RCB: కోహ్లి గ్యాంగ్ కొట్టేసింది..
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:04 AM
ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త చాంపియన్‌గా నిలిచింది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ ఆరు పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఇన్నాళ్లూ ఊరిస్తున్న కప్పు కలను నెరవేర్చుకుంది...
బెంగళూరుకు తొలి ఐపీఎల్ టైటిల్
ఫైనల్లో పంజాబ్ ఓటమి
ప్రైజ్‌మనీ
విజేత బెంగళూరుకు రూ. 20 కోట్లు
రన్నరప్ పంజాబ్‌కు రూ. 12.5 కోట్లు
‘ఈ సాల కప్ నమ్దే..’ అవును.. ప్రతీ సీజన్‌ను ఇదే నినాదంతో హోరెత్తించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరకు సాధించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఈసారి కప్ కొట్టామంటూ బెంగళూరు ఫ్యాన్స్ దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలు చేసుకున్నారు. ఐపీఎల్ మొదలు నుంచీ టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఈ అద్భుత విజయంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఫైనల్లో తమ బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా.. బౌలర్లు మాత్రం దుమ్మురేపడంతో ఆర్‌సీబీ తొలి టైటిల్‌తో మురిసిపోయింది. అటు క్వాలిఫయర్2లో కనిపించిన పంజాబ్ పరాక్రమం అసలైన మ్యాచ్‌లో లోపించింది. కెప్టెన్ శ్రేయాస్ కేవలం సింగిల్ రన్‌కే పరిమితం కావడం దెబ్బతీసింది. ఆఖరి ఓవర్‌లో శశాంక్ బ్యాట్ ఝుళిపించినా.. ఒక్క ‘సిక్సర్’ దూరంలోనే వీరికి టైటిల్ అందకుండా పోయింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త చాంపియన్‌గా నిలిచింది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ ఆరు పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఇన్నాళ్లూ ఊరిస్తున్న కప్పు కలను నెరవేర్చుకుంది. మరోవైపు క్రితంసారి కోల్‌కతాను విజేతగా నిలిపిన కెప్టెన్ శ్రేయాస్ ఈసారి చివరి మెట్టుపై బోల్తా పడ్డాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ (35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్, జేమిసన్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 నాటౌట్) పోరాడగా, ఇన్‌గ్లి్‌స (23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 39) ఫర్వాలేదనిపించాడు. క్రునాల్, భువనేశ్వర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా క్రునాల్ పాండ్యా నిలిచాడు.
చేరువుగా వచ్చినా..: ఓ మాదిరి ఛేదనలో పంజాబ్ ఆరంభం కూడా ధాటిగా ఏమీ సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. కానీ ఆఖర్లో శశాంక్ మెరుపులు మెరిపించినా స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ (26), ప్రియాన్ష్ (24) బౌండరీల జోరుకు తొలి రెండు ఓవర్లలో 23 పరుగులతో మెరుపు ఆరంభమే దక్కింది. హాజెల్‌వుడ్ బరిలోకి దిగడంతో కష్టాలు ఆరంభమయ్యాయి. అతడి ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ప్రియాన్ష్ రెండు ఫోర్లు బాదినా.. బౌండరీ లైన్ దగ్గర సాల్ట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి క్యాచ్ పట్టేశాడు. తొలి వికెట్‌కు వీరు 43 పరుగులు జోడించారు. ఎనిమిదో ఓవర్‌లో ఇన్‌గ్లి్‌స, ప్రభ్ చెరో సిక్సర్‌తో 15 రన్స్ వచ్చాయి. కానీ 9,10 ఓవర్లలో పంజాబ్‌కు గట్టి ఝలక్ తగిలింది. ముందుగా స్పిన్నర్ క్రునాల్.. ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేయగా, ఇక అత్యంత ప్రమాదకర కెప్టెన్ శ్రేయాస్ (1)ను షెఫర్డ్ పెవిలియన్‌కు చేర్చడం మలుపు తిప్పింది. దీంతో నరేంద్ర మోదీ స్టేడియంలో హోరు ఆకాశాన్నంటింది. ఇక మ్యాచ్ మనదే అనే భావన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌తో పాటు ఆటగాళ్లలోనూ కనిపించింది. అయితే పంజాబ్ మాత్రం క్రీజులో చక్కగా కుదురుకున్న ఇన్‌గ్లి్‌సపై ఆశలు పెట్టుకుంది. దీనికి తగ్గట్టుగానే అతడు క్రునాల్, షెఫర్డ్ ఓవర్లలో సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సంబరం కూడా ఎక్కువ సేపు లేకుండా 13వ ఓవర్‌లో అతడిని క్రునాల్ అవుట్ చేశాడు. ఈ దశలో శశాంక్, నేహల్ (15) జోడీ ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడించింది. 17వ ఓవర్‌లో నేహల్‌తో పాటు వచ్చీ రాగానే సిక్సర్ బాదిన స్టొయినిస్ (6)ను భువనేశ్వర్ పెవిలియన్‌కు చేర్చడంతో ఇక పంజాబ్ చేసేదేమీ లేకపోయింది. 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి రాగా.. 6,4,6,6తో శశాంక్ 22 పరుగులతో ఓటమి తేడాను మాత్రమే తగ్గించగలిగాడు.

కట్టడి చేశారు..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. విరాట్ టాప్ స్కోరర్‌గా నిలిచినా అతడి ఆటలో వేగం లోపించింది. మిడిలార్డర్‌లో రజత్, జితేశ్, లివింగ్‌స్టోన్ ఎదురుదాడి ప్రయత్నం కాసేపే అయ్యింది. పంజాబ్ బౌలర్ల విజృంభణకు డెత్ ఓవర్లలో 45 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ స్కోరు 200లోపే ముగిసింది. తొలి ఓవర్‌లోనే 6,4 బాదిన ఓపెనర్ సాల్ట్ (16) రెండో ఓవర్‌లో శ్రేయాస్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత పవర్‌ప్లేలో మయాంక్ (24) వేగం చూపడంతో స్కోరు 55/1తో నిలిచింది. చాహల్ తన తొలి ఓవర్‌లోనే మయాంక్‌ను అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆర్‌సీబీ తొలి పది ఓవర్లలో 18 డాట్ బాల్స్ ఆడగా, విరాట్ బ్యాట్ నుంచి రెండు ఫోర్లు మాత్రమే రావడం గమనార్హం. ఉన్నకాసేపు కెప్టెన్ రజత్ పటీదార్ (26) రెండు సిక్సర్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 11వ ఓవర్‌లో అతడిని జేమిసన్ ఎల్బీ చేయడంతో మూడో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం చాహల్, వైశాక్ కట్టడి చేయడంతో ఆర్‌సీబీ రన్స్ కోసం ఇబ్బందిపడింది. చివరకు 14వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ 6, విరాట్ 4తో 14 రన్స్ సమకూరాయి. అయితే సహజశైలిలో భారీషాట్లు ఆడలేకపోయిన కోహ్లీ పుల్‌షాట్ ఆడే ప్రయత్నంలో అజ్మతుల్లాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో వచ్చిన జితేశ్ 16వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో 2 సిక్సర్లతో అదుర్స్ అనిపించాడు. జేమిసన్ ఈ ఓవర్‌లో 23 పరుగులిచ్చుకున్నా లివింగ్‌స్టోన్ (25) వికెట్ తీయగలిగాడు. ఈ జోడీ మధ్య ఐదో వికెట్‌కు 12 బంతుల్లోనే 36 పరుగులు జత చేరాయి. అటు చక్కటి టచ్‌లో కనిపించిన జితేశ్‌ను పేసర్ వైశాక్ బౌల్డ్ చేయగా.. 19వ ఓవర్‌లో షెఫర్డ్ 4,6తో 14 రన్స్ అందించాడు. గతంలో చెన్నైపై అతడి హిట్టింగ్‌ను చూసిన ఫ్యాన్స్..ఈసారి కూడా భారీస్కోరు చేస్తాడని భావించారు. అయితే అర్ష్‌దీప్ ఆఖరి ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చి షెఫర్డ్ (17), క్రునాల్ (4), భువనేశ్వర్ (1)ల వికెట్లతో వహ్వా.. అనిపించాడు.
స్కోరుబోర్డు
బెంగళూరు: సాల్ట్ (సి) శ్రేయాస్ (బి) జేమిసన్ 16, విరాట్ కోహ్లీ (సి అండ్ బి) ఒమర్జాయ్ 43, మయాంక్ అగర్వాల్ (సి) అర్ష్‌దీప్ (బి) చాహల్ 24, పటీదార్ (ఎల్బీ) జేమిసన్ 26, లివింగ్‌స్టోన్ (ఎల్బీ) జేమిసన్ 25, జితేశ్ (బి) వైశాక్ 24, షెఫర్డ్ (ఎల్బీ) అర్ష్‌దీప్ 17, క్రునాల్ పాండ్యా (సి) శ్రేయాస్ (బి) అర్ష్‌దీప్ 4, భువనేశ్వర్ (సి) ప్రియాన్ష్ (బి) అర్ష్‌దీప్ 1, యశ్ దయాల్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 190/9; వికెట్ల పతనం: 1-18, 2-56, 3-96, 4-131, 5-167, 6-171, 7-188, 9-189, 9-190; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-40-3, జేమిసన్ 4-0-48-3, ఒమర్జాయ్ 4-0-35-1, వైశాక్ 4-0-30-1, చాహల్ 4-0-37-1.
పంజాబ్: ప్రియాన్ష్ (సి) సాల్ట్ (బి) హాజెల్‌వుడ్ 24, ప్రభ్‌సిమ్రన్ (సి) భువనేశ్వర్ (బి) క్రునాల్ 26, ఇన్‌గ్లిస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) క్రునాల్ 39, శ్రేయాస్ (సి) జితేశ్ (బి) షెఫర్డ్ 1, నేహల్ (సి) క్రునాల్ (బి) భువనేశ్వర్ 15, శశాంక్ సింగ్ (నాటౌట్) 61, స్టొయినిస్ (సి) యశ్ (బి) భువనేశ్వర్ 6, ఒమర్జాయ్ (సి/సబ్) భండగె (బి) యశ్ దయాల్ 1, జేమిసన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: 20 ఓవర్లలో 184/7; వికెట్ల పతనం: 1-43, 2-72, 3-79, 4-98, 5-136, 6-142, 7-145; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-38-2, యశ్ దయాల్ 3-0-18-1, హాజెల్‌వుడ్ 4-0-54-1, క్రునాల్ 4-0-17-2, సుయాశ్ 2-0-19-0, షెఫర్డ్ 3-0-30-1.

విరాట్.. ఏడ్చేశాడు
ఆధునిక క్రికెట్‌లో అత్యున్నత ఆటగాడైనా తన కెరీర్‌లో ఇప్పటి దాకా ఐపీఎల్ టైటిల్ లేని లోటు విరాట్ కోహ్లీని వేధిస్తూనే వచ్చింది. అందుకే సుదీర్ఘ విరామం తర్వాత చాంపియన్‌గా నిలిచామనే వాస్తవాన్ని కోహ్లీ కూడా కాసేపు నమ్మలేకపోయాడేమో.. ఆఖరి ఓవర్‌లో రెండో బంతి ముగియగానే భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. అప్పటికి 4 బంతుల్లో 29 రన్స్ అవసరమవడంతో ఆర్‌సీబీ గెలుపు ఖాయమైంది. దీంతో విరాట్ తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. మైదానంలోకి వచ్చిన భార్య అనుష్కను కౌగిలించుకుని చాలా సేపు అలాగే ఉండిపోయాడు. ఇదిలావుండగా.. తమ అభిమాన క్రికెటర్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కావడం.. అటు అతనికి ఐపీఎల్ టైటిల్ కూడా 18వ సీజన్‌లోనే దక్కడం అభిమానులకు మరింత ఆనందాన్నిస్తోంది.
ఈ సీజన్ హీరోలు
ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్
(15 మ్యాచ్‌ల్లో 759 పరుగులు, గుజరాత్)
పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ
(15 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు, గుజరాత్)
అత్యంత విలువైన ఆటగాడు -సూర్యకుమార్
ఉత్తమ వర్ధమాన ఆటగాడు- సాయి సుదర్శన్
ఫెయిర్ ప్లే- చెన్నై సూపర్ కింగ్స్
ఉత్తమ పిచ్ అవార్డు- ఢిల్లీ క్యాపిటల్స్
1
అరంగేట్ర సీజన్‌లో ఎక్కువ పరుగులు (475) చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ప్రియాన్ష్ ఆర్య
ఇవీ చదవండి:
గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!
బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి