కబడ్డీ సంఘంలో నిధుల అవకతవకలపై కమిటీ
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:21 AM
తెలంగాణ కబడ్డీ సంఘం (టీకేఏ) నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్టు...
వారంలో నివేదిక ఇవ్వాలని అధ్యక్షుడి ఆదేశం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ కబడ్డీ సంఘం (టీకేఏ) నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్టు ఆ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేష్ వెల్లడించారు. ఆదివారం మాదాపూర్‌లోని ఒక హోటల్‌లో టీకేఏ వార్షిక సర్వ సభ్య సమావేశం జరిగింది. తెలంగాణ కబడ్డీ సంఘం నిధుల అవకతవకలపై అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ పైన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర కబడ్డీ సంఘంలో సీనియర్ సభ్యుడైన అజీజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని, వారం రోజుల్లో ఈ విషయంపై ప్రాథమిక నివేదిక అందుతుందని వీరేష్ చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తామని తెలిపారు. టీకేఏ మాజీ సంయుక్త కార్యదర్శి తోట గోపీ ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. ఇక, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కొందరు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఒలింపిక్ సంఘం, కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ వివరణ ఇచ్చారు.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి