Share News

‘బెంగళూరు’ సారథి రజత్‌ పటీదార్‌

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:07 AM

ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) నూతన సారథిగా రజత్‌ పటీదార్‌ (31) నియమితుడయ్యాడు. గతేడాది జట్టుకు నాయకత్వం వహించిన ఫా డుప్లెసిని ఫ్రాంచైజీ వదిలేసుకోవడంతో...

‘బెంగళూరు’ సారథి రజత్‌ పటీదార్‌

బెంగళూరు: ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) నూతన సారథిగా రజత్‌ పటీదార్‌ (31) నియమితుడయ్యాడు. గతేడాది జట్టుకు నాయకత్వం వహించిన ఫా డుప్లెసిని ఫ్రాంచైజీ వదిలేసుకోవడంతో ఈ సీజన్‌లో జట్టు పగ్గాలను ఎవరికి అప్పగిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. మళ్లీ కోహ్లీకే కెప్టెన్సీ కట్టబెడతారనే ఊహాగానాలు కూడా బలంగా వినిపించాయి. కానీ, గురువారం అనూహ్యంగా పటీదార్‌ పేరును ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. గత నవంబరులో బెంగళూరు అట్టిపెట్టుకున్న వారిలో రజత్‌ ఒకడు. దేశవాళీ టోర్నీలైన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీల్లో మధ్యప్రదేశ్‌కు రజత్‌ నాయకత్వం వహించాడు. అతడు జట్టును నడిపించిన విధానాన్ని నిశితంగా గమనించామని కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ చెప్పాడు. భారత జట్టు తరఫున రజత్‌ మూడు టెస్టులు, ఒక వన్డే ఆడాడు. కాగా, కొత్త కెప్టెన్‌కు కోహ్లీ శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఈ స్థానంలో ఉండడానికి తగిన అర్హత సాధించావు. మేమంతా నీ వెనుకే ఉంటాం. నువ్వు సారథిగా ఎదగడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామ’ని వీడియో సందేశంలో విరాట్‌ చెప్పాడు.


రాజస్థాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా బహుతులే

రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు సాయిరాజ్‌ బహుతులే నియమితుడయ్యాడు. లెగ్‌ స్పిన్నర్‌ అయిన బహుతులే భారత్‌ తరఫున రెండు టెస్ట్‌లు, ఎనిమిది వన్డేలు ఆడాడు. ముంబై, బెంగాల్‌, కేరళ జట్లకు అతడు మెంటార్‌గానూ పని చేశాడు. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కలసి పనిచేయడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నట్టు బహుతులే చెప్పాడు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 02:07 AM