Oval Test Match: అపూర్వం అద్భుతం
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:20 AM
నిస్సందేహంగా ఇది అద్భుత విజయమే.. 374 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ స్కోరు ఓ దశలో 301/3. క్రీజులో ఉన్న హ్యారీ బ్రూక్ ధనాధన్ ఆటతో బెంబేలెత్తిస్తున్నాడు.. మరో ఎండ్‌లో నిలకడకు మారుపేరు జో రూట్ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఊహిస్తారా.. మ్యాచ్‌లో...
సిరాజ్ సూపర్ షో
ఐదో టెస్టులో 6 పరుగులతో భారత్ ఉత్కంఠ విజయం
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 367
2-2తో సిరీస్ సమం
నిస్సందేహంగా ఇది అద్భుత విజయమే.. 374 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ స్కోరు ఓ దశలో 301/3. క్రీజులో ఉన్న హ్యారీ బ్రూక్ ధనాధన్ ఆటతో బెంబేలెత్తిస్తున్నాడు.. మరో ఎండ్‌లో నిలకడకు మారుపేరు జో రూట్ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఊహిస్తారా.. మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని? కానీ అదే జరిగింది. నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో టపటపా వికెట్లు తీసి మన పేసర్లు విజయంపై ఆశలు రేపారు. ఇక సోమవారం ఇంగ్లండ్‌కు 35 రన్స్, భారత్‌కు 4 వికెట్లు అవసరమవగా.. మ్యాచ్ ఏ వైపునకో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఓ దశలో ఇంగ్లండ్ వైపే మొగ్గు కనిపించినా.. మహ్మద్ సిరాజ్ గేమ్ చేంజర్‌గా మారాడు. పాత బంతితోనే సూపర్ స్వింగ్‌ను రాబడుతూ.. బుల్లెట్‌లాంటి యార్కర్లతో వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అంతే.. చేయి దాటిందనుకున్న మ్యాచ్ భారత్ ఖాతాలో చేరింది. సిరీస్ 2-2తో సమమైంది.
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌కు అదిరే ముగింపు. సిరీస్ కోసం ఆతిథ్య జట్టు.. సమం కోసం గిల్ సేన నువ్వా నేనా అనే రీతిలో తలపడిన ఐదో టెస్టులో సోమవారం అద్భుతమే జరిగింది. 374 పరుగుల ఛేదనలో మరో 35 పరుగుల కోసం చివరి రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు పేసర్ సిరాజ్ (5/104) దిమ్మతిరిగేలా చేశాడు. ప్రసిద్ధ్ (4/126) కూడా రాణించడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. అటు ఆరు పరుగుల తేడాతో గట్టెక్కిన భారత్.. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. అట్కిన్సన్ (17) పోరాటం ఇంగ్లండ్‌కు ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224, ఇంగ్లండ్ 247 పరుగులు చేయగా.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 రన్స్ చేసింది. ఈ టెస్టులో 9 వికెట్లు తీసిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా.. గిల్, బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలే (బి) సిరాజ్ 14, డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 54, పోప్ (ఎల్బీ) సిరాజ్ 27, రూట్ (సి) జురెల్ (బి) ప్రసిద్ధ్ 105, బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్ 111, బెథెల్ (బి) ప్రసిద్ధ్ 5, స్మిత్ (సి) జురెల్ (బి) సిరాజ్ 2, ఒవర్టన్ (ఎల్బీ) సిరాజ్ 9, అట్కిన్సన్ (బి) సిరాజ్ 17; టంగ్ (బి) ప్రసిద్ధ్ 0; వోక్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం: 85.1 ఓవర్లలో 367 ఆలౌట్; వికెట్ల పతనం: 1-50, 2-82, 3-106, 4-301, 5-332, 6-337, 7-347, 8-354, 9-357, 10-367. బౌలింగ్: ఆకాశ్ దీప్ 20-4-85-1, ప్రసిద్ధ్ కృష్ణ 27-3-126-4, సిరాజ్ 30.1-6-104-5, సుందర్ 4-0-19-0, జడేజా 4-0-22-0.

53 బంతుల్లోనే..
339/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఉన్న ఇంగ్లండ్ చివరి రోజు విజయం కోసం పక్కా వ్యూహంతోనే బరిలోకి దిగింది. తొలి అర్ధగంటపాటు బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఆ జట్టు కోరిక మేరకు పిచ్‌పై భారీ రోలర్‌ను ఉపయోగించి సిద్ధం చేశారు. మరో 35 పరుగులు సులువుగా రాబట్టాలని ఇంగ్లండ్ ఆలోచించింది. కానీ బరిలోకి దిగాక సీన్ మారింది.
తొలి ఓవర్: ఆదివారం ఆటలో మిగిలిన నాలుగు బంతులను ప్రసిద్ధ్ కొనసాగించాడు. అయితే తొలి రెండు బంతులనే ఒవర్టన్ (9) ఫోర్లుగా మలిచి షాకిచ్చాడు. దీంతో 8 రన్స్ రావడంతో సమీకరణం ఇంగ్లండ్‌కు మరింత అనుకూలంగా మారింది.
రెండో ఓవర్: సిరాజ్ ఈ ఓవర్‌లో చక్కటి లెంగ్త్‌తో బంతులు విసిరాడు. అలాగే ఆఫ్‌సైడ్ ఆవల వేసిన బంతిని ఆడిన జేమీ స్మిత్ (2) కీపర్ జురెల్‌కు దొరికిపోవడంతో భారత్ అవకాశాలు మరింత పెరిగాయి.
మూడో ఓవర్: ప్రసిద్ధ్ వేసిన ఈ ఓవర్‌లో నాలుగు పరుగులు రాగా.. సమీకరణం 20 రన్స్‌కి మారడంతో ఉత్కంఠ నెలకొంది.
నాలుగో ఓవర్: సిరాజ్ ఐదో బంతికి ఒవర్టన్‌ను ఎల్బీ చేసి సంబరాలను రెట్టింపు చేశాడు. అయితే బ్యాటర్ రివ్యూకు వెళ్లినా అంపైర్ కాల్ కావడంతో భారత్‌కు అనుకూలంగా నిర్ణయం వచ్చింది.
ఐదో ఓవర్: కొత్త బంతి తీసుకునే అవకాశం వచ్చినా భారత్ వద్దనుకుంది. ప్రసిద్ధ్ నాలుగో బంతికి టంగ్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే రివ్యూలో నాటౌట్‌గా తేలింది.
ఆరో ఓవర్: ఈ సమయంలో చిరు జల్లులు ఆరంభమయ్యాయి. స్టేడియంలో లైట్లను కూడా వేశారు. ఈ ఓవర్‌లో సిరాజ్ వేసిన ప్రతీ బంతి కూడా వికెట్ పడగొట్టేలా కనిపించింది.
ఏడో ఓవర్: ప్రసిద్ధ్ 141 కి.మీ వేగంతో విసిరిన అద్భుత యార్కర్‌కు టంగ్ బౌల్డయ్యాడు. ఈ దశలో ఆఖరి వికెట్‌గా భుజానికి పట్టీతోనే వోక్స్ బరిలోకి దిగాడు.
ఎనిమిదో ఓవర్: సిరాజ్ వేసిన రెండో బంతిని అట్కిన్సన్ లాంగాన్‌లో సిక్సర్‌గా మలిచి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. వోక్స్‌కు బ్యాటింగ్ రాకూడదని ఆఖరి బంతికి బ్యాట్ టచ్ కాకున్నా పరుగు తీశాడు.
తొమ్మిదో ఓవర్: ప్రసిద్ధ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసిన అట్కిన్సన్, ఆఖరి బంతికి కూడా సింగిల్ తీశాడు.
పదో ఓవర్: విజయానికి మరో ఏడు పరుగులే కావాల్సిరావడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ ఇంగ్లండ్ ఆశలకు సిరాజ్ తొలి బంతికే తెర దించాడు. 143 కి.మీ వేగంతో విసిరిన సూపర్ యార్కర్‌కు అట్కిన్సన్ బౌల్డ్ కావడంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది.
స్టెయిన్ చెప్పినట్టుగా..
ఐదో టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు తీస్తాడని సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ గత నెల 30న ఎక్స్‌లో పేర్కొన్నాడు. అతడు చెప్పినట్టుగానే రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో జట్టును గెలిపించాడు. మ్యాచ్ ముగిశాక సిరాజ్.. ‘నువ్వు అడిగావు. నేను చేశాను’ అంటూ స్టెయిన్‌కు సమాధానమిచ్చాడు.
2
ఇంగ్లండ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా కపిల్ దేవ్ (43)ను దాటేసిన సిరాజ్ (46). బుమ్రా, ఇషాంత్ (51) టాప్‌లో ఉన్నారు.
నాలుగో రోజు బ్రూక్ క్యాచ్‌ను వదిలేయడం బాధనిపించింది. దీంతో ఐదోరోజు ఉదయం లేవగానే నేనే గేమ్ ఛేంజర్ అవ్వాలని అనుకున్నా. అనుకున్నట్లే ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో పడేశాం. చివరకు ఫలితాన్ని రాబట్టాం.
- సిరాజ్
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News