Shubman Gill Leads India: గిల్ సేన విజయ గర్జన
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:26 AM
దిగ్గజ క్రికెటర్లు జట్టుకు దూరమయ్యారు.. గెలవాల్సిన తొలి టెస్టును అనుభవలేమితో కోల్పోయారు.. ఇక రెండో టెస్టులో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఏం సాధిస్తారంటూ విమర్శలు..
టీమిండియాదే రెండో టెస్టు
336 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు
రెండో ఇన్నింగ్స్‌లో 271 ఆలౌట్
ఆరు వికెట్లతో ఆకాశ్‌దీప్ విజృంభణ
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు తొలి గెలుపు
ఆకాశ్‌దీప్ (6/99)కు సహచరుల అభినందన
దిగ్గజ క్రికెటర్లు జట్టుకు దూరమయ్యారు.. గెలవాల్సిన తొలి టెస్టును అనుభవలేమితో కోల్పోయారు.. ఇక రెండో టెస్టులో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఏం సాధిస్తారంటూ విమర్శలు.. అయినా అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ యువ భారత్ ఎడ్జ్‌బాస్టస్‌లో సగర్వంగా నిలిచింది. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి భారత్ ఈ వేదికపై దండయాత్ర చేస్తున్నా గెలుపు రుచి చూసిందే లేదు. ఇదిగో.. ఇన్నాళ్లకు కెప్టెన్ గిల్ ఆధ్వర్యంలోని యువ ఆటగాళ్లు కలిసికట్టుగా చరిత్రాత్మక విజయాన్ని కళ్లముందుంచారు. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ను పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్లతో దెబ్బతీయడంతో మరో సెషన్ ఉండగానే జట్టు సంబరాలు చేసుకుంది. అంతకుముందు గిల్ బాదిన డబుల్ సెంచరీ, భారీ శతకం ఈ విజయంలో అత్యంత కీలకంగా నిలిచాయనడంలో సందేహం లేదు.
బర్మింగ్‌హామ్: టీమిండియా విజయ లాంఛనాన్ని ముగించింది. చివరి రోజు ఆదివారం ఇంగ్లండ్ డ్రా కోసం ప్రయత్నిస్తుందనుకున్నా.. భారత బౌలర్లు వారి ఆటలు సాగనీయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ సత్తాచాటితే, రెండో ఇన్నింగ్స్‌లో పేసర్ ఆకాశ్‌దీ్‌ప (6/99) స్టోక్స్ సేన భరతం పట్టాడు. దీంతో ఇంగ్లండ్‌పై 336 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్ల తర్వాత భారత్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 1967 నుంచి ఇప్పటిదాకా ఆడిన ఎనిమిది టెస్టుల్లో ఏడింటిలో ఓడిన భారత్, ఓ మ్యాచ్‌ను డ్రాగా చేసుకుంది. ఇక.. 608 పరుగుల ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38), సారథి బెన్ స్టోక్స్ (33) రాణించారు. మ్యాచ్ మొత్తమ్మీద పేసర్ ఆకాశ్‌కు పది వికెట్లు దక్కాయి. కెప్టెన్‌గా తొలి విజయం అందుకున్న శుభ్‌మన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఆరంభంలోనే రెండు వికెట్లు: చివరి రోజు ఆటకు ముందు వర్షం కురవగా, తొలి సెషన్‌కు గంటా 40 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. ఈ కారణంగా మూడు సెషన్లను 80 ఓవర్లకు కుదించారు. ఇక 608 పరుగుల అసాధ్య ఛేదన కోసం 72/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే ఆకాశ్ చక్కటి సీమ్‌తో వీరిని కుదురుకోనీయలేదు. సెషన్ నాలుగో ఓవర్‌లోనే పోప్ (24)ను బౌల్డ్ చేశాడు. తన తర్వాతి ఓవర్‌లోనే బ్రూక్ (23)ను ఎల్బీ చేయడంతో ఇంగ్లండ్ 83/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ ఊపులో వికెట్ల పతనం సాగుతుందనిపించినా.. స్టోక్స్-స్మిత్ జోడీ నిలువరించింది. స్పిన్నర్ జడేజా మాత్రం వీరిని ఇబ్బందిపెట్టాడు. కానీ సిరాజ్ ఓవర్లలో మాత్రం స్టోక్స్ బౌండరీలు రాబట్టాడు. లంచ్ బ్రేక్‌కు మరో రెండు నిమిషాలు ఉందనగా బంతి తీసుకున్న జడేజా 100 సెకన్లలోనే ఆ ఓవర్‌ను ముగించాడు. దీంతో మరో ఓవర్‌కు సమయం మిగిలింది. ఈ ఓవర్‌ను స్పిన్నర్ సుందర్ వేసి స్టోక్స్ వికెట్ తీయడంతో ఇంగ్లండ్‌కు గట్టి ఝలక్ తగిలింది. అలాగే ఆరో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
కూల్చారు..: విజయానికి కేవలం నాలుగు వికెట్ల దూరంలో భారత్ రెండో సెషన్‌ను ఆరంభించింది. అయితే వోక్స్ (7) డిఫెన్స్‌కు పరిమితం కాగా స్మిత్ ఎదురుదాడికి దిగాడు. సుందర్ ఓవర్‌లో అతడు 6,4,6తో 17 రన్స్ రాబట్టాడు. అటు వోక్స్‌ను ప్రసిద్ధ్ అవుట్ చేసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచాడు. కాసేపటికే ఆకాశ్ ఓవర్‌లో స్మిత్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఓవర్‌లో స్లో బాల్‌కు స్మిత్ ఆడిన పుల్ షాట్ సుందర్ చేతుల్లో పడింది. దీంతో ఆకాశ్ తొలిసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. అటు జడేజా ఓవర్‌లో కార్స్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న రాహుల్ వదిలేశాడు. కానీ టంగ్ (2) క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్‌లో సిరాజ్ తన కుడి వైపునకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అందుకున్నాడు. ఇక చివరి వికెట్‌ను త్వరగా తీద్దామనుకున్న భారత్‌ను కార్స్-బషీర్ కాసేపు విసిగించారు. పైగా బషీర్ (12 నాటౌట్) ఓ సిక్స్ బాదగా.. ఆకాశ్ ఓవర్‌లో కార్స్ మూడు ఫోర్లు సాధించాడు. చివరకు పదో వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యం అందించాక కార్స్‌ను ఆకాశ్ అవుట్ చేయడంతో భారత్ అద్భుత విజయం దక్కించుకుంది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 587;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407;
భారత్ రెండో ఇన్నింగ్స్: 427/6 డిక్లేర్;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్‌దీప్ 25, క్రాలే (సి/సబ్) సాయి సుదర్శన్ (బి) సిరాజ్ 0, పోప్ (బి) ఆకాశ్‌దీప్ 24, రూట్ (బి) ఆకాశ్‌దీప్ 6, బ్రూక్ (ఎల్బీ) ఆకాశ్‌దీప్ 23, స్టోక్స్ (ఎల్బీ) వాషింగ్టన్ 33, జేమీ స్మిత్ (సి) వాషింగ్టన్ (బి) ఆకాశ్‌దీప్ 88, వోక్స్ (సి) సిరాజ్ (బి) ప్రసిద్ధ్ 7, కార్స్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 38, టంగ్ (సి) సిరాజ్ (బి) జడేజా 2, బషీర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 68.1 ఓవర్లలో 271 ఆలౌట్; వికెట్ల పతనం: 1-11, 2-30, 3-50, 4-80, 5-83, 6-153, 7-199, 8-226, 9-246, 10-271; బౌలింగ్: ఆకాశ్‌దీప్ 21.1-2-99-6, సిరాజ్ 12-3-57-1, ప్రసిద్ధ్ 14-2-39-1, జడేజా 15-4-40-1, వాషింగ్టన్ సుందర్ 6-2-28-1.
1
ఒకే టెస్టులో ఎక్కువ పరుగులు (272) సాధించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా జేమీ స్మిత్. స్టివార్ట్ (204)ను అధిగమించాడు.
1
ఇంగ్లండ్‌లో జరిగిన సిరీస్‌లో ఇరు జట్ల వికెట్ కీపర్లు (పంత్-స్మిత్) కలిసి అత్యధిక పరుగులు (697) సాధించడం ఇదే తొలిసారి. గతంలో స్టివార్ట్-హీలీ (674 రన్స్) పేరిట ఈ రికార్డు ఉండేది.
1
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు (1692) నమోదవడం ఇదే తొలిసారి.
1
ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (30) నమోదవడం ఇదే మొదటిసారి.
1
‘సేనా’ దేశాలపై భారత టెస్టు జట్టుకిదే భారీ విజయం (336 రన్స్ తేడాతో).
2
ఇంగ్లండ్‌లో పది వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఆకాశ్ దీప్. గతంలో చేతన్ శర్మ (1986లో 10/188)ఈ ఫీట్ సాధించాడు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరికి ఈ ప్రదర్శన అంకితం
ఆకాశ్ దీప్
ఇప్పటి వరకు నేనీ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ రెండు నెలల క్రితం నా సోదరికి క్యాన్సర్ సోకింది. బంతి చేతికి తీసుకున్న ప్రతీసారి తన ఆలోచనలే నా మదిలో కదలాడేవి. ఈ ప్రదర్శన ఆమెకే అంకితమిస్తున్నా. అలాగే ఈ సందర్భంగా తనకో విషయం చెప్పదల్చుకున్నా. మేమంతా మీ వెంటే ఉంటాం.
ఇవీ చదవండి:
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్
టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి