Share News

Inspirational Womens World Cup Champions: కష్టాలకోర్చి లక్ష్యాన్ని చేరి

ABN , Publish Date - Nov 04 , 2025 | 05:33 AM

వన్డే వరల్డ్‌ కప్‌ టైటిల్‌ విజయంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌పై భారత్‌ ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరింది. బలమైన జట్లు పోటీపడిన ప్రపంచ కప్‌లో టైటిల్‌ గెలవడం ఆషామాషీ కాదు. అయితే సవాళ్లను ఎదుర్కోవడం....

Inspirational Womens World Cup Champions: కష్టాలకోర్చి లక్ష్యాన్ని చేరి

చాంపియన్ల త్యాగాల గాథలు

వన్డే వరల్డ్‌ కప్‌ టైటిల్‌ విజయంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌పై భారత్‌ ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరింది. బలమైన జట్లు పోటీపడిన ప్రపంచ కప్‌లో టైటిల్‌ గెలవడం ఆషామాషీ కాదు. అయితే సవాళ్లను ఎదుర్కోవడం విశ్వవిజేత భారత జట్టులోని క్రికెటర్లకు కొత్తకాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను, సమస్యలను అధిగమించి తమ క్రికెటర్‌ కెరీర్‌ను వారు తీర్చిదిద్దుకున్న తీరు స్ఫూర్తిదాయకం.

ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం

విజయ గీతాలాపనలో..

వరల్డ్‌కప్‌ గెలిచిన ఆనందంలో భారత మహిళా ఆటగాళ్లు డీవై పాటిల్‌ మైదానంలో అంతులేని సంబరాల్లో మునిగారు. దీంట్లో భాగంగా కోచ్‌ మజుందార్‌తో కలిసి పిచ్‌ దగ్గరికి వెళ్లి తమ టీమ్‌ సాంగ్‌ను ఆలపించారు. ‘సాత్‌ మే ఛలేంగే.. సాత్‌మే ఉఠేంగే.. హమ్‌ హై టీమిండియా’ అంటూ సాగే ఈ పాటను చప్పట్లు చరుస్తూ వీరంతా హుషారుగా ఆలపించారు. బీసీసీఐ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

నాన్న కలను

నెరవేర్చి..

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన పేసర్‌ రేణుకా సింగ్‌ తండ్రికి క్రికెట్‌ అంటే పిచ్చి అభిమానం. తన ఫేవరెట్‌ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ పేరును అతడు తన కుమారుడికి పెట్టాడు. రేణుకకు మూడేళ్ల వయస్సులో తండ్రి మరణించాడు. తండ్రి ఆకాంక్ష మేరకు రేణుకను క్రికెటర్‌గా తీర్చిదిద్దే బాధ్యతను తల్లి సునీత, సోదరుడు వినోద్‌ తీసుకున్నారు. తొలుత గ్రామంలో బాలుర జట్లతో క్రికెట్‌ ఆడిన రేణుక..బంధువు భూపిందర్‌ సలహాతో ధర్మశాలలోని హిమాచల్‌ క్రికెట్‌ సంఘం మహిళల రెసిడెన్షియల్‌ అకాడమీలో చేరి తన క్రికెట్‌ నైపుణ్యాలకు పదును పెట్టుకుంది.


కూరగాయలు అమ్మి..

స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రాధా యాదవ్‌ ముంబైలో పుట్టింది. తండ్రి కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఇంటి పరిసర ప్రాంతాల్లో క్రికెట్‌ ఆడుతుండే రాధ..కోచ్‌ ప్రఫుల్‌ నాయక్‌ కంటపడింది. ఆమె బ్యాటింగ్‌ నైపుణ్యాలను గమనించిన ప్రఫుల్‌..రాధ తండ్రిని ఒప్పించి తనతోపాటు బరోడా తీసుకు వెళ్లాడు. అక్కడ శిక్షణ ఇప్పించి ఆమెను జాతీయస్థాయి క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు.

ఆ త్రో

మార్చేసింది..

దీప్తీ శర్మ సోదరుడు సుమీత్‌ ఉత్తరప్రదేశ్‌ జట్టు పేసర్‌. దాంతో అతడు ఆడే అన్ని మ్యాచ్‌లకు దీప్తి వెళ్లేది. ఓసారి తన వద్దకు వచ్చిన బంతిని బుల్లెట్‌లా దీప్తి త్రో చేయడం భారత జట్టు మాజీ క్రికెటర్‌ హేమలత కంటపడింది. ఆమెలో క్రికెటర్‌ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని సుమీత్‌కు హేమలత సూచించింది. అలా దీప్తి ఆటలోకి అడుగుపెట్టింది.

నగలు కుదువపెట్టి..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలోని గిరిజన నగర పంచాయతీ గువారాలో పుట్టింది క్రాంతి గౌడ్‌. ఆమె తండ్రి రిటైర్డ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆరుగురు పిల్లల్లో క్రాంతి చివరిది. సోదరులు టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడుతుండడం చూసి ఆమె ఆటపట్ల ఆకర్షితురాలైంది. క్రాంతిలో సహజసిద్ధమైన అథ్లెట్‌ లక్షణాలున్నాయని గమనించిన కోచ్‌ రాజీవ్‌ బిల్తారే ఆమెకు శిక్షణ ఇప్పించాలని అనుకున్నాడు. కానీ ఆడపిల్ల క్రికెట్‌ ఆడడమా..అని క్రాంతి కుటుంబం అందుకు అంగీకరించలేదు. అయితే క్రాంతికి తల్లి అండగా నిలిచింది. శిక్షణకు అవసరమైన డబ్బుల కోసం తన నగలు సైతం ఆమె కుదువ పెట్టింది.

తండ్రి

తయారు చేసిన బ్యాట్‌తో..

మొహాలీకి చెందిన అమన్‌జోత్‌ కౌర్‌ తండ్రి కార్పెంటర్‌. అమన్‌కు బ్యాట్‌లేదంటూ స్థానిక బాలురు కొందరు ఆమెను తమతో ఆడేందుకు నిరాకరించారు. దాంతో అమన్‌జోత్‌ తండ్రి స్వయంగా ఓ బ్యాట్‌ తయారు చేసి ఆమెకు ఇచ్చాడు. 14 ఏళ్ల వయస్సులో రాధను కోచ్‌ నగేశ్‌ గుప్తా వద్ద చేర్పించాడు. అతడి కోచింగ్‌లో అమన్‌ తన నైపుణ్యాలకు మరింత సొబగులు అద్దుకుంది.


నానమ్మ అనారోగ్యాన్ని దాచాం

వరల్డ్‌కప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ వోల్వార్ట్‌ క్యాచ్‌ను అమన్‌జోత్‌ అద్భుతంగా పట్టేసి మ్యాచ్‌ను మనవైపు తిరిగేలా చేసింది. అయితే అమన్‌ టోర్నీపైనే దృష్టి పెట్టేందుకు తన నానమ్మ అనారోగ్యాన్ని కుటుంబసభ్యులు తెలియనీయలేదట. ‘అమన్‌జోత్‌ కెరీర్‌ ఆరంభంలో నా తల్లి నిరంతరం తనకు మద్దతిచ్చేది. అమన్‌ వీధుల్లో, పార్కుల్లో ఆడేటప్పుడు వెంటే ఉండి గమనించేది. అయితే గత నెలలో ఆమెకు గుండెపోటు వచ్చింది. కొన్ని రోజులుగా చికిత్స కోసం మేమంతా ఆస్పత్రిలోనే గడుపుతున్నాం. అయితే ఈ విషయాలేమీ అమన్‌కు చెప్పకుండా దాచాం. ఇప్పుడీ విజయం తన నానమ్మ ఆరోగ్యాన్ని కుదుటపరుస్తుందని ఆశిస్తున్నాం’ అని అమన్‌ తండ్రి భూపిందర్‌ సింగ్‌ తెలిపాడు.

అమన్‌ తండ్రి

ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Updated Date - Nov 04 , 2025 | 05:34 AM