌ ఒక్కో షాట్‌ కొడుతుంటే కెప్టెన్‌ రోహిత్‌ శర్మలో కలిగిన ఆనందం అంతా ఇంతాకాదు. అతడి ఒక్కో షాట్‌కు చప్పట్లు చరిచి కోహ్లీలో ఉత్సాహం నింపాడు. చివరగా విరాట్‌ సెంచరీ మార్క్‌ చేరగానే రోహిత్‌ సంతోషం రెండింతలైంది.



మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 08:24 AM