South Africa's Historic Win: సఫారీలు అదుర్స్ సీన్ రివర్స్
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:53 AM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా అనూహ్య ఓటమితో ఆరంభించింది. ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉంటే భారత బ్యాటర్ల తడబాటు ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. గతేడాది న్యూజిలాండ్‌తో...
15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా విజయం
తొలి టెస్టులో 30 రన్స్‌తో టీమిండియా పరాజయం
తిప్పేసిన స్పిన్నర్ హార్మర్
భారత్ ముందు లక్ష్యం 124 పరుగులే.. చేతిలో తొమ్మిది వికెట్లు ఉండగా ఆందోళన అనవసరం అనిపించింది.. పిచ్ క్లిష్టంగా ఉండడంతో ఆదివారం ఆఖరి సెషన్‌లోనైనా మ్యాచ్‌ను ముగిస్తారనే అంతా భావించారు. కానీ బరిలోకి దిగాక ఆడుతోంది స్వదేశంలోనేనా? అన్న సందేహం కలిగింది. సఫారీ బౌలర్ల ప్రతాపం ముందు భారత బ్యాటర్లు చిన్నబోయారు. వారి పేస్.. స్పిన్ బంతులను టచ్ చేసేందుకే వణికిపోయారు. ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో.. జట్టు కనీసం వంద పరుగులైనా చేయకుండానే బ్యాట్లెత్తేసింది. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై సౌతాఫ్రికా అద్భుత విజయాన్నందుకుంది.
భారత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా అనూహ్య ఓటమితో ఆరంభించింది. ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉంటే భారత బ్యాటర్ల తడబాటు ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ మాదిరే.. ఈసారి కూడా మనోళ్లు స్పిన్‌కే బోల్తా కొట్టారు. ఆదివారం మూడో రోజు ఆటలో ప్రత్యర్థి విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన గిల్ సేన 30 పరుగుల తేడాతో ఓడింది. దీంతో పర్యాటక జట్టు సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. భారత్‌ను దెబ్బతీయడంలో స్పిన్నర్ సైమన్ హార్మర్ (4/21) మళ్లీ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా (55 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ సాధించగా, బాష్ (25) సహకరించాడు. స్పిన్నర్ జడేజాకు నాలుగు.. సిరాజ్, కుల్దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 93 పరుగులకే పరిమితమైంది. సుందర్ (31), అక్షర్ (26) ఆకట్టుకున్నారు. అలాగే సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు సాధించగా, భారత్ 189 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు 8 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ హార్మర్‌కు దక్కింది. కెప్టెన్ గిల్ మెడ నొప్పితో ఆస్పత్రిలో చేరడంతో బ్యాటింగ్‌కు దూరమయ్యాడు.
భళా.. బవుమా: ఆదివారం దక్షిణాఫ్రికా 93/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా, మరో పది ఓవర్లలో ఆలౌట్ అవుతారనిపించింది. కానీ ఈ పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో కెప్టెన్ బవుమా ఆడి చూపాడు. అతడికి తొమ్మిదో నెంబర్ బ్యాటర్ బాష్ చక్కగా సహకరించగా ఆ జట్టు 12 ఓవర్ల పాటు వికెట్ కోల్పోలేదు. ప్రమాదకర బంతులను అద్భుత డిఫెన్స్‌తో ఎదుర్కొంటూ బవుమా తొలి గంట బౌలర్లను విసిగించాడు. అటు గిల్ స్థానంలో కెప్టెన్సీ చేస్తున్న పంత్ ఆరంభంలో బుమ్రాకు బౌలింగ్ ఇవ్వకపోవడం నష్టపరిచింది. కుల్దీప్ ఓవర్‌లో సిక్సర్‌తో బాష్ జట్టు ఆధిక్యాన్ని వంద పరుగులకు చేర్చాడు. ఇక స్పిన్నర్లు ప్రభావం చూపకపోవడంతో ఎట్టకేలకు బుమ్రాను బరిలోకి దించడంతో తన మూడో ఓవర్‌లోనే బాష్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఎనిమిదో వికెట్‌కు 44 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెర పడింది. ఇక బుమ్రా ఓవర్‌లోనే ఫోర్‌తో బవుమా ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే సిరాజ్ ఒకే ఓవర్‌లో హార్మర్ (7), కేశవ్ (0)లను అవుట్ చేయడంతో సఫారీల ఇన్నింగ్స్ ముగిసింది.
ఒక్క పరుగుకు 2 వికెట్లు: ఈ పిచ్‌పై 124 పరుగుల ఛేదన ఎంత కష్టమో తొలి మూడు ఓవర్లలోనే భారత్‌కు తెలిసొచ్చింది. 6.7 అడుగుల పేసర్ యాన్సెన్ తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ అదనపు బౌన్స్‌తో బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జైస్వాల్ (0)ను, మూడో ఓవర్‌లో ఓపెనర్ రాహుల్ (1)ను పెవిలియన్‌కు చేర్చడంతో ఒక్క పరుగుకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఇక 10/2 స్కోరుతో రెండో సెషన్ ఆరంభించిన భారత్‌ను ఎప్పటిలాగే స్పిన్నర్ హార్మర్ కుదురుకోనీయలేదు. సుందర్, జురెల్ జోడీ మూడో వికెట్‌కు 32 పరుగులతో ఆశలు రేకెత్తిస్తున్న స్థితిలో దెబ్బతీశాడు. జురెల్‌ను అవుట్ చేయడంతో పాటు కాసేపటికే ప్రమాదకర పంత్ (2)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చడం జట్టుపై గట్టి ప్రభావం పడింది. ఆ తర్వాత జడేజా (18)తో కలిసి సుందర్ ఐదో వికెట్‌కు అందించిన 26 పరుగుల భాగస్వామ్యమే చెప్పుకోదగ్గది. జడ్డూను సైతం హార్మర్ ఎల్బీ చేయగా.. కుదురుకున్న సుందర్‌ను మార్‌క్రమ్ అవుట్ చేయడంతో ఓటమి ఖరారైంది. కానీ చివర్లో అక్షర్ బ్యాట్ ఝుళిపించి ఈడెన్‌లో జోష్ నింపాడు. విజయానికి 47 పరుగుల దూరంలో ఉండగా, కేశవ్ ఓవర్‌లో అతను 4,6,6 బాదడంతో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడనిపించింది. కానీ ఐదో బంతినీ భారీషాట్ ఆడేందుకు చూడగా అది గాల్లోకి లేచింది. దీన్ని మిడ్‌వికెట్ నుంచి వెనక్కి సిరాజ్‌ను డకౌట్ చేయడంతో సఫారీలు సంబరాల్లో మునిగిపోయారు.
అజేయ కెప్టెన్
కెప్టెన్ బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు టెస్టుల్లో ఓడిపోలేదు. తను సారథ్యం వహించిన 11 మ్యాచ్‌ల్లో పదింట్లో నెగ్గి ఒకటి డ్రా చేసుకుంది. తాజాగా 15 ఏళ్ల తర్వాత భారత్‌లో తమ జట్టుకు టెస్టు విజయాన్ని రుచి చూపించి అదుర్స్ అనిపించుకున్నాడు. ఈ సిరీస్‌కు ముందు పాక్‌తో ఆడిన రెండు టెస్టుల్లో జట్టు ఒకటి ఓడినా..దానికి మార్‌క్రమ్ కెప్టెన్‌గా ఉన్నాడు.. మరోవైపు పదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు ఆడిన స్పిన్నర్ హార్మన్ ఎనిమిది వికెట్లతో రాణించాడు. భారత్‌లో ఓ సౌతాఫ్రికా స్పిన్నర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159
భారత్ తొలి ఇన్నింగ్స్: 189
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీ) కుల్దీప్ 11, మార్‌క్రమ్ (సి) జురెల్ (బి) జడేజా 4, ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11, బవుమా (నాటౌట్) 55, జోర్జి (సి) జురెల్ (బి) జడేజా 2, స్టబ్స్ (బి) జడేజా 5, వెరీన్ (బి) అక్షర్ 9, యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13, బాష్ (బి) బుమ్రా 25, హార్మర్ (బి) సిరాజ్ 7, కేశవ్ (ఎల్బీ) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 54 ఓవర్లలో 153 ఆలౌట్. వికెట్ల పతనం: 1-18, 2-25, 3-38, 4-40, 5-60, 6-75, 7-91, 8-135, 9-153, 10-153;బౌలింగ్: బుమ్రా 10-2-24-1, అక్షర్ 14-0-36-1, కుల్దీప్ 8-1-30- 2, జడేజా 20-3-50-4, సిరాజ్ 2-0-2-2.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 0, రాహుల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1, సుందర్ (సి) హార్మర్ (బి) మార్‌క్రమ్ 31, జురెల్ (సి) బాష్ (బి) హార్మర్ 13, పంత్ (సి అండ్ బి) హార్మర్ 2, జడేజా (ఎల్బీ) హార్మర్ 18, అక్షర్ (సి) బవుమా (బి) కేశవ్ 26, కుల్దీప్ (ఎల్బీ) హార్మర్ 1, బుమ్రా (నాటౌట్) 0, సిరాజ్ (సి) మార్‌క్రమ్ (బి) కేశవ్ 0, గిల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 93 ఆలౌట్. వికెట్ల పతనం: 1-0, 2-1, 3-33, 4-38, 5-64, 6-72, 7-77, 8-93, 9-93; బౌలింగ్: యాన్సెన్ 7-3-15-2, హార్మర్ 14-1-21-4, కేశవ్ 9-1-37-2, బాష్ 2-0-14-0, మార్‌క్రమ్ 3-0-5-1.
పిచ్ బానే ఉంది: గంభీర్
బౌలర్లు ఆధిపత్యం చూపిన ఈడెన్ పిచ్‌పై విమర్శలు వ్యక్తమవుతుండగా, భారత జట్టు కోచ్ గౌతం గంభీర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘ఈ పిచ్ పూర్తిగా ఆడేందుకు వీల్లేకుండా ఏమీ లేదు. పిచ్ ఎలావుండాలని మేముకోరుకున్నామో.. అదే లభించినందుకు సంతోషంగానే ఉంది.’ అని కోచ్ గంభీర్ తెలిపాడు. అటు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు గంగూలీ సైతం భారత జట్టు కోరిక మేరకే ఈ పిచ్‌ను రూపొందించినట్టు, క్యురేటర్ ముఖర్జీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని తేల్చాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడాన్ని మాజీ బౌలర్ కుంబ్లే ప్రశ్నించాడు.
బుమ్రా క్షమాపణ?
తొలి టెస్టు ముగిశాక సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాను పేసర్ బుమ్రా క్షమాపణ కోరడం కనిపించింది. రెండో రోజు ఆటలో తను బవుమాను మరుగుజ్జుతో పోల్చిన విషయం తెలిసిందే. ఆటగాళ్లంతా పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో బవుమా భుజంపై చేయి వేసిన బుమ్రా అతడితో మాట్లాడడం కనిపించింది. అటు బవుమా మాత్రం ముఖంలో ఎలాంటి భావాలు లేకుండా కనిపించాడు.
2
భారత్‌లో జరిగిన టెస్టుల్లో స్వల్ప లక్ష్యాన్ని (124) కాపాడుకున్న రెండో జట్టుగా దక్షిణాఫ్రికా. 2004లో ఆసీ్‌సపై భారత్ 107 రన్స్‌ను కాపాడుకుంది.
ఇవి కూడా చదవండి:
IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి